వృద్ధిపై కేంద్ర బడ్జెట్ ప్రత్యేక దృష్టి
భవిష్యత్ అంచనాల లక్ష్యంతో మందగించిన భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు 2020-21 కేంద్ర బడ్జెట్ కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. ప్రజల జేబుల్లో మరింత డబ్బు వుండేట్లుగా, రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేట్లుగా, కంపెనీలకు డివిడెండ్ పై పన్ను రద్దు చేసి, లాభాలను పెంచేందుకు బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు.
ఆర్థికంగా అనేక సవాళ్ళు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం క్లిష్టమైన వ్యవహారం. కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ - క్యాపిటల్ వ్యయానికి తగు నిధులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ రుణాలు ఈ దిశగా వ్యయం చేసేందుకు చర్యలు తీసుకుని సమతుల్యాన్ని పాటించారు.
మౌలిక వసతుల ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం, పారిశుద్ధ్యం, జల సంరక్షణ వంటి పథకాలకు అధిక కేటాయింపులు చేసి - ప్రతి పౌరుడికి సరళమైన జీవనాన్ని అందించాలని నిశ్చయించింది. ఆరోగ్యం, సంపద, సౌకర్యవంతమైన జీవనం కల్పించే విషయంలో మరో స్థాయి చేరుకునేందుకు బడ్జెట్ లో విస్తృతంగా పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ప్రాజెక్టులకు 102 లక్షల కోట్లు ప్రతిపాదించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 22 వేల కోట్ల రూపాయలు ఇన్‌ఫ్రా ఫైనాన్స్ కంపెనీలలో ఈక్విటీ రూపంలో పెట్టుబడి పెట్టేందుకు బడ్జెట్ లో ప్రతిపాదించారు. మౌలిక వసతి ప్రాజెక్టులకు దీర్ఘకాలిక నిధులు సమకూర్చేందుకు ఇది దోహదపడుతుంది.
ఆర్థిక వ్యవస్థలోని రియల్ సెక్టార్లకు అనేక సహాయ చర్యలు ప్రకటించడం ద్వారా - ఆర్థిక బాధ్యత, ఆర్థిక నిర్వహణ (FRBM)చట్టం కింద 2019-20 సంవత్సరానికి ఆర్థిక లోటు 3.3 శాతం లక్ష్యాన్ని మించి జిడిపిలో 3.8 శాతానికి చేరుకుంటుంది. ఉజ్జ్వల ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్ లాంటి దేశం - వృద్ధి జోరును నిలువరించరాదు కనుక, 0.5 శాతం పెరుగుదల సమంజసంగానే భావించాలి.
వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి రంగాలలో మెరుగైన వృద్ధి సాధించేందుకు, గిడ్డంగులు, కూరగాయలు వంటి వాటి కోసం గొలుసు కట్టు శీతల గిడ్డంగులు ఏర్పాటుకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి 15 లక్షల కోట్లు కేటాయించారు. విద్యకు భారీగా 99,300 కోట్లు, నైపుణ్యాల అభివృద్ధికి 3200 కోట్లు కేటాయించారు.
ప్రజలు పన్నులు చెల్లించంగా కూడా ఖర్చు చేసుకునేందుకు తగినన్ని నిధులు అందుబాటులో వుండే విధంగా ఈ బడ్జెట్ లో సరళీకృత పన్ను విధానాన్ని ప్రతిపాదించారు. గతంలోని పన్ను మినహాయింపు వంటి వాటికి బదులుగా - నేరుగా లబ్ధి చేకూరే విధంగా పన్నుల వ్యవస్థను సరళీకరించారు. పన్నుల చెల్లింపులో వివాదాలను తగ్గించేందుకు వివాదాస్పద మొత్తంపై మాత్రమే వడ్డీ చెల్లింపు - 2020 జూన్ వరకు పెనాల్టీ రద్దును ప్రతిపాదించారు. జి.ఎస్.టి చెల్లింపుల స్థిరీకరణకు, జి.ఎస్.టి విధానాన్ని సరళీకరించి, ఆటోమేటిక్ రిఫండ్ విధానాన్ని తీసుకువచ్చారు. కొత్త కంపెనీలకు ప్రోత్సహించేందుకు నూతన దేశీయ కంపెనీలకు ప్రవేశపెట్టిన 15 శాతం కార్పొరేట్ పన్నును - విద్యుత్ రంగానికి కూడా విస్తరించారు.
విదేశీ ప్రభుత్వాల సావరిన్ వెల్త్ ఫండ్స్, ఇతర విదేశీ పెట్టుబడులకు పన్ను రాయితీలు కల్పించారు. స్టార్ట్ అప్ కంపెనీలకు వాటి లాభాలపై కల్పించే నూరు శాతం పన్ను ప్రయోజనాల పరిధిని పెంచారు. కొన్ని ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులను ఎన్.ఆర్.ఐ ఇన్వెస్టర్లకు కూడా అవకాశం కల్పించారు.
దేశీ రుణ మార్కెట్ ను మరింత విస్తృత పరిచేందుకు కార్పొరేట్ బ్యాండ్స్ లో ఫారెన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట్ మెంట్ ను 9 నుంచి 15 శాతానికి పెంచారు. సహకార సంఘాలకు టాక్స్ రేటు రాయితీలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల పన్నుల చెల్లింపు విషయంలో టర్నోవర్ పరిమితి పెంపును బడ్జెట్ లో ప్రతిపాదించారు.
ప్రభుత్వం తన అభివృద్ధి కార్యక్రమాల అమలుకు - ప్రధానంగా తమ కీలక ఆస్తుల విక్రయం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోంది. 2019-20 పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం 65 వేల కోట్లు కాగా, దీనిని 2.10 లక్షల కోట్ల రూపాయలకు పెంచారు. వృద్ధికి పునరుత్తేజం కలిగించే లక్ష్యంతో పన్ను రాయితీలతోపాటూ, ఉత్పాదక రంగాలలో పెట్టుబడులు పెంచేలా బడ్జెట్ ప్రతిపాదనలలో సమతూల్యం పాటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లో సూచించిన నామినల్ జిడిపి 10 శాతంగా వుంది.
రచన - జి.శ్రీనివాసన్, సీనియర్ జర్నలిస్ట్
Comments
Post a Comment