పాకిస్థాన్‌లో మ‌రింత దిగ‌జారిన ప‌రిస్థితులు

సిక్కులు ప‌విత్రంగా భావించే ప్ర‌దేశాల్లో పాకిస్థాన్‌లోని అత్యంత ప‌విత్ర‌మైన న‌న్‌కానా సాహిబ్ గురుద్వారా మీదకు గ‌త శుక్ర‌వారం సుమారు 400 మంది మూకుమ్మ‌డిగా దూసుకొచ్చారు. వారంతా సిక్కు వ్య‌తిరేక నినాదాలు చేస్తూ గురుద్వారాను చుట్టుముట్టి రాళ్లు రువ్వారు. గురుద్వారా పూజారి కుమార్తె జ‌గ్జీత్ కౌర్‌ను అప‌హ‌రించి, బ‌ల‌వంతపు మ‌త‌మార్పిడితో ఆమెను పెళ్లాడిన యువ‌కుడు మొహమ్మ‌ద్ హ‌స‌న్ కుటుంబం వారిని ఈ దాడికి ఉసిగొల్పింది. హ‌స‌న్, అతని కుటుంబ దౌర్జ‌న్య‌పూరిత చ‌ర్య‌ల‌ను సిక్కు స‌మాజం వ్య‌తిరేకించ‌డ‌మే ఈ హింసాకాండ‌కు కార‌ణం. దీనికి సంబంధించిన ఒక వీడియోలో- గురుద్వారా ఉనికిని వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న‌కారులంతా నిన‌దించ‌డం క‌నిపించింది. అంతేకాకుండా ‘న‌న్‌కానా సాహిబ్’ పేరును ‘గులామన్-ఎ-ముస్తఫా’గా మార్చేస్తామంటూ వారు కేకలు పెట్టడం వినిపించింది. ఆ స‌మ‌యాన పెద్ద సంఖ్య‌లో ఈ చారిత్ర‌క గురుద్వారాలో చిక్కుకుపోయిన సిక్కులు దీన్ని భ‌విష్య‌త్ అరిష్ట శ‌కునంగా భావించారు. మ‌రోవైపు పాకిస్థాన్ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌పూరిత, అహంకార వైఖ‌రి చూశాక ఆ దేశంలో నివ‌సిస్తున్న సిక్కుల భ‌ద్ర‌త‌పై తీవ్ర ఆందోళ‌న పెల్లుబికింది.

పాకిస్థాన్‌లో న‌న్‌కానా సాహిబ్ ఒక జిల్లా కాగా, అదే పేరుతో అక్క‌డ గురుద్వారా ఉంది. సిక్కుల తొలి గురువు గురునాన‌క్ దేవ్ 1469లో ఇక్క‌డే జన్మించారు. అందువ‌ల్ల ఈ ప్ర‌దేశాన్ని త‌మ ప‌విత్ర స్థ‌లాల్లో అత్యంత ప‌విత్ర‌మైన‌దిగా సిక్కులు ప‌రిగ‌ణిస్తారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగాగ‌ల సిక్కులు నిరుడు గురునాన‌క్ 550వ జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకున్నారు. కాగా, న‌న్‌కానా సాహిబ్ గురుద్వారాలో సిక్కుల‌ ప‌దో గురువు గురు గోవింద్ సింగ్ జ‌యంతి వేడుక‌లు జ‌రిగిన మ‌రునాడే మూకుమ్మ‌డి దాడి చోటుచేసుకోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. ప‌థ‌కం ప్ర‌కారం జ‌రిగిన ఈ హింసాత్మ‌క దాడిని భార‌త్ త‌క్ష‌ణ‌మే తీవ్రంగా ఖండించింది. నిరుడు ఆగ‌స్టులో జ‌గ్జీత్ కౌర్‌ను ఆమె ఇంటినుంచి అప‌హ‌రించి, బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిడితో పెళ్లి చేసుకున్న త‌ర్వాత న‌న్‌కానాసాహిబ్ గురుద్వారాపై దాడి జ‌ర‌గ‌డాన్ని ఎత్తిచూపింది. ప‌విత్ర స్థ‌లాన్ని దురుద్దేశ‌పూరితంగా అప‌విత్రం చేయ‌డంతోపాటు విధ్వంసానికి పాల్ప‌డ‌టాన్ని తీవ్ర స్థాయిలో గ‌ర్హించింది. సిక్కు స‌మాజ స‌భ్యుల భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ‌, సంక్షేమానికి త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పాకిస్థాన్ ప్ర‌భుత్వానికి సూచించింది. అల్ప‌సంఖ్యాక సిక్కు స‌మాజంపై దాడికి దిగ‌డ‌మేగాక‌ ప‌విత్ర గురుద్వారాను అప‌విత్రం చేసిన దుండ‌గుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది. అలాగే ప‌విత్ర న‌న్‌కానా సాహిబ్ గురుద్వారాతోపాటు ప‌రిసరాల‌ ప‌విత్ర‌త ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పాక్ ప్ర‌భుత్వం ఇంత‌కుముందే ఆదేశించిన‌ట్లు కూడా గుర్తుచేసింది.

నన్‌కానా సాహిబ్‌లో దాడి స‌మాచారం అంద‌గానే భార‌త్‌లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ స్పందించి, వెంట‌నే జోక్యం చేసుకోవాల్సిందిగా పాక్ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను కోరారు. ప‌విత్ర స్థ‌లాన్ని చుట్టుముట్టిన ఆగ్ర‌హ‌మూక నుంచి గురుద్వారాను, లోపల చిక్కుకుపోయిన భ‌క్తులను ర‌క్షించేందుకు వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రి హ‌ర్‌సిమ్ర‌త్ కౌర్ బాదల్ కూడా గురుద్వారాపై దాడిని ఖండించారు. పాకిస్థాన్‌లో అల్ప‌సంఖ్యాక వ‌ర్గాల‌పై హింస‌కు ఇది వాస్త‌వ రూప‌మ‌ని ఆమె అభివ‌ర్ణించారు. పాకిస్థాన్ నిజ‌స్వ‌రూప‌మేమిటో గురుద్వారాపై దాడితో తేలిపోయింద‌ని పేర్కొన్నారు. అలాగే శిరోమ‌ణి అకాలీదళ్ అధ్య‌క్షుడు, ఇత‌ర రాజ‌కీయ నాయ‌కులు, దేశ‌విదేశాల్లోని సిక్కు స‌మాజ ప్ర‌ముఖులు కూడా గురుద్వారాపై దాడి సంఘ‌ట‌న‌ను ముక్త‌కంఠంతో ఖండించారు. మ‌రోవైపు ఢిల్లీలోని పాకిస్థాన్ హైక‌మిష‌న్ కార్యాల‌యంవ‌ద్ద సిక్కులు పెద్ద‌సంఖ్య‌లో నిర‌స‌న‌కు సిద్ధ‌మ‌య్యారు.

అయితే, దాడి జరిగిన రెండు రోజుల త‌ర్వాత- దాన్ని ఖండిస్తూ పాకిస్థాన్ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్‌ఖాన్ గొంతు స‌వ‌రించుకున్నారు. స‌ద‌రు దాడి త‌న దృక్ప‌థానికి, ప్ర‌భుత్వ విధానానికి వ్య‌తిరేక‌మ‌ని, బాధ్యుల‌ను ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ వ‌ద‌ల‌బోమ‌ని ప్ర‌క‌టించారు. కానీ, భార‌త్‌పై అక్కసు వెళ్లగక్కకుండా ఉండలేకపోయారు. ఆ మేర‌కు ‘‘న‌న్‌కానా సాహిబ్ సంఘ‌ట‌న ఖండించ‌ద‌గిన‌దే అయినా- భార‌త‌దేశంలోని మైనారిటీల స్థితిగ‌తుల‌తో దాన్నిపోల్చ‌లేమం’’టూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఇదొక అర్ధ‌ర‌హిత, ఖండ‌నార్హం ప్ర‌క‌ట‌న‌. దేశంలో శాంతిసామ‌ర‌స్యాల‌ను విచ్ఛిన్నం చేసే మూక‌ను క‌నీసం అదుపు చేయ‌లేని పాకిస్థాన్ నాయ‌క‌త్వ అస‌మ‌ర్థ‌త‌కు నిద‌ర్శ‌నం. కాగా- ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్య‌ల‌కు ముందు... న‌న్‌కానా సాహిబ్ సంఘ‌ట‌న నిజం కాదంటూ పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పైగా, అది ఓ టీస్టాల్ వ‌ద్ద రెండు బృందాల‌మ‌ధ్య స్వల్ప ఘర్షణ మాత్ర‌మేన‌ని బుకాయించింది. నిరుడు న‌వంబ‌రులో క‌ర్తార్‌పూర్ కారిడార్‌ను తెర‌వ‌డంద్వారా పాక్ క‌ప్పుకున్న‌ మంచిత‌న‌పు ముసుగు తాజా సంఘ‌ట‌నతో తొల‌గిపోయి వంచ‌క ముఖచిత్రం బ‌ట్ట‌బ‌య‌లైంది. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్‌లోని అల్పసంఖ్యాక వ‌ర్గాల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌ల దిశ‌గా భార‌త్‌తోపాటు అంత‌ర్జాతీయ స‌మాజం కూడా ఆ దేశంపై నిరంత‌ర ఒత్తిడిని కొన‌సాగించ‌డం అవ‌శ్యం!

రచన: అంబాసిడ‌ర్ అశోక్ స‌జ్జ‌నార్‌, భార‌త మాజీ దౌత్య‌వేత్త‌-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబ‌ల్ స్ట‌డీస్ అధ్య‌క్షులు

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం