JCPOA నించి ఇరాన్ నిష్క్రమణ ప్రపంచ వ్యాప్తంగా దాని ప్రభావం
ఇరాన్ జనరల్ ఖాసిం సోలేమానిని అమెరికా హతమార్చిన తర్వాత అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పిటి నించి వైదొలగుతానని ఇరాన్ బెదిరించినట్టు తాజా పరిస్థితి సూచిస్తోంది. తమ అణ్వస్త్ర అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి - UNSC కి నివేదించిన పక్షంలో ఈ చర్య తీసుకుంటానని చెప్పింది. సోలేమాని హత్యానంతరం ఏర్పడిన పెద్ద చిక్కు ఇది. మిగతా విషయాలన్నిటినీ ఇది కప్పివేస్తుంది. దీని పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ నిర్ణయం ఆ ప్రాంతానికే కాకుండా భౌగోళిక అణు వ్యాప్తి నిరోధక ఏర్పాటుకు చాలా చేటు కలిగిస్తుంది. ఇకపై తాను ఇరాన్ అణు ఒప్పందంగా పిలిచే ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (JCPOA) నిబంధనలకు కట్టుబడి ఉండేదిలేదని ఇరాన్ ప్రభుత్వం తీసుకున్నట్టు చెప్తున్న నిర్ణయంతో ఈ భయం ఏర్పడింది. ఒప్పందంలో భాగస్వాములైన మూడు ఐరోపా దేశాలు - బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీల బృందం - అణు ఒప్పందంలో పొందుపరచిన వివాద పరిష్కార యంత్రాంగాన్ని ప్రేరేపించినందుకు ప్రతిస్పందనగా NPT నించి వైదొలగాలని ఇరాన్ పిలుపునిచ్చింది.
ఈ విషయమై ఈ దేశాలపై అమెరికా ఒత్తిడి చేసినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఆదేశాల మీద ఇదే ఒత్తిడి కొనసాగిన పక్షంలో JCPOA నించి ఇరాన్ నిజంగా వైదొలగే ప్రమాదం ఉంది.
DRM ను ప్రయోగించి భద్రతామండలికి ఇరాన్ అణ్వస్త్ర అంశాన్ని నివేదించడం వల్ల లోగడ ఇరాన్పై భద్రతా మండలి విధించిన ఆంక్షలు మళ్ళీ అమల్లోకి వస్తాయి. ఇప్పటికే అమెరికా విధించిన ఏకపక్ష ఆంక్షల కారణంగా ఇరాన్ పై ఆర్థిక పరిణామం తీవ్రంగా ఉన్నాయి. దేశంలో భారీ ఎత్తున అశాంతి చెలరేగి అతలాకుతలమవుతోంది. అదనంగా మరిన్ని బహుముఖ ఆంక్షలు విధించినట్టయితే దేశంలో పరిస్థితులు మరింత దిగజారిపోతాయి. ఇస్లామిక్ పాలనకు తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. నిరసనలు వెల్లువెత్తుతాయి. వాటి అణచివేతకు ప్రభుత్వం హింసాత్మక ప్రతిచర్యలకు పాల్పడాల్సి వస్తుంది.
అయితే 2018, మే 8వ తేదీన JCPOA నించి నిష్క్రమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం ఫలితంగానే ఇరాన్ - అమెరికాల మధ్య ప్రస్తుత ఘర్షణ ఏర్పడినట్టు చెప్పవచ్చు.
ఒప్పందంలో పొందుపరచిన అన్ని నిబంధనలనూ పాటిస్తానన్న ఇరాన్ వాటికి తు.చ తప్పకుండా కట్టుబడి వున్నట్టు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ క్రమంతప్పక ధృవీకరించినప్పటికీ అమెరికా తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. నిజానికి ఈ నిర్ణయం తర్వాత ఐరోపా దేశాలు ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం కనుగొంటాయనే ఆశతో ఇరాన్ ఎంతో ఓపిగ్గా సరిగ్గా సంవత్సరం పాటు వేచి చూసింది. కానీ ఫలితం ఏమీ లేకపోవడంతో JCPOA నించి వెనక్కు వెడతానని 2019 మే 8న ప్రకటించింది.
కాగా ఇరాన్ కు గల యురేనియం సమృద్ధి వేగాన్ని నియంత్రించాలనేది JCPOA ప్రాథమిక లక్ష్యం. అయితే దానినుండి ఇరాన్ వైదొలగడం వల్ల దాని వేగం మరింత పుంజుకుంటుంది. ఇరాన్ ఈ ఒప్పందం నుంచి వెనక్కు మళ్ళితే ఈ కార్యక్రమంలో ఇరాన్ ఏం చేస్తోందో, ఎటు వంటి పని చేస్తోందో ఇతర దేశాలు తెలుసుకునే అవకాశం వుండదు.
ఇరాన్ అణు కార్యక్రమానికి చెందిన ఈ భయాలు ఇతర దేశాలకు మరీ ముఖ్యంగా ఆ ప్రాంతంలోని దాని ప్రత్యర్ధి సౌదీ అరేబియాకు వణుకు పుట్టిస్తాయి. అది కూడా ఇదే బాట పట్టవచ్చు. దీంతో ఇప్పటికే అస్థిరతలో కొట్టుమిట్టాడుతున్న మధ్య ప్రాచ్య ప్రాంతంలో అణ్వాయుధాల పందెం వేడెక్కుతుంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఇరాన్ అణు వ్యవస్థలపై సైనిక పరమైన దాడికి పూనుకోవచ్చు. దీంతో ప్రస్తుతం వున్న ఘర్షణ పరిస్థితి మరింత ఉద్రిక్తమై యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఏర్పడుతుంది. అంతేకాక హైడ్రోకార్బన్ నిల్వలు సమృద్ధిగా గల పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల పరిణామాలు కలిగిస్తుంది.
ఇలా వుండగా ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జవాద్ జరీఫ్ కిందటివారం న్యూఢిల్లీలో ఉన్నారు. ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ తో సవివరంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో శాంతి కావాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు న్యూఢిల్లీ చెప్పింది.
ఇలా ఉండగా ఇరాన్ - సౌదీ అరేబియా కలసి పని చేయాలనుకుంటున్నాయని ఇరాన్ అధ్యక్ష కార్యాలయం అధిపతి మహ్ మాద్ వాజీ ఇటీవలి ప్రకటన ప్రోత్సాహకరంగా వుంది. పర్షియన్ గల్ఫ్ లో భద్రత పునరుద్ధరణకు, నిర్వహణకు ఆ ప్రాంతంలోని దేశాలన్నీ కలిసి పని చేయాలి. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి ఇది అత్యంత కీలకం. అందుచేత ఈ రెండు ప్రాంతీయ దేశాలు దౌత్యపరమైన మార్గాల ద్వారా పరస్పర విభేదాల పరిష్కారానికి కృషి చేయాలి.
ఆంగ్ల రచన - డా.ఆసిఫ్ షుజా, సీనియర్ రీసెర్చిఫెలో, మిడిల్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ - సింగపూరు జాతీయ విశ్వవిద్యాలయం
Comments
Post a Comment