అమెరికా-ఆఫ్ఘన్ శాంతి ఒప్పందం: సమ్మోదమా... సందేహమా?

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో శాంతి-సుస్థిరతలు లక్ష్యంగా అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు పూర్తయిన రెండు రోజులకే తాలిబన్లు మాటమార్చారు. ఆ మేరకు ఆఫ్ఘన్ జాతీయ భద్రత-రక్షణ దళాలపై తమ సైనిక కార్యకలాపాలను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ఖతర్ రాజధాని దోహా నగరంలో తొమ్మిది దఫాల చర్చల తర్వాత అందరూ ఆసక్తితో ఎదురుచూసిన శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చింది. దీనిపై అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మయ్ ఖ‌లీల్‌జాద్‌, తాలిబన్ల ఉప నాయకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బిరాదర్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కీలకాంశాల్లో- ‘‘కాల్పుల విరమణ, విదేశీ దళాల ఉపసంహరణ, ఆఫ్ఘన్ అంతర్గత సంప్రదింపులు, ఉగ్రవాద నిరోధంపై హామీ’’ అత్యంత ప్రధానమైనవి. తదనుగుణంగా 10 రోజుల్లోగా తమ దళాల దశలవారీ ఉపసంహరణ ప్రారంభానికి అమెరికా అంగీకరించింది. ఇందులో భాగంగా తమ సైనిక సిబ్బంది సంఖ్యను 135 రోజుల్లో 8,600 స్థాయికి తగ్గిస్తామని ప్రకటించింది. మొత్తంమీద 14 నెలల వ్యవధిలో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాల సంపూర్ణ ఉపసంహరణ పూర్తి కావాలన్నది శాంతి ఒప్పంద నిర్దేశం. అలాగే వివిధ జైళ్లలో ఉన్న 5 వేలమంది తాలిబన్ ఖైదీలను ఈ నెల 20లోగా విడుదల చేయాల్సిందిగా ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని కోరుతామని అమెరికా హామీ ఇచ్చింది. అంతేకాకుండా తదుపరి మూడు నెలల వ్యవధిలో తాలిబన్ ఖైదీలందరి విడుదలకు అంగీకారం తెలిపింది. అయితే....

శాంతి ఒప్పందం కుదిరిందన్న మాటేగానీ, అంతర్గతంగానేగాక అంతర్జాతీయంగానూ దీనిపై సమ్మోద... సందేహాలు తలెత్తాయి. ఆఫ్ఘన్ ప్రజలకు, వెలుపలి ప్రపంచానికి సంబంధించి తాలిబన్లలోని కరడుగట్టిన భావజాలంసహా ఇతర తిరుగుబాటు బృందాలతో వారికిగల అనుబంధాలే సందేహాలకు కారణం. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వైదొలగితే భద్రత శూన్యం ఏర్పడి, ఏకంగా దక్షిణాసియా ప్రాంతమంతటా అనిశ్చితి రాజ్యమేలే ప్రమాదం ఉందని పలువురు ఆందోళనపడుతున్నారు. ఆఫ్ఘన్లలో అధికశాతం శాంతి ప్రక్రియకు మద్దతు పలుకుతున్నప్పటికీ అంతర్గత సంప్రదింపులలో పరిష్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా అధికారంలో భాగస్వామ్యం, తాలిబన్ల నిరాయుధీకరణ, వారిని మళ్లీ ఆఫ్ఘన్ పౌరసమాజంలో భాగం చేయడం అత్యంత సంక్లిష్ట అంశాలు.

దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థల భవిష్యత్తును నిర్ణయించడం మరో ఎడతెగని సమస్య. అలాగే ఆఫ్ఘన్ కేంద్ర ప్రభుత్వం జాతి, వర్గ, గిరిజన వైరుధ్యాలతో కొట్టుమిట్టాడుతూ బలహీనంగా ఉన్నందున శాంతి ప్రక్రియ క్లిష్టంకాగల అవకాశాలే అధికం. మరోవైపు గడచిన 18 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా తాలిబన్లు బలం పుంజుకున్నట్లు కనిపిస్తున్నారు. దేశంలోని అనేక జిల్లాలు ఇప్పటికే దాదాపు 60 వేలమంది సాయుధ సభ్యులున్న తాలిబన్ల గుప్పిట్లో ఉన్నాయి. దీనికితోడు దేశ రాజధాని కాబూల్ సహా ఆఫ్ఘన్ భద్రత దళాల స్థావరాలపైనా భారీ దాడులు కొనసాగిస్తున్నారు. అంతేగాక తాలిబన్లలోని పలు చీలిక సంస్థలు, ఇతర బృందాలు శాంతి చర్చలపై ఆసక్తి చూపలేదు. అందువల్ల అమెరికా దళాలపై దాడులు కొనసాగి, శాంతి ఒప్పందానికి తూట్లుపడే పరిస్థితి ఏర్పడవచ్చు.

ఇదంతా ఒక ఎత్తయితే... తమ సంస్థ సభ్యులైన 5 వేలమంది ఖైదీలను విడుదల చేయనిదే ఆఫ్ఘన్ ప్రభుత్వంతో అంతర్గత చర్చల ప్రసక్తి ఉండదని తాలిబన్లు ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ, ఖైదీల విడుదలద్వారా తమ ఆగర్భ శత్రువుకు వేల సంఖ్యలో సభ్యులతో అదనపు బలం చేకూర్చడానికి దేశాధ్యక్షుడు ఘనీ నేతృత్వంలోని ప్రభుత్వం సుముఖంగా లేదు. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా వరుస దాడులతోపాటు తమవారి విడుదల కోసం తాజా డిమాండుతో తాలిబన్లు శాంతి ప్రక్రియను పట్టాలు తప్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక చర్చల సందర్భంగా ఇటు తాలిబన్లకు తోడ్పాటు, అటు అమెరికాకు సాయం చేసిన పాకిస్థాన్ శాంతి ఒప్పందాన్ని స్వాగతించింది. కానీ... అంతర్జాతీయ ఆర్థిక కార్యాచరణ సంస్థ ‘నిఘా జాబితా’ నుంచి తమను తప్పించేందుకు అమెరికా సాయపడకపోతే సదరు ఒప్పందాన్ని నీరుగార్చేందుకు వెనుకాడబోదు. మరోవైపు తదుపరి చర్చలకు అతిథ్యమిస్తామని జర్మనీ, నార్వే దేశాలు ప్రకటించినప్పటికీ అందుకు వేదిక ఇంకా ఖరారు కాలేదు. మొత్తంమీద శాంతి ఒప్పందం నేటికీ అందరి ఆమోదం పొందలేదన్న మాట నిజం. ఆఫ్ఘనిస్తాన్ అనిశ్చిత రాజకీయ, భద్రత పరిస్థితుల దృష్ట్యా అటు రణక్షేత్రంలో, ఇటు సంప్రంపుల రంగంలో చాలా యుద్ధం జరగక తప్పదనిపిస్తోంది.

భారత్ విషయానికొస్తే- ఆఫ్ఘ‌నిస్థాన్‌కు గట్టి మద్దతుదారు పాత్ర పోషిస్తోంది. ఈ మేరకు 2001 నుంచి 300 కోట్ల అమెరికా డాలర్ల విలువైన మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులతోపాటు వాణిజ్యాభివృద్ధికి తోడ్పడింది. అంతర్యుద్ధంతో కునారిల్లిన ఆఫ్ఘ‌నిస్థాన్‌లో అతలాకుతలమైన విద్య, ఆరోగ్య రంగాల పునరుద్ధరణకు ఎంతగానో సాయం చేసింది. పాకిస్థాన్ ప్రభావం నుంచి ఆఫ్ఘ‌నిస్థాన్‌ను తప్పించడం ద్వారా ఆ భూభాగం ఉగ్రవాదుల స్థావరం కాకుండా చూడాలన్నది భారత్ ప్రధాన లక్ష్యం. తాలిబన్లపైనా భారత్ వైఖరి ఆదినుంచీ దృఢంగానే ఉంది. సదరు ఉగ్రవాద మూకకు రాజకీయ సంస్థగా చట్టబద్ధత కల్పించడాన్ని తీవ్రంగా తిరస్కరించింది. ఆఫ్ఘన్ నేతృత్వంలో సుస్థిర శాంతికి భరోసా ఇవ్వగలిగే ఆఫ్ఘన్ సొంత శాంతి-సమన్వయ ప్రక్రియకు భారత్ సదా మద్దతు పలుకుతోంది. సమైక్య, సార్వభౌమ, ప్రజాస్వామ్య, సార్వజనీన, సుస్థిర, సౌభాగ్య ఆఫ్ఘనిస్థాన్ రూపొందడమే తమ ఆకాంక్షగా పలుమార్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2001 నుంచి సాధించిన విజయాల పరిరక్షణలో అంతర్జాతీయ సమాజం ఆఫ్ఘ‌నిస్థాన్‌కు చేయూతనిస్తేనే అక్కడ శాశ్వత శాంతి సాధ్యమన్నది తిరుగులేని వాస్తవం!

రచన: డాక్ట‌ర్ స్మిత, ఆఫ్ఘన్-పాక్ వ్య‌వ‌హారాల వ్యూహాత్మ‌క విశ్లేష‌కులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన