పార్లమెంటులో ఈ వారం
కేంద్ర బడ్జెట్ పై చర్చ ముగియడంతో భారత పార్లమెంటులోని ఉభయ సభలు ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాయి. పౌరసత్వ సవరణ చట్టాని కి వ్యతిరేకంగా పలు రాజకీయ పక్షాల అభిప్రాయాల నేపథ్యంలో ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంటు సమావేశాలు అప్పుడప్పుడు అల్లకల్లోలంగా ఉన్నాయి. సభాధ్యక్షుడు అనుమతించిన అన్ని అంశాలపై చర్చలకు తాము సిద్ధమని ప్రభుత్వం తెలియజేసింది. ఈ సమావేశాల్లో నలభై అయిదు బిల్లులను ప్రవేశపెట్టి చర్చించేందుకు అలాగే ఏడు ఆర్థిక అంశాలపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం నిర్దేశించింది. అయితే పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సమాయత్తమయ్యాయి .
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పిఆర్ తదితర అంశాలపై ప్రతిపక్షాలు సభలో రభస చేయడంతో ఎగువ సభ రాజ్యసభ వాయిదా పడింది. సభ తిరిగి సమావేశమవగానే కాంగ్రెస్, వామపక్షాలు, టిఎంసి, డిఎంకె, ఎస్పీ లకు చెందిన సభ్యులు నినాదాలు చేస్తూ వెల్ లోనికి దూసుకువెళ్లారు. గందరగోళం మధ్య, రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేసే తీర్మానంపై చర్చ చేపట్టేందుకు ఉపాధ్యక్షుడు హరివంశ్ ప్రయత్నించారు. చర్చ సజావుగా జరిగేందుకు సహకరించవలసిందిగా సభానాయకుడు తావర్ చంద్ గెహ్లోట్ ప్రతిపక్ష సభ్యులను కోరారు. అయితే ఆయన ప్రయత్నం ఫలించలేదు. సిఎఎ, ఎన్పిఆర్ తదితర అంశాలపై వాయిదా తీర్మానాన్ని ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించగా సభాధ్యక్షుడు ఎం వెంకయ్యనాయుడు వాటిని తిరస్కరించారు. ఎగువ సభలో అధ్యక్షుడు వెంకయ్య నాయుడు సభ కొనసాగించేందుకు ఎంతగా ప్రయత్నించినా సభ్యులు సహకరించలేదు.
ఇటీవల స్వర్గస్తులైన ఒమన్ సుల్తాన్ Qaboos Bin Said Al Said కు సభ నివాళులర్పించింది. ఆస్ట్రేలియాలో కార్చిచ్చులో అశువులు బాసిన పలువురికి సభ శ్రద్ధాంజలి ఘటించింది. కరోనావైరస్. ఉల్లిపాయల ఎగుమతులు రాజస్థాన్లో దాడులు వంటి పలు అంశాలను పార్లమెంటు సభ్యులు లేవనెత్తారు.
దిగువ సభ లోక్ సభలో కూడా ప్రతిపక్ష సభ్యులు కాంగ్రెస్ నాయకత్వంలో సభలో గలభా సృష్టించారు. సభ సమావేశం కాగానే కాంగ్రెస్, డీఎంకే, బీఎస్పీ వామపక్షాలకు చెందిన పార్లమెంటు సభ్యులు నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకువెళ్లారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల రిజిస్టర్ వంటి అంశాలపై సభ్యులు నినాదాలు చేసారు.
సుప్రీంకోర్టు ఆదేశం మేరకు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఒక ట్రస్టును ఏర్పాటు చేసేలా ప్రధాన మంత్రి లోక్ సభలో ఈ నెల ఐదవ తేదీన చేసిన ప్రకటన ఈ వారం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. గత ఏడాది నవంబరులో రామజన్మభూమి బాబ్రీ మసీదు కేసులో చారిత్రాత్మకమైన తీర్పు వెలువడింది.
పౌరసత్వ సవరణ చట్టం, ప్రతిపాదిత జాతీయ పౌరుల రిజిస్టర్ అంశాలపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ఎన్నార్సి విషయంలో తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని దిగువసభ లోక్ సభలో తమ వైఖరిని ప్రభుత్వం తెలియజేసింది. ముందస్తు జనాభా గణన సవరణకు, జాతీయ పాపులేషన్ రిజిస్టర్లో సమాచార సేకరణపై ఉన్న భయాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలగించే ప్రయత్నం చేశారు. ఈ ప్రక్రియలో ఎటువంటి పత్రాలు సేకరించరని, అలాగే ఆధార్ సంఖ్యను తెలియజేసే అంశం కూడా స్వచ్ఛందమని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి రెండు వేల పది లోనే యుపిఎ ప్రభుత్వం ఎన్పిఆర్ ను ప్రారంభించిందని, అది ప్రజలకు ప్రయోజనాలు కలుగు చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమ అంశాల్లో రాజకీయాలకు తావుండరాదని మోదీ చెప్పారు. ఎన్నార్సి పై అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, ఇప్పటి వరకు ప్రభుత్వం, భారత పౌరుల జాతీయ రిజిస్టర్ ను జాతీయ స్థాయిలో తయారు చేసే అంశం పై ఎటువంటి నిర్ణయంతీసుకోలేదని చెప్పారు.
రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై స్పందిస్తూ రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మూడు వందల డెబ్బై అధికరణాన్ని రద్దు చేయడం వలన జమ్మూ కాశ్మీర్ ను దేశంలోని మిగిలిన ప్రాంతంలో సమగ్ర పరిచే ప్రక్రియ కు వెసులుబాటు కలిగిందన్నారు. భారతదేశానికి కిరీటం వంటిది జమ్మూ కాశ్మీర్ ఆని ఆయన అభివర్ణించారు. అక్కడి అన్ని మత విశ్వాసాలను సూఫీ ఆచారాలను సమాదరించే జమ్మూ కాశ్మీర్ వైఖరి ఆ ప్రాంత నిజమైన గుర్తింపు అని ఆయన అభివర్ణించారు.
రామజన్మభూమి అంశంపై తీర్పు వెలువడిన దరిమిలా భారత ప్రజలు ప్రజాస్వామ్య ప్రక్రియలోనూ విధానాలలోనూ గణనీయమైన విశ్వాసాన్ని ప్రదర్శించారని ప్రధాన మంత్రి అన్నారు. మనమందరం అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణముకోసం ప్రభుత్వ చర్యకు మద్దతు తెలియజేయాలంటూ అధికార పక్ష సభ్యులు సభలో నినదించారు. ఈ సమావేశాలలో ప్రభుత్వం Insolvency and Bankruptcy Code amendment Ordinance 2019, Mineral Laws Amendment Ordinance 2020 ల స్థానంలో కొత్త బిల్లులను ప్రవేశ బెట్టనుంది.
రచన: యోగేష్ సూద్,పాత్రికేయులు
Comments
Post a Comment