మ‌య‌న్మార్‌తో మ‌రింత ముందుకు భార‌త్ దౌత్య సంబంధాలు

మయన్మార్ గణతంత్ర సమాఖ్య అధ్యక్షుడు ‘వూ విన్ మింట్’ భారత పర్యటనకు వచ్చారు. విమానాశ్రయంలో ఘన స్వాగతం అనంతరం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ఆయన సమావేశమయ్యారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- ఆయనతో ప్రతినిధి బృందం స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. భారత విదేశీ విధానంలో భాగమైన ‘తూర్పు కార్యాచరణ, పొరుగుకు ప్రాధాన్యం’ సూత్రాల మేరకు భారతదేశానికి మయన్మార్ ఎంతో కీలకం. ఆగ్నేయాసియాతో వ్యూహాత్మక, విస్తృత ఆర్థిక సంబంధాల విస్తరణ భారత ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి. ఈ దిశగా ముందుకు సాగాలంటే ‘‘సీఎల్ఎంవీ’’గా వ్యవహరించే కంబోడియా, లావో రిపబ్లిక్, మయన్మార్, వియత్నాంలతో సన్నిహిత సంబంధాలు నెరపడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో దేశాధినేతలిద్దరూ పరస్పర ప్రయోజన సంబంధిత ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.

వూ విన్ మింట్ ఉన్నతస్థాయి పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక సహకారం విస్తృతి కోసం పది అవగాహన ఒప్పందాలు, ఒడంబడికలపై సంతకాలు పూర్తయ్యాయి. మ‌య‌న్మార్‌లోని రాఖైన్ రాష్ట్రంలో సామాజిక-ఆర్థికాభివృద్ధికి తన కట్టుబాటును భారత్ పునరుద్ఘాటించింది. తదనుగుణంగా రాఖైన్ రాష్ట్ర ప్రగతి పథకం కింద పరస్పర సహకారంతో వివిధ అభివృద్ధి, నిర్మాణ కార్యకలాపాలు చేపడతారు. ఈ జాబితాలో- ‘రాక్ యూ’ పట్టణ ఆస్పత్రిలో వ్యర్థాల దహన వ్యవస్థ, ‘గ్వా’ పట్టణంలో విత్తన గిడ్డంగులు, నీటిసరఫరా వ్యవస్థ నిర్మాణం, ఐదు శివారు పట్టణాలకు సౌరశక్తితో విద్యుత్ సరఫరా, ‘చాలియాంగ్-ఒలిఫ్యూ’ రహదారి, ‘ఫూ-తీటా’ పట్టణ పరిధిలో ‘చాంగ్‌టాంగ్‌-చాపాంగ్’ రహదారి నిర్మాణం తదితర పనులు ఉన్నాయి. కాగా, 2019లో ఉత్తర రాఖైన్ రాష్ట్రంలో ప్రజలు నిరాశ్రయులైనప్పుడు వారికి గూడు కల్పించడం కోసం భారత ప్రభుత్వం సహాయ సామగ్రితోపాటు తక్షణ నిర్మాణ గృహ సామగ్రిని సరఫరా చేసింది. దీంతోపాటు మెకాంగ్-గంగా సహకార యంత్రాంగం కింద అధిక ప్రయోజన సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులు, సత్వర ప్రయోజన ప్రాజెక్టుల నిర్మాణంలోనే రెండు దేశాల మధ్య ప్రగతి సహకార ఒప్పందం కూడా ఉంది.

భారత ప్రాంతీయ అనుసంధాన ప్రణాళికల్లో మయన్మార్ అత్యంత కీలకం. ఇందులో భాగంగా సిత్వే రేవు, కాలాదాన్ బహువిధ రవాణా-ప్రయాణ ప్రాజెక్టులకు చాల ప్రాధాన్యముంది. ఆ మేరకు సిత్వే రేవు, పలెత్వా దేశీయ జలరవాణా కేంద్రాల నిర్వహణ కోసం ఒక రేవు నిర్వాహక సంస్థను 2020 ఫిబ్రవరిలోనే నియమించారు. ఈ నేపథ్యంలో సిత్వే రేవు-ఈశాన్య భారతలను కలిపే పలెత్వా- జోరిన్‌పుయ్‌ రహదారి, కాలాదాన్ హైవేల సత్వర పూర్తికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేగాక త్రిపక్ష హైవేలో భాగమైన కలెవా-యార్గీ సెక్షన్ రహదారి పనులు 2021కల్లా పూర్తికానున్నాయి. మరోవైపు ఈ త్రిపక్ష హైవే మార్గంలోగల 69 వంతెనలను పటిష్ఠం చేసే బాధ్యతను కూడా భారత్ స్వీకరించింది. ఇవేకాకుండా ‘తమూ’ వద్ద తొలిదశ కింద సమీకృత తనిఖీ కేంద్ర నిర్మాణంతోపాటు మోటారు వాహనాల ఒప్పందంపై సంప్రదింపుల సత్వర ముగింపు కూడా ప్రధాన చర్చనీయాంశాలలో చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా ఇంఫాల్ (ఈశాన్య భారతంలోని మణిపూర్ రాష్ట్ర రాజధాని) నుంచి మాండలే (మయన్మార్) వరకు ఏప్రిల్ 2020నాటికి సమన్వయ విధానంలో బస్సులు నడిపేందుకు ప్రైవేటు రవాణా సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కూడా పూర్తయింది.

సామర్థ్యం పెంపు కార్యక్రమాల్లో భారత్ ఆచరణాత్మకంగా నిమగ్నమై ఉంది. ఆ మేరకు మ‌య‌న్మార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (MIIT), ఆధునిక వ్యవసాయ విద్య-పరిశోధన కేంద్రం (ACARE) వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. భారత ఆర్థిక సహాయంతో పకోకు, మింగ్‌యాన్‌ల‌లో ఏర్పాటు చేసిన మయన్మార్-భారత పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాయి. ఇవేకాకుండా మొనీవా, తాటాన్ ప్రాంతాల్లోనూ మరికొన్ని కేంద్రాలు అదనంగా ఏర్పాటు కానున్నాయి. అలాగే చిన్ రాష్ట్రంలో మయన్మార్-భారత సరిహద్దు ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు నాగా స్వయంపాలక ప్రాంతం మౌలికవసతులు, సామాజికాభివృద్ధితో ముందడుగు వేస్తున్నాయి. పొరుగుకు ప్రాధాన్యం అన్న భారత విధాన వ్యూహాత్మక లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తూ- రక్షణ, భద్రత సహకారం బలోపేతానికి ప్రాధాన్యం లభిస్తోంది. ఈ మేరకు సైనిక శిక్షణ, నిఘా, సముద్ర భద్రతలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ మ‌య‌న్మార్‌లో తిరుగుబాటుదారుల నియంత్రణ దిశగా రెండు దేశాలూ సంయుక్త సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తాయి. అలాగే పటిష్ఠ నిఘా, సమాచార ఆదానప్రదానాలను విస్తృతం చేసుకోవడంద్వారా ఉగ్రవాద బృందాల నిరోధం, హింసాత్మక తీవ్రవాద నియంత్రణకూ ప్రభుత్వాలు ప్రాధాన్యమిచ్చాయి. ఇక రక్షణ సహకారం, సముద్ర భద్రత, నౌకా సమాచార ప్రదానంలో సహకారంపై అవగాహన ఒప్పందాలతో ద్వైపాక్షిక భద్రత సహకారం మరింత బలోపేతమైంది.

ఆసియాలోని గతిశీల ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన మయన్మార్ రూపంలో భారతదేశానికి పలు అవకాశాలు కలిసివస్తున్నాయి. అయితే, ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 1.75 బిలియన్ డాలర్లకు మాత్రమే పరిమితం కావడంతో ఆర్థిక సంబంధాలు వాస్తవ అంచనాలకన్నా తక్కువస్థాయిలో ఉన్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అనుసంధానాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాల్సి ఉంది. దీంతోపాటు విపణుల అందుబాటు, ఆర్థిక లావాదేవీలకు తోడ్పాటు, వ్యాపార సంస్థల మధ్య సంధాన సరళీకరణ, ద్వైపాక్షిక్ర-ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలకు మద్దతు వంటి చర్యలు తీసుకోవడం అవశ్యం. ఇక భారత ఇంధన సంబంధాలలో మయన్మార్ ఒక ప్రధాన భాగస్వామి. అందువల్ల ఇంధన రంగంలో మరింత మెరుగైన సమన్వయం అవసరం. ఆ మేరకు భారత ప్రభుత్వరంగ చమురు-సహజవాయు సంస్థలు మయన్మార్ ఇంధన ఉత్పాదక, అన్వేషణ రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. తద్వారా ఉత్పత్తులలో కొంతభాగాన్ని భారతదేశానికి ఎగుమతి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మూలాలు ఉమ్మడి చారిత్రక, సాంస్కతిక, అధ్యాత్మిక సంబంధాల్లోనే ఉన్నాయి. అందుకే మయన్మార్ అధ్యక్షుడు వూ విన్ మింట్ తన పర్యటనలో భాగంగా ఆగ్రా, బోధ్‌గ‌య‌లను సందర్శించారు. మొత్తంమీద భౌగోళిక-వ్యూహాత్మక పరిణామాల నేపథ్యంలో విస్తృత ఇండో-పసిఫిక్ సహకారంలో భాగంగా ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి భారతదేశం తన కృషిని కొనసాగించనుంది.

రచన: డాక్ట‌ర్ తిత్లీ బ‌సు, తూర్పు-ద‌క్షిణాసియా వ్య‌వ‌హారాల వ్యూహాత్మ‌క విశ్లేష‌కులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన