విశ్వ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ కోరల్లో ప్ర‌పంచం

మాన‌వుల‌లో మునుపెన్న‌డూ కానరాని కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ నేడు ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది. దీంతో ప్రస్తుతం 81వేల మందికిపైగా శ్వాస‌కోశ సంబంధిత ‘కోవిడ్-19’ వ్యాధిని క‌లుగ‌జేసే ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఇప్ప‌టిదాకా ఈ వైర‌స్ బ‌లిగొన్న‌ 3వేల మందిలో 96.5 శాతం... 2,800 మందికిపైగా దీని మూల స్థాన‌మైన చైనా దేశవాసులే. ఇక ప్ర‌పంచంలో వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య చైనాలోని మొత్తం పీడితుల సంఖ్య‌ను మించిపోయింది. మ‌రోవైపు ఐరోపా, మ‌ధ్య‌ప్రాచ్యం, అమెరికా, ఆసియా దేశాల్లో వైర‌స్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం 51 దేశాల్లో కొత్త‌గా వెలుగుచూస్తున్న కేసుల‌కు స్ప‌ష్ట‌మైన‌ సాంక్ర‌మిక వ్యాధుల అధ్య‌య‌న సంబంధం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంటే- చైనా వెళ్లిరావ‌డం లేదా వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయిన‌వారితో సంప‌ర్కం వంటి చ‌రిత్ర ఏదీ లేద‌న్న‌మాట‌. కాగా, లాటిన్ అమెరికాకు సంబంధించి తమ‌ దేశంలో తొలి కేసు న‌మోదైన‌ట్లు బ్రెజిల్ నిర్ధారించింది. చైనా వెలుప‌ల క‌రోనా పీడిత దేశాల్లో ఇరాన్ తొలి మూడు స్థానాల జాబితాలో ఒకటి కాగా, అక్క‌డ ఇప్ప‌టికే 26 మంది మ‌రణించ‌గా, 245 మంది వైర‌స్ బారిన‌ప‌డ్డార‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. చివ‌ర‌కు సాక్షాత్తూ ఇరాన్ ఉపాధ్య‌క్షుడు మౌసూమియా ఇబ్తేక‌ర్‌, ఆరోగ్య శాఖ స‌హాయ మంత్రి ఇరాజ్ హ‌రిర్చి కూడా క‌రోనా బారిన‌ప‌డి ప్ర‌స్తుతం ఏకాంత గ‌దుల్లో చికిత్స పొందుతున్నారు. ఇట‌లీలోనూ 400 మందివ‌ర‌కూ క‌రోనా పీడితులు న‌మోదు కాగా, ఇప్ప‌టికే 12 మంది మ‌ర‌ణించిన‌ట్లు వార్తా సాధనాలు ప్ర‌క‌టిస్తున్నాయి. ఐరోపాలో ఇప్ప‌టిదాకా వెలుగుచూసిన అత్యంత తీవ్ర అంటువ్యాధి ఇదేన‌ని పేర్కొంటున్నాయి.
భార‌త్‌లో కోవిడ్‌-19 పీడితులైనవారిలో చివ‌ర‌గా ముగ్గురు విద్యార్థులు ఇటీవలే దాన్నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఈ వైర‌స్ బారినప‌డిన‌వారు ఎవ‌రూ లేర‌నే చెప్పాలి. అయితే, ఓ ప‌ర్యాట‌క నౌక‌లో విహార‌యాత్ర‌కు వెళ్లిన‌వారిలో కొంద‌రు క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ‌టంతో జ‌పాన్‌లో వారికి చికిత్స అందించారు. అనంత‌రం వీరంద‌ర్నీ ప‌టిష్ఠ వైద్య ప‌ర్య‌వేక్ష‌ణ న‌డుమ స్వ‌దేశం త‌ర‌లించారు. మ‌రోవైపు క‌రోనా విజృంభ‌ణ‌తో అల్లల్లాడుతున్న వుహాన్ నగ‌రానికి భార‌త్ 15 ట‌న్నుల మందుల‌ను విమానంలో పంపింది. అంతేకాకుండా ఈ న‌గ‌రంనుంచి ప‌లువురు విదేశీయుల‌ను కూడా భార‌త ప్ర‌భుత్వం వారి దేశాల‌కు త‌ర‌లించింది. మ‌రోవైపు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల కింద చైనా, హాంకాంగ్‌, ఇరాన్ స‌హా ప‌లు దేశాల నుంచి విమానాల‌ రాక‌పోల‌ను భార‌త్ ర‌ద్దుచేసింది.
వుహాన్ నగర మార్కెట్‌లో 2019 చివరి రోజుల్లో అక్రమంగా విక్రయించిన వన్యప్రాణుల నుంచి కరోనా వైరస్ మానవులకు వ్యాపించినట్లు భావిస్తున్నారు. బహుశా గబ్బిలాల నుంచి ఇతర జంతుజాతులకు, వాటిద్వారా మనుషులకు ఇది సంక్రమించిందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాగా, 2019 డిసెంబరు చివరన వుహాన్ నగరంలో పలు న్యుమోనియా కేసుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందింది. ఆ తర్వాత వారం రోజులకు తాము కొత్త రకం వైర‌స్‌ను కనుగొన్నట్లు చైనా అధికారులు నిర్ధారించారు. కరోనా రకం వైరస్ సమూహం చాలా పెద్దది. ఆయా రకాలనుబట్టి ఈ వైరస్ వల్ల సాధారణ జలుబు నుంచి తీవ్ర ప్రమాదకర శ్వాసకోశ రుగ్మత (సార్స్) వంటి ప్రాణాంతక వ్యాధులు సోకుతాయి. ఈ వైరస్ సోకినపుడు శ్వాసకోశ వ్యాధి లక్షణాలు, జ్వరం, దగ్గు, ఆయాసం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి సంకేతాలు సాధారణగా కనిపిస్తాయి. మరింత తీవ్రదశకు చేరిన పక్షంలో ఇన్ఫెక్షన్ కాస్తా న్యుమోనియా, సార్స్, మూత్రపిండాల వైఫల్యంసహా చివరకు మరణం కూడా సంభవించవచ్చు. ఈ అతిసూక్ష్మ జీవి ఉపరితలంపై కిరీటాల్లాంటివి పైకి పొడుచుకొచ్చినట్లు కనిపించడంవల్లనే దీనికి ‘క‌రోనా వైర‌స్‌’ అనే పేరు వచ్చింది.
కరోనా వైరస్ భయంతో దాని వ్యాప్తిని నిరోధించేందుకు ప్రపంచ దేశాలు ముమ్మర చర్యలు తీసుకుంటున్నాయి. ఆ మేరకు జపాన్ పాఠశాలలను మూసేస్తుండగా, సౌదీ అరేబియా పవిత్ర మక్కాయాత్రను నిలిపివేసింది. విశ్వ మహమ్మారి భయంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కూడా పతన ముఖం పట్టాయి. మొత్తంమీద అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఈ వైరస్ విజృంభణ ప్రభావం స్థాయిని ఇంకా అంచనా వేయాల్సి ఉంది. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో నిరుడు చైనా ఏకంగా మూడోవంతు వాటా నమోదు చేసింది. ప్రధాన ఆర్థిక వ్యవస్థ అయిన చైనాపై కరోనా వైరస్ దుష్ర్పభావం నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 1.1 ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోవచ్చునని అంచనాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు ప్రాణాంతక వైరస్ సృష్టించిన భయోత్పాతం ప్రపంచ సరఫరా వ్యవస్థలను కూడా విచ్ఛిన్నం చేసింది. ముఖ్యంగా అనేక దేశాల్లో వివిధ ఉత్పత్తుల తయారీకి అవసరమైన విడిభాగాల, ముడిపదార్థాల సరఫరా శృంఖలంలో చైనా మధ్యస్థ సరఫరాదారు పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ, వైరస్ నివారణ, మధుమేహ తదితర ఔషధ తయారీ పరిశ్రమలకు చైనా నుంచి ముడిపదార్థాలు సరఫరా అవుతాయి. దీంతో ఆయా సరఫరా శృంఖలాలన్నీ ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డాయి. అలాగే ప్రపంచ దేశాలకు ప్రధాన చౌకధర మందులు సరఫరా చేసే భారతదేశం వాటి ముడిపదార్థాల కోసం అత్యధికంగా చైనాపైనే ఆధారపడి ఉంది. భారతదేశంపై కరోనా వైరస్ ప్రభావం లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా చైనాతో సంబంధంలేని దేశాల్లో కూడా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ వైరస్ వ్యాధిలక్షణ రహితంగా సంక్రమిస్తున్నట్లు చైనా నిర్ధారించిన నేపథ్యంలో వివిధ దేశాల్లో ఇన్ఫెక్షన్ నిరోధక పద్ధతులు క్లిష్టంగా మారాయి. అయినప్పటికీ భారతదేశంలోని ప్రధాన రేవులుసహా ఇతర మార్గాల్లో దేశంలోకి ప్రవేశించేవారికి పరీక్షలు నిర్వహించడం కోసం శిక్షణ పొందిన వైద్య సిబ్బంది నియామకం, థర్మల్ స్కానర్ల ఏర్పాటువంటి పటిష్ఠ చర్యలను ప్రభుత్వం చేపట్టింది. అలాగే సునిశిత నిఘా, నియంత్రణ విధానాలను ప్రవేశపెట్టింది. వైరస్ నియంత్రణ, వ్యాప్తి నిరోధం దిశగా పరిశుభ్రతపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

రచన: కె.వి.వెంక‌ట సుబ్ర‌మ‌ణియ‌న్‌, సీనియ‌ర్ పాత్రికేయులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన