పాకిస్థాన్‌లో మ‌రిన్ని మార్పులు

పాకిస్థాన్‌లో ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై విచారం వ్య‌క్తం చేస్తూ అక్కడి సీనియ‌ర్ పాత్రికేయుడు స‌లీమ్ స‌ఫీ ‘డైలీ జంగ్‌’ ప‌త్రిక‌లో ఇటీవ‌ల ఒక వార్తావ్యాఖ్య రాశారు. దేశం ఓ స‌రికొత్త సామాజిక అవ‌గాహ‌న‌ను రూపొందించుకోవ‌డం త‌క్ష‌ణావ‌స‌ర‌మ‌ని నొక్కిచెబుతూ, ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడూ ఇది సాధ్యం కాబోద‌ని కూడా ఆయ‌న‌ స్ప‌ష్టీక‌రించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల ప్ర‌కారం... పాకిస్థాన్‌లోని వివిధ ప్ర‌భుత్వ‌ వ్య‌వ‌స్థ‌లు ప‌ర‌స్ప‌ర కీచులాట‌ల్లో మునిగి, శూన్య మ‌న‌స్త‌త్వంతో వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఇది ఎంత‌వ‌ర‌కూ వెళ్లిందంటే ఒక‌టి చిక్కుల్లో ప‌డితే మ‌రొక‌టి సంబ‌ర‌ప‌డే దుస్థితికి చేరాయి. ఈ నేప‌థ్యంలో మునుప‌టి ఘోర త‌ప్పిదాల‌ను స‌మీక్షించి స‌రికొత్త భ‌విష్య‌త్ రాజ‌కీయ న‌మూనాను రూపొందించ‌గ‌ల‌ స‌త్య-స‌మ‌న్వ‌య క‌మిష‌న్ పాకిస్థాన్‌కు ఇప్పుడు అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న రాశారు. ప్ర‌స్తుతం దేశాన్ని కుదుపుతున్న అనేకానేక సంక్షోభాల రీత్యా స‌ఫీ త‌న వ్యాసంలో విచారం వ్య‌క్తం చేస్తూ రాసిన వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఇక రాజ‌కీయ పార్టీల స్థాయిలో ప‌ర‌స్ప‌ర వేధింపులు ఒక సంప్ర‌దాయంగా మారిపోయాయి. ఫ‌లితంగా లోగ‌డ తమ పాలనలో త‌మ‌పై వ‌చ్చిన అవినీతి, ఆశ్రిత ప‌క్ష‌పాతం ఆరోప‌ణ‌ల‌నుంచి త‌మ‌నుతాము కాపాడుకునే ప్ర‌య‌త్నాల్లో వివిధ ప్ర‌తిప‌క్ష‌ రాజ‌కీయ శ‌క్తులు త‌ల‌మున‌క‌లై ఉన్నాయి.

దేశంలో వివిధ అధికార హోదాల్లో ఉన్న‌వారిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌మీద విచార‌ణార్థం జాతీయ జ‌వాబుదారీ వ్య‌వ‌స్థ‌-NAB ఏర్పాటైంది. ఇప్పుడీ వ్య‌వ‌స్థ‌- ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై క‌క్ష సాధించ‌డంతోపాటు ప్ర‌జ‌ల్లో వారిని అప‌ఖ్యాతి పాల్జేయ‌డానికి ఒక ఉప‌క‌ర‌ణంగా త‌యారైంది. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలినాళ్ల‌లో అది స‌జావుగా కొన‌సాగుతుంద‌ని అంద‌రూ ఆశించారుగానీ, అలా జ‌ర‌గ‌లేదు! ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం అన‌వ‌స‌ర అంశాల‌పై దృష్టిపెడుతూ త‌న‌కుతాను చిక్కుముడులు వేసుకుంటోంది. అంతేకాకుండా ప్ర‌తీకార రాజ‌కీయాల‌కు తెర‌తీయ‌డంతోపాటు ‘మాట‌లెక్కువ‌-ప‌ని త‌క్కువ‌’ అన్నట్లు తయారైంది. పర్యవసానంగా పాకిస్థాన్‌లో ప్ర‌జాస్వామ్యం న‌వ్వుల‌పాల‌య్యే దుస్థితి దాపురించింది. చ‌ట్ట‌స‌భ‌లో ఆధిక్యంలేని ప్ర‌భుత్వాన్ని ఆయ‌న న‌డుపుతుండ‌టాన్నిబ‌ట్టి, దానికి కొన్ని ప్ర‌చ్ఛ‌న్న శ‌క్తులు ఊత‌మిస్తున్నాయ‌న్న వాస్త‌వం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ప్రజాస్వామ్య రాజకీయ వ్యవహారాలేవీ దేశంలో కానరానందున, అన్ని స్థాయులలోనూ పడుతూలేస్తూ సాగుతున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని సమర్థించే ప్రధాన వ్యవస్థే అత్యంత బలమైనదిగా పరిగణించబడుతోంది. అందుకే వ్యతిరేకత అన్నది ప్రతిపక్షాల నుంచి కాకుండా ప్రభుత్వ వ్యవస్థల నుంచే పుడుతోంది. ఫ‌లితంగా ఆధిప‌త్యం కోసం వ్య‌వ‌స్థ‌ల న‌డుమ అంత‌ర్గ‌త పోరు ప్ర‌స్ఫుటంగా క‌నిపిస్తోంది. ఇక అస‌లు విష‌యాల్లోకి వ‌స్తే- నిరుడు న‌వంబ‌రులో సైన్యాధిప‌తి పున‌ర్నియామ‌కాన్ని న్యాయ‌వ్య‌వ‌స్థ ప్ర‌శ్నించింది. మునుప‌టి సైనిక పాల‌కుడు ముషార‌ఫ్‌కు ఒక ప్ర‌త్యేక కోర్టు మ‌ర‌ణ‌శిక్ష విధించింది. సాధార‌ణ ప‌రిస్థితుల్లోనైతే ఇటువంటి తీర్పులు వెలువ‌డే అవ‌కాశం ఉండేది కాదు. అయితే, ఇప్పుడు స‌వాలు ఎదురైనందున ఇమ్రాన్ ప్ర‌భుత్వం ప్ర‌స్తుత ప‌రిస్థితిని ఎదుర్కొన‌క త‌ప్ప‌డం లేదు. అంతేగాక ప్ర‌చ్ఛ‌న్న ప్ర‌భుత్వ చిత్రాన్ని పున‌రుద్ధ‌రించాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. అయిన‌ప్ప‌టికీ, ప్ర‌తిప‌క్షంలోని రాజ‌కీయ శ‌క్తులు ఈనాటికీ ఆ శ‌క్తిమంత‌మైన వ్య‌వ‌స్థ‌ను చేజిక్కించుకునేందుకు సిద్ధ‌మైన‌ట్లు క‌నిపించ‌డం లేదు. ప‌ద‌విలో ఉన్న సైన్యాధిప‌తి పున‌ర్నియామ‌క అధికారాన్ని ప్ర‌ధానమంత్రికి క‌ట్ట‌బెట్టే ప్ర‌తిపాద‌న‌తో కూడిన బిల్లుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన పీఎంఎల్‌-ఎన్ 2020 జ‌న‌వ‌రి 2వ తేదీన కిక్కురుమ‌న‌కుండా ఆమోదించింది. ఇదే ధోర‌ణిలో ముషార‌ఫ్‌కు వ్య‌తిరేకంగా వ‌చ్చిన తీర్పుమీద కూడా రానున్న రోజుల్లో నిలుపుద‌ల, నీరుగార్చే ఉత్త‌ర్వు ద్వారా సైన్యాన్ని ప్ర‌స‌న్నం చేసుకునే ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌కపోదు.

మొత్తంమీద ఇటువంటి అప్ర‌జాస్వామిక రాజ‌కీయాల ఫ‌లితంగా దేశానికొక ఆధార‌ప‌డ‌ద‌గిన వ్య‌వ‌స్థ‌గా పాకిస్థాన్ సైన్యంపై ప్ర‌జ‌ల‌కుగ‌ల విశ్వాసం క్ర‌మేణా స‌న్న‌గిల్లుతోంది. ఆ మేర‌కు మునుప‌టిక‌న్నా అధిక‌సంఖ్య‌లో అనేక‌మంది విశ్లేష‌కులు క్ర‌మంగా పాక్ సైన్యం వ్య‌తిరేక వైఖ‌రిని అనుస‌రిస్తున్నారు. బ‌ల‌హీన చ‌ట్ట‌స‌భ నుంచి సైన్యం ఇవాళ కొంత ఉప‌శ‌మ‌నం పొంద‌గ‌ల‌దేమోగానీ, ప్ర‌జా బాహుళ్యంలో మాత్రం దాని ప్ర‌తిష్ఠ‌కు మ‌చ్చ ప‌డ‌నేపడింది. కోర‌లున్న సైన్యాన్ని రెచ్చ‌గొట్టి, తంటాలు తెచ్చుకుంటామేమో అన్న భ‌యంతో పాకిస్థాన్ ప్ర‌తిప‌క్షాలు ఈ ప‌రిస్థితిని స‌ద్వినియోగం చేసుకోన‌ట్ల‌యితే దేశంలో ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ మ‌రింత విచ్ఛిన్నంకాక త‌ప్ప‌దు. ఈ నేప‌థ్యంలో ఇమ్రాన్ ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్థిస్తున్న బ‌ల‌గాల‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డంక‌న్నా స‌ర్కారును చ‌ట్ట‌విరుద్ధ‌మైన‌దిగా నిరూపించడ‌మే వాటి ముందున్న ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యంగా క‌నిపిస్తోంది. అయితే, ఇలాంటి సంద‌ర్భం ఏర్ప‌డిన‌ప్పుడు ఎప్ప‌టిలాగానే సైన్యం త‌న శ‌క్తిని, స‌మ‌యాన్ని తిరిగి పుంజుకుని విజృంభించే ప్ర‌మాదం లేక‌పోలేదు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఇమ్రాన్ ప్ర‌భుత్వంతో అన్ని రాజ‌కీయ పార్టీల‌క‌న్నా సైన్యానికే ఎక్కువ సఖ్య‌త ఉంటుంద‌న్న భావ‌న ఉంది. కాబ‌ట్టి పాకిస్థాన్‌లో మరిన్ని మార్పులు వ‌చ్చినా అవి అదేవిధంగా కొన‌సాగుతూ స‌రికొత్త సామాజిక అవ‌గాహ‌న‌పై స‌ఫీ క‌ల‌లు క‌ల్ల‌లుగానే మిగిలిపోక త‌ప్ప‌దేమో!

రచన: డాక్ట‌ర్ అశోక్ బెహురియా, సీనియ‌ర్ ప‌రిశోధ‌క స‌భ్యుడు-స‌మ‌న్వ‌య‌క‌ర్త‌; ద‌క్షిణాసియా కేంద్రం, ఐడీఎస్ఏ

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం