ఆఫ్ఘన్‌ అధ్యక్ష ఎన్నికల్లో అష్రఫ్‌ ఘనీ విజయం

ఆఫ్ఘనిస్థాన్‌లో 2019 సెప్టెంబరు 28న హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు 5 నెలల తర్వాత ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరి 18న వెల్లడయ్యాయి. ఆ మేరకు ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ విజేతగా నిలిచారు. కానీ, ఆయన ప్రధాన ప్రత్యర్థి అబ్దుల్లా అబ్దుల్లా ఈ ఫలితాలను తిరస్కరించారు. ఎన్నికల సంఘం మోసపూరితంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ- తదుపరి ప్రభుత్వాన్ని తానే ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. పోలింగ్‌ సందర్భంగా ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపని నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రాథమిక దశలో ఘనీ ముందంజలో నిలిచినపుడు ఓటింగ్‌ శాతంపై ప్రత్యర్థులతో వివాదం తలెత్తింది. దీంతో 15 శాతం ఓట్లపై తనిఖీ చేయాలని నిర్ణయించారు. మొత్తంమీద 50.64 ఓట్లు పొందిన అధ్యక్షుడు ఘనీ స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కారు.

ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత అష్రఫ్‌ ఘనీ మళ్లీ ఎన్నిక కావడంపై భారత్‌ అభినందనలు తెలిపింది. ప్రజాస్వామ్యంవైపు పయనించాలన్న ఆఫ్ఘనిస్థాన్‌ ప్రజల ఆకాంక్షకు తన మద్దతును పునరుద్ఘాటించింది. వెలుపలి శక్తుల ఊతంతో చెలరేగుతున్న ఉగ్రవాదంపై పోరాటంతోపాటు సార్వజనీన, శాశ్వత అంతర్గత శాంతి-సామరస్యాల కోసం “ఆఫ్ఘన్‌ చోదిత, ఆఫ్ఘన్‌ సొంత, ఆఫ్ఘన్‌ నియంత్రిత” ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమైన కొత్త ప్రభుత్వంతో కలసి ఎప్పటిలాగానే పనిచేస్తామని ప్రకటించింది. తదనుగుణంగా ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్ఠానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఆఫ్ఘన్ అధ్యక్ష ఎన్నికలపై ఇది తొలి వివాదమేమీ కాదు. అధ్యక్ష పదవికి ఘనీ, అబ్దుల్లా 2014లో తలపడినప్పటి పరిస్థితులే ఈసారి కాస్త పునరావృతమయ్యాయి. ఓట్ల పునఃలెక్కింపుతోపాటు ఎన్నికల ఫలితాలను ప్రత్యర్థులిద్దరూ అంగీకరించలేదు. అయితే, ఎన్నికల తర్వాత డాక్టర్‌ అబ్దుల్లా అబ్దుల్లాకు రాజ్యాంగబద్ధంగా ముఖ్య కార్యనిర్వహణాధికారి బాధ్యతలు అప్పగించేలా అధికార భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. కానీ, దీనికి పార్లమెంటు ఆమోదముద్ర అవసరం కాగా, నాలుగేళ్ల జాప్యం తర్వాత 2018 సెప్టెంబరులోగానీ చట్టసభకు ఎన్నికల నిర్వహణ సాధ్యంకాలేదు. ఆ తర్వాత జాతీయ సమైక్య ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల సంస్కరణలకు, ప్రత్యేక ఎన్నికల సంస్కరణ కమిషన్‌ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. కానీ, రెండు శిబిరాల నడుమ విభేదాలతో అటు వెలుపలినుంచి, ఇటు లోపలినుంచి కూడా ప్రతికూలత ఏర్పడి సంస్కరణలు తేవడంలో ప్రభుత్వం విఫలమైంది.

ఆఫ్ఘనిస్థాన్‌లో ఐదేళ్లుగా పాలిస్తున్నది జాతీయ ఐక్య ప్రభుత్వమే అయినా, ఇద్దరు నిత్య ప్రత్యర్థులైన నాయకుల మధ్య పాలన పూర్తిగా చీలిపోయింది. నేతలిద్దరూ అధికార యంత్రాంగాన్ని తమ విశ్వాసపాత్రులతో నింపివేసి, పాలనను గుప్పిట పెట్టుకునేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా తమ తెగలవారికే ప్రాధాన్యం ఇచ్చినందువల్ల ఇతర చిన్న తెగల సమూహాలకు వారు దూరమయ్యారు. ఈ సంకుల సమరంతో పాలన కుంటుపడి, పాలకులకు పట్టులేని స్థానాలన్నీ తాలిబన్‌సహా ఇతర బృందాల సానుభూతిపరుల వశమయ్యాయి. కాగా, తాలిబన్‌-ట్రంప్‌ యంత్రాంగం మధ్య శాంతి ఒప్పందానికి ఆఫ్ఘనిస్థాన్‌ సన్నద్ధమవుతున్న వేళ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇక శాంతి ఒప్పందానికి ముందు ఏడు రోజులపాటు హింసను తగ్గించేందుకు కృషిచేద్దామని ఉభయపక్షాలూ అంగీకరించిన నేపథ్యంలో సదరు అగ్నిపరీక్ష ఇవాళ్టినుంచే మొదలైంది. ఆ తర్వాత ఒప్పందం మేరకు అమెరికా దళాలు దశలవారీగా వెనుదిరుగుతాయి. కానీ, మొన్నటిదాకా ప్రభుత్వంతో చర్చలకు నిరాకరిస్తూ వచ్చిన తాలిబన్లు ఆ దిశగా మొగ్గుచూపడంతో శాంతికి అసలైన పరీక్ష ఎదురైంది. అయినప్పటికీ ఆఫ్ఘన్‌ ప్రభుత్వ ప్రతినిధులు-తాలిబన్‌ల మధ్య అనధికారికంగా పలుమార్లు సంభాషణలు సాగాయి. అయితే, తమ నాయకులు వ్యక్తిగతంగా మాత్రమే ఈ సంప్రదింపుల్లో పాల్గొంటున్నారని తాలిబన్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు శాంతి నెలకొనాల్సిన అవసరాన్ని అధ్యక్షుడు ఘనీ అంగీకరించినా- ఈ దిశగా తాలిబన్ల ఆకాంక్షను ‘కొయ్య గుర్రపు వ్యూహం’గా అభివర్ణిస్తున్నారు.

తాలిబన్లు ఇప్పటిదాకా ప్రభుత్వ చట్టబద్ధతను అంగీకరించలేదు. ఈ పరిస్థితిలో ప్రస్తుత ఎన్నికల వివాదం ఘనీ ప్రభుత్వ చట్టబద్ధతను మరోసారి ప్రశ్నార్థకం చేసే ముప్పు లేకపోలేదు. అంతేగాక ఆఫ్ఘనిస్థాన్‌లో పాశ్చాత్య ప్రజాస్వామ్య స్థాపనను తాలిబన్లు ఆదినుంచీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మొత్తం ఎన్నికల ప్రక్రియ సందిగ్ధంలో పడే ప్రమాదమూ ఉంది. రేపోమాపో శాంతి ఒప్పందం ఖరారు కానున్న పరిస్థితిలో ఎన్నికల ఫలితాలపై వివాదం ఆ ప్రక్రియకు ఆటంకం కావచ్చు. లేకపోతే అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఘనీ ప్రత్యర్థి వివాద నీలినీడలు కమ్ముకోవచ్చు. అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందానికి తాలిబన్ల అంగీకారం పర్యవసానంగా పరిస్థితులు మరింత రాజకీయ అనిశ్చితికి, హింసకు దారితీయవచ్చునన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

రచనః డాక్టర్‌ స్మృతి ఎస్‌.పట్టనాయక్‌, పశ్చిమాసియాపై వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన