నిషేధం కాదు... నిఘా: పాకిస్థాన్‌కు FATF మరో అవకాశం
అంతర్జాతీయ ఆర్థిక కార్యాచరణ సంస్థ-FATF సర్వసభ్య సమావేశం గత ఆదివారం పారిస్‌లో జరిగింది. ప్రపంచంలోని 205 దేశాలనుంచి 800 మందికిపైగా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా FATF నిఘా జాబితానుంచి పాక్ బయటపడే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇతర అంశాలతోపాటు అక్రమ ద్రవ్య చలామణీసహా ఉగ్రవాదానికి నిధుల నిరోధంపై పాకిస్థాన్, మరికొన్ని దేశాలు ఇచ్చిన హామీల ప్రగతిపై సమీక్షకు FATF నిర్ణయించింది. కాగా, ఈ రెండు విషయాల్లో అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థకు ముప్పు తేగలవని భావించే దేశాలను FATF నిఘా జాబితాలో చేరుస్తుంది. ఆ మేరకు 2018 జూన్ నుంచీ ఈ జాబితాలో ఉన్న పాకిస్థాన్, దాన్నుంచి బయటపడబోదని, ఈ ఏడాది జూన్ వరకూ కొనసాగుతుందని 2020 ఫిబ్రవరి 19నుంచి వార్తలు వెలువడ్డాయి. అంతకుముందు... అంటే- తన హామీలకు కట్టుబాటుపై ఫిబ్రవరి 17న పాక్ సమర్పిత నివేదికను పరిశీలించిన అంతర్జాతీయ సహకార సమీక్ష కూటమి-ICRG ఆ దేశం తీసుకున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తంచేసింది. అందువల్ల FATF నిఘా జాబితానుంచి పాక్ బయటపడే అవకాశం లేదన్న అంచనాలు వెలువడటంలో ఆశ్చర్యమేమీ లేదు.
మరోవైపు ఉగ్రవాద నిరోధంపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రపంచాన్ని నమ్మించేందుకు పాక్ యత్నించింది. తదనుగుణంగా ముంబైపై 2008నాటి ఉగ్రవాద దాడుల సూత్రధారి, లష్కరే తాయిబా నాయకుడు హఫీజ్ సయీద్‌కు శిక్ష విధిస్తూ పాక్ కోర్టు ఒకటి తీర్పు ఇచ్చింది. అయితే, FATF చేసిన 40 సిఫారసులలో ఒక్కదాన్ని మాత్రమే పాకిస్థాన్ పూర్తిస్థాయిలో అమలు చేసినట్లు వివిధ దేశాల రేటింగ్‌పై 2020 ఫిబ్రవరి 13నాటి సమీక్ష సందర్భంగా వెల్లడైంది. అనేక అంశాలపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదని నిర్దిష్టంగా తేలిపోయింది. దీంతో నిఘా జాబితానుంచి తప్పించాలన్న పాకిస్థాన్ వినతికి సాక్షాత్తూ FATF అధ్యక్ష స్థానంలో ఉన్న ఆప్తమిత్ర దేశం చైనా కూడా మద్దతు పలకలేదు. ఈ ఏడాది జూన్‌లో FATF తదుపరి సర్వసభ్య సమావేశందాకా పాక్‌ను నిఘా జాబితాలో కొనసాగించాలన్న నిర్ణయాన్ని టర్కీ తప్ప మిగిలిన దేశాలన్నీ సమర్థించాయి. ఉగ్రవాదులకు నిధుల ప్రవాహంతోపాటు అక్రమ ద్రవ్య చలామణీ నిరోధంలో పాకిస్థాన్ తన హామీలను నిలబెట్టుకోలేదని నిరుడు అక్టోబరు నాటి FATF పరస్పర మూల్యాంకన నివేదిక కూడా స్పష్టం చేయడం ఈ సందర్భంగా గమనార్హం. నిర్దేశిత కార్యాచరణ ప్రణాళిక అమలుకు పలుమార్లు గడువు పొడిగించినా ఉగ్రవాదానికి నిధుల ముప్పును తప్పించడంపై పాకిస్థాన్ ఉదాసీనంగా వ్యవహరించిందని సదరు నివేదిక ఒకింత ఆందోళన, అసహనం కూడా వ్యక్తం చేసింది.
ఉగ్రవాదానికి నిధులు ప్రవాహంవల్ల వాటిల్లే ముప్పుపై పాకిస్థాన్‌కు ఇంకా అవగాహన కనిపించడంలేదని తప్పుబట్టింది. కార్యాచరణ ప్రణాళిలో సూచించిన 27 చర్యలకుగాను ఐదింటిని మాత్రమే అమలు చేసినట్లు నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో “2020 ఫిబ్రవరి నాటికైనా పూర్తిస్థాయిలో ప్రణాళికను అమలు చేయాల’’ని స్పష్టం చేసింది. లేకపోతే పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను, ఇతరత్రా లావాదేవీలను నిలిపివేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా సభ్యదేశాలకు సూచించాల్సి వస్తుందని గట్టిగా హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో తన తప్పిదాలేమిటో బహుచక్కగా తెలిసి కూడా FATF నిఘా జాబితానుంచి తొలగింపును కోరుకోవడం పాక్ అవాస్తవిక ధోరణికి నిదర్శనం. పాకిస్థాన్ తన మిత్రదేశం చైనామీద ఆధారపడిన నేపథ్యంలో- ‘నిషేధిత జాబితా’లోకి వెళ్లకుండా నిఘా జాబితాలో కొనసాగడం కాస్త ఊరటే! కానీ, FATF నిబంధనలు, ప్రక్రియలపై నిర్ణయాలు ఏకాభిప్రాయంతో మాత్రమే సాధ్యం. మరోవైపు భారత్ కూడా FATF సభ్యదేశం కాబట్టి ఉగ్రవాదానికి నిధుల విషయంలో ‘నిఘా జాబితా’నుంచి పాకిస్థాన్ బయటపడటం అంత సులువేమీ కాదు.
ఇటీవలి కాలంలో టర్కీ అన్నివిధాలా గుడ్డిగా పాకిస్థాన్‌ను వెనకేసుకొస్తోంది. దాంతోపాటు ఒకటిరెండు ఇతర దేశాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. కానీ, పాకిస్థాన్ వైఫల్యాల జాబితా చిన్నదేమీ కాదు. కాబట్టే FATF నిఘా జాబితానుంచి బయటపడేందుకు అధికశాతం దేశాల మద్దతు పొందడమన్నది అసాధ్యం. అంతేగాక ఉగ్రవాదంపై కఠినచర్యలు తీసుకుంటామన్న వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా అన్ని ఉగ్రవాద సంస్థల అగ్ర నేతలపై విచారణ చేపట్టి, శిక్షించాల్సిందేనని పాక్‌పై ఒత్తిడి పెరుగుతోంది. కాగా, పాక్ పేరు ‘నిషేధిత జాబితా’కు ఎక్కకుండా తప్పించ గలిగామంటూ అక్కడి నాయకులు తమ భుజాలు తామే చరుచుకుంటున్నారు. కానీ, తమ దుర్గతి తెలుసుకాబట్టి లోలోపల దుఃఖాన్ని దిగమింగుకుంటున్నారు. ఉగ్రవాదంతో ఏళ్ల తరబడి బంధం పెనవేసుకుపోయిన నేపథ్యంలో పాకిస్థాన్ రాజకీయ, సామాజిక, ఆర్థిక, న్యాయ వ్యవస్థలు ఎంతగానో కలుషితమయ్యాయి. ఈ బెడదనుంచి బయటపడే చర్యలు తీసుకోవడం అసాధ్యమనే దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ ఇకనైనా ప్రపంచాన్ని వంచించే కపట వైఖరిని వీడి, స్వీయ విమోచన మార్గాన్ని అన్వేషించడం అవశ్యం. లేనిపక్షంలో పాకిస్థాన్ FATF ‘నిషేధిత జాబితా’లోకి జారిపోకుండా చూడటం ఆప్తమిత్ర దేశాలకూ అసాధ్యమే!
రచన: డాక్టర్ అశోక్ బెహూరియా, ఐడీఎస్‌ఏ దక్షిణాసియా కేంద్ర సమన్వయకర్త, సీనియర్ సభ్యులు
Comments
Post a Comment