నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

ఆఫ్రికా దేశాల‌పై మ‌రింత దృష్టిపెట్టి వాటితో ఇంకా స‌న్నిహిత‌మైన‌, ఆర్థిక సంబంధాల‌ను పెంచుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో భాగంగా భార‌త విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి డా.ఎస్‌.జైశంక‌ర్ ఈవారం మొద‌ట్లో నైజ‌ర్ టునీషియాల‌ను సంద‌ర్శంచారు. ఐక్య‌రాజ్య‌స‌మితిలోని భ‌ద్ర‌తామండ‌లిలో శాశ్వ‌తం కాని స‌భ్యులుగా భార‌త‌దేశానికి స‌హాయం చేసిన‌ప్ప‌టి నుంచి ఈ ఆఫ్రికా దేశాల‌కు భార‌త్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. విదేశీ మంత్రిత్వ శాఖ ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నించి జైశంకర్ ఆఫ్రికా సంద‌ర్శించ‌టం ఇదే మొద‌టిసారి.

నియామీ నైజర్ సంద‌ర్శ‌న సంద‌ర్భంగా డా.జైశంక‌ర్‌, నైజ‌ర్ అధ్య‌క్షుడు మ‌హ‌మ‌దౌ ఇసౌఫోను క‌లుసుకున్నారు. ఇద్ద‌రు నాయ‌కులు సంయుక్తంగా మ‌హాత్మాగాంధి అంత‌ర్జాతీయ క‌న్వెష‌న్ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్ర‌స్తుతం మ‌హాత్మాగాంధి 150వ జ‌యంతిని పాటిస్తున్న సంద‌ర్భంగా ఆయ‌న స్మృతికి గౌర‌వ‌సూచ‌కంగా ఈ కేంద్రాన్ని నెల‌కొల్పారు. ఆఫ్రికాలో భార‌త్ ఏర్పాటు చేసిన తొలి కేంద్రం ఇది.

ఈ కేంద్రం స్థాప‌న భార‌త్ - నైజ‌ర్ స్నేహ బంధాల‌లో ఒక మైలురాయిగా నిలుస్తుంది. అంతేకాదు ఆఫ్రికా ప‌ట్ల భార‌త్ నిబ‌ద్ధ‌త‌కు చిహ్నంగా కూడా నిలుస్తుంది. ఈ కేంద్రాన్ని విశాలంగా అధునాత‌న‌, ప‌ర్యావ‌ర‌ణ అనుకూల - స‌దుపాయాల‌తో నిర్మించారు. 2 వేల మందికి చోటు క‌ల్పించే ప్లీన‌రీ హాలు ఇందులో ఉంది. ఆఫ్రికా యూనియ‌న్ (ఏయు) స‌భ్య‌దేశాల నుంచే కాక ఇత‌ర ఉన్న‌త‌స్థాయి స‌మావేశాల‌లో ఉన్న‌త‌స్థాయి, విస్తృత ప‌రిధి స‌భ్యులు పాల్గొనేందుకు ఈ హాలు అనువుగా ఉంటుంది.

నియామీలో బ‌స సంద‌ర్భంగా విదేశాంగ‌మంత్రి నైజ‌ర్ ప్ర‌ధాన‌మంత్రి బ్రిగి ర‌ఫినిని కూడా క‌లిసారు. ఆ దేశ విదేశాంగ మంత్రి క‌ల్లా అంక్కోరావుతో ద్వైపాక్షిక, ప్రాంతీయ‌, భౌగోళిక అంశాల‌పై విస్తృత‌స్థాయి చ‌ర్చ‌లు జ‌రిపారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాల బ‌లోపేతానికి ఇరుప‌క్షాలు ఒప్పందాల‌పై సంత‌కాలు చేసాయి. ఉగ్ర‌వాదంపై పోరు స‌హా అభివృద్ధి, భ‌ద్ర‌త‌కు చెంది ఇరుప‌క్షాలు ఎదుర్కొనే స‌వాళ్ళ‌పై చ‌ర్చించారు.

ఇటీవ‌లి సంవ‌త్స‌రాల‌లో రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక బంధాలు గ‌ణ‌నీయంగా విస్త‌రించాయి. ర‌వాణా, విద్యుద్దీక‌ర‌ణ‌, సౌర ఇంధ‌నం, మంచినీటి ప్రాజెక్టుల‌లో నైజ‌ర్ కు భార‌త్ రుణ స‌హాయం అంద‌జేసింది. భార‌త సాంకేతిక‌, ఆర్థిక స‌హ‌కారం (ఐటిఈసి) కింద భార‌త సామ‌ర్థ్య నిర్మాణ శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల ద్వారా వంద‌లాది నైజ‌ర్ అధికారులు ల‌బ్ధి పొందారు. నియామీలో గ‌త జులైలో జ‌రిగిన ఏయు శిఖ‌రాగ్ర స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌లో కూడా భార‌త్ స‌హాయం చేసింది.

అలాగే నైజ‌ర్ కూడా అంత‌ర్జాతీయ వేదిక‌ల‌లో వివిధ ప‌ద‌వుల‌కు భార‌త్ అభ్య‌ర్ధిత్వానికి మ‌ద్ద‌తు తెలుపుతూ వ‌స్తోంది. ప్ర‌పంచ క‌స్ట‌మ్స్ సంస్థ‌లో డైరెక్ట‌రు పద‌వికి, 2020 -2023 మ‌ధ్య ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ 2019-2022 కాలానికి ఐసిఏఓ కౌన్సిల్ ఎక్స్‌ట‌ర్న‌ల్ ఆడిట‌ర్ స్థానానికి భార‌త్ కు మ‌ద్ద‌తును అందించింది. ఇక 2016-17లో నైజ‌ర్ తో భార‌త్ వాణిజ్యం 81.27 మిలియ‌న్ అమెరికా డాల‌ర్ల మేర వుండ‌గా 2017-18 నాటికి 140.45 మిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింది. 2019-20లో నైజ‌ర్ కు 151.76 మిలియ‌న్ అమెరికా డాల‌ర్ల మేర భార‌త్ ఎగుమ‌తులు జ‌రుగ‌గా నైజ‌ర్ నుంచి భార‌త్ కు 0.34 మిలియ‌న్ డాల‌ర్లుగా ఉన్నాయి.

డా.జ‌య‌శంక‌ర్ టునీషియా సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ఆ దేశంలో స‌మాచార - క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ ఆవిష్క‌ర‌ణ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ఒప్పందంపై ఉభ‌య దేశాల‌మ‌ధ్య సంత‌కాలు జ‌రిగాయి. టునీషియా అధ్య‌క్షుడు కైస్ స‌యీద్, విదేశాంగ మంత్రి సాబ్రీ బ‌చ్ తోబ్జి ల‌తో జైశంక‌ర్ స‌మావేశమై ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల విస్త‌ర‌ణ‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. బ‌హుళ‌ప‌క్ష వేదిక‌ల‌పై స‌న్నిహితంగా ప‌ని చేయాల‌ని అంగీక‌రించారు. ట్యునీషియా ఫాస్ఫేట్ల‌కు న‌మ్మ‌ద‌గిన వ‌న‌రుగా ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ట్యునిషియా జ‌రిపే ఫాస్ఫ‌రిక్ ఆమ్లం ఎగుమ‌తుల‌లో సుమారు 50 శాతం భార‌త‌దేశానికే జ‌రుగుతున్నాయి.

2017లో న్యూఢిల్లీలో జ‌రిగిన ట్యునీషియా - భార‌త్ జాయింట్ క‌మిటీ స‌మావేశం నిర్ణ‌యాలు, సిఫార్సు అలాగే ఆసంద‌ర్భంలో చేప‌ట్టిన విజ‌న‌రీ రోడ్ మ్యాప్ నేప‌థ్యంలో భార‌త విదేశాంగ మంత్రి ప‌ర్య‌ట‌నకు ప్రాముఖ్యం ఏర్ప‌డింది. ఈ చర్య‌ల కార‌ణంగా అనేక కీల‌క‌రంగాల‌లో భార‌త్ - ట్యునీషియా భాగ‌స్వామ్యం నూత‌న కోణంలో సాగుతుంద‌ని భావిస్తున్నారు.

పైగా 1958 నించి భార‌త్ విదేశాంగ మంత్రి ఒక ఉత్త‌ర ఆఫ్రికా దేశాన్ని సంద‌ర్శించ‌టం ఇది రెండోత‌డ‌వ మాత్ర‌మే.

యుఎన్ భ‌ద్ర‌తామండ‌లిలో నాన్ ప‌ర్మ‌నెంటు స‌భ్యులైన నైజ‌ర్ - ట్యునీషియా నుండి భార‌త్‌కు ప‌దేప‌దే మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. అందుచేత భార‌త్ కూడా వారి మ‌ద్ద‌తుకు ప్ర‌శంస‌లు, కృత‌జ్ఞ‌త‌లు తెలిపే రీతిలో ఈ మిత్ర దేశాల‌తో దౌత్య సంబంధాల‌ను కొన‌సాగిస్తోంది.




ఆంగ్ల ర‌చ‌న - వినీత్ వాహి, జ‌ర్న‌లిస్టు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన