భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం
భారత్-అమెరికాల సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినబూనారు. సార్వభౌమ, సచేతన ప్రజాస్వామ్య దేశాల అధినేతలుగా పౌరులందరికీ స్వేచ్ఛ, సమాన ఆదరణ, మానవ హక్కులు, చట్ట నిబద్ధత తదితరాలకుగల ప్రాముఖ్యాన్ని వారిద్దరూ చక్కగా గుర్తించారు. ఆ మేరకు రెండుదేశాల పౌరుల దృఢమైన భాగస్వామ్యం, పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రయోజనాలు, సౌహార్దతలతో ముడిపడిన ఒడంబడికకు ఆమోదం తెలిపారు.
రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోవడంపై ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ కృతనిశ్చయానికి వచ్చారు. ప్రత్యేకించి సముద్ర, అంతరిక్ష రంగాల్లో మరింత అవగాహన, సమాచార భాగస్వామ్యం అవసరమని నిర్ణయించారు. అలాగే సంయుక్త సహకారం, సైనిక అనుసంధాన సిబ్బంది ఆదానప్రదానం, అన్నిరకాల బలగాల, ప్రత్యేక దళాల మధ్య అత్యాధునిక శిక్షణసహా సైనిక విన్యాసాల విస్తరణపైనా దృష్టి నిలిపారు. దీంతోపాటు ఆధునిక రక్షణరంగ విడిభాగాలు, పరికరాలు, వేదికలకు సంబంధించి సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తిపై సన్నిహిత సహకారం; రెండుదేశాల్లోని రక్షణరంగ పరిశ్రమల మధ్య భాగస్వామ్యాన్ని కూడా ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నారు. రక్షణ సహకారంలో భాగంగా ప్రాథమిక ఆదానప్రదానం, సహకార ఒడంబడికసహా ఒప్పందాలను వీలైనంత త్వరగా ఖరారు చేసుకునేందుకు అధినేతలిద్దరూ ఆసక్తితో ఉన్నారు. భారత-అమెరికాల మధ్య వాణిజ్యం, హైడ్రోకార్బన్ రంగాల్లో పెట్టుబడులు ఇనుమడించడంపై భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు హర్షం వెలిబుచ్చారు. ఇంధన రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యంద్వారా సంబంధిత ఇంధన రంగాల్లో ఇంధన భద్రత పెంపు, ఇంధన-ఆవిష్కరణ సంబంధాల విస్తరణ, వ్యూహాత్మక సమతూకం, పరిశ్రమలు-ఇతర భాగస్వాముల నడుమ సమన్వయం మెరుగుకు తోడ్పాటు తదితరాలను వారిద్దరూ స్వాగతించారు.
ప్రపంచంలో తొలి ద్వంద్వ-పౌనఃపున్య సింథటిక్ ఎపర్చర్ రాడార్‌తో ఉపగ్రహ ప్రయోగానికి భారత, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇస్రో, నాసా సంయుక్తంగా కృషి చేస్తుండటంపై రెండు దేశాలూ హర్షం ప్రకటించాయి. అలాగే భూ పరిశీలన, అంగారక గ్రహాన్వేషణ, సౌర-భౌతికశాస్త్రం, వ్యోమగాముల అంతరిక్ష ప్రయాణం, అంతరిక్ష వాణిజ్యంలో సహకారంవంటి అంశాలపై చర్చలు సాగడాన్ని కొనియాడారు. ఉన్నత విద్యలో సంయుక్త సహకారంతోపాటు విద్యాపరంగా ‘యువ ఆవిష్కర్తల’ శిక్షణార్థి నియామకాలుసహా ఆదానప్రదాన అవకాశాలను పెంచుకోవడంపై ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తి చూపారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న భారత విద్యార్థుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరగడంపై వారు హర్షం వ్యక్తంచేశారు. ఇక సౌభాగ్య, శాంతియుత, సార్వత్రిక, సార్వజనీన, స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ ప్రాంతం దిశగా భారత-అమెరికాల మధ్య సన్నిహిత భాగస్వామ్యం ఎంతో కీలకం. ఈ భాగస్వామ్యంలో ఆసియాన్ ప్రాముఖ్యాన్ని గుర్తించడం; అంతర్జాతీయ చట్టాలు-సుపరిపాలనకు కట్టుబాటు కూడా ఒక భాగం. అంతేగాక సముద్ర, విమానయాన స్వేచ్ఛ-భద్రతలకు మద్దతు, సముద్రాల చట్టబద్ధ వినియోగం; అవరోధాల్లేని చట్టబద్ధ వాణిజ్యం, అంతర్జాతీయ చట్టాలకు లోబడి సముద్ర వివాదాల శాంతియుత పరిష్కారం కూడా ప్రధానాంశాలే!
హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరమైన భద్రత ప్రదాతగానేగాక ప్రగతిశీల, మానవతావాద తోడ్పాటులో భారత పాత్రను అమెరికా ప్రశంసించింది. తదనుగుణంగా ఈ ప్రాంతంలో సుస్థిర, పారదర్శక, శ్రేష్టమైన మౌలిక వసతుల అభివృద్ధికి రెండు దేశాలూ కట్టుబడి ఉన్నాయి. ఈ క్రమంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలోనేగాక అంతర్జాతీయంగానూ ఫలవంతమైన ప్రగతి సాధనంలో భారత-అమెరికాల ఉమ్మడి బాధ్యతను ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ గుర్తించారు. ఆ మేరకు అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ-USAID, తృతీయ ప్రపంచ దేశాల్లో భారత అభివృద్ధి భాగస్వామ్య సహకార వ్యవస్థ-IDPAల మధ్య భాగస్వామ్యంపైనా వారు శ్రద్ధ చూపుతున్నారు. దక్షిణ చైనా సముద్రంలో అర్థవంతమైన ప్రవర్తన నియమావళి కోసం కృషిచేయాల్సిన అవసరాన్ని భారత్-అమెరికా గుర్తించాయి. అయితే, అది పక్షపాతరహితంగా- అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా, అన్ని దేశాల చట్టబద్ధ హక్కులు-ప్రయోజనాలను పరిరక్షించేదిగా ఉండాలని వారిద్దరూ సౌహార్దంగా విజ్ఞప్తి చేశారు. ఇక భారత్-అమెరికా ఉమ్మడి ప్రయోజనాలరీత్యా సమైక్య, సౌర్వభౌమ, ప్రజాస్వామ్య, సార్వజనీన, సుస్థిర, సౌభాగ్య ఆఫ్ఘనిస్థాన్ రూపుదిద్దుకోవడం అవసరం. ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ స్థిరీకరణ, అనుసంధాన కల్పనతోపాటు ప్రగతి, భద్రతపరంగా సహాయం అందించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రను అమెరికా అధ్యక్షుడు కొనియాడారు.
సరిహద్దుల ఆవలినుంచి సవాలు విసిరే అన్నిరకాల ఉగ్రవాదాన్ని భారత్-అమెరికా ఖండించాయి. ఉగ్రవాదులను ఉసిగొల్పే ప్రచ్ఛన్న యుద్ధ తంత్రాన్ని నిరసించాయి. ఆ మేరకు తన భూభాగం నుంచి ఉగ్రవాద దుశ్చర్యలకు అవకాశం ఇవ్వరాదని పాకిస్థాన్‌ను కోరాయి. దాంతోపాటు పఠాన్‌కోట్‌తోపాటు ముంబైలో 26/11నాటి ఉగ్రవాద దాడుల కారకులపై తక్షణం విచారణ జరిపి శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఉగ్రవాద నిరోధంలో భాగంగా అన్ని ఉగ్రవాద సంస్థలు, వాటి అనుబంధ మూకలపై సమష్టి కార్యాచరణకు పిలుపునిచ్చాయి. వాణిజ్య-సమాచార వ్యవస్థలో భాగంగా సార్వత్రిక, విశ్వసనీయ, సురక్షిత ఇంటర్నెట్ సౌకర్యం విషయంలో రెండు దేశాలూ ఏకాభిప్రాయం వ్యక్తంచేశాయి. అలాగే సమాచార, గణాంక ప్రవాహానికి తోడ్పడే వినూత్న, సురక్షిత, విశ్వసనీయ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ అవసరాన్ని భారత్-అమెరికాలు గుర్తించాయి. వ్యూహాత్మక సామగ్రి, కీలక మౌలిక సౌకర్యాల సార్వత్రిక, సురక్షిత, సరళతర సరఫరా కోసం పరిశ్రామిక, విద్యావ్యవస్థల మధ్య సహకారాన్ని ప్రోత్సహించాలని నాయకులిద్దరూ సంకల్పించారు. అదే సమయంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల విస్తరణతో ముడిపడిన ముప్పుపై స్వతంత్ర అంచనాలు రూపొందించాలని భావిస్తున్నారు.
రచన: పదమ్ సింగ్, ఆకాశవాణి: వార్తా విశ్లేషకులు
Comments
Post a Comment