నడిరోడ్ల కూడలిలో ఇరాక్

ఇరాక్ లో అవినీతి, నిరుద్యోగం, దేశీయ విధానాలలో ఇరాన్ - అమెరికాల జోక్యానికి వ్యతిరేకంగా యువత గత రెండు నెలలకు పైగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా నజాఫ్, కర్బాలా, బస్రా, బాగ్దాద్ సహా అన్ని ప్రధాన నగరాలలో బైఠాయింపులతో ఈ ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు శాసనోల్లంఘన ఉద్యమంగా తీవ్రరూపం దాల్చాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలు, ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ సంస్థ (ఐఆర్.జి.సి)కి విధేయులైన పాపులర్ మొబైలైజేషను దళాలతో చేరిన కిరాయి సైనికులు తీసుకున్న చర్యలలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు నివేదికలు తెలుపుతున్నాయి.

గత శుక్రవారం ప్రధానమంత్రి అదెల్ అబ్దుల్ మహదీ తమ పదవికి రాజీనామా చేసారు. అధిక పరపతి గల షియా మతాధికారి అయతాల్లా అలీ అల్-సిస్తానీ- అబ్దుల్ మహదీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయాన్ని పరిశీలించాలని పార్లమెంటుకు పిలుపునివ్వడంతో మహదీ రాజీనామా సమర్పించారు. రెండు రోజుల తర్వాత పార్లమెంటు ఆయన రాజీనామాను ఆమోదించింది. అటుపై కొత్త ప్రధానమంత్రిని నియమించాలని దేశాధ్యక్షుని కోరింది. అయినా కూడా నిరసనలు నిలువలేదు, కొనసాగాయి. ఉద్యమ కేంద్రం బాగ్దాద్ లోని తహ్రీర్ స్క్వేర్ వద్దకు చేరింది. 

ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, అవినీతి ఇరాక్ యువతను కలచివేసే ప్రధాన సమస్యలుగా నిలిచాయి. 2003లో అమెరికా దాడి అనంతరం మతకల్లోలాలు, అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతోంది. ఎన్నికలు యధావిధిగా జరుగుతున్నప్పటికి రాజకీయ సుస్థిరత ఎండమావిగానే ఉంది. అంతర్జాతీయ చమురు విపణిలో ప్రధాన చమురు ఎగుమతిదారుగా ఇరాక్ తిరిగి పుంజుకున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు నుంచి మాత్రం బైటపడలేదు. నిధుల దుర్వినియోగం రాజకీయ వర్గాలలో అవినీతి ఇందుకు కారణమని ప్రజలు అంటున్నారు.

అరబ్ స్ప్రింగ్ తర్వాత ఏర్పడిన కల్లోలంతో ఇరాక్ కు కష్టాల నుండి కోలుకునే శక్తి క్షీణించి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.

2013-14 లో డేష్ - ఐసిస్ పెరుగుదల ఇరాక్ ను మళ్ళీ పతనం అంచులకు చేర్చింది. ఈ ఉగ్రవాద సంస్థ వడిగా లాభాలు ఆర్జించి విస్తార భూభాగాలపై నియంత్రణ సాధించింది. 2014 జూన్ లో కాలిఫేట్ ను స్థాపిస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబరు 2017లో డేష్ ఓటమిగానీ, మోసుల్ పతనంగానీ ప్రజల కడగండ్లకు ముగింపు పలకలేదు.

2018 మే నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికలు ఇరాక్ లో నూతన శకానికి నాంది పలుకుతాయని వేళ్ళూనుకున్న అవినీతి, నిరుద్యోగం, రాజకీయ ఉదాసీనత, మత ఉద్రిక్తతలకు భరతవాక్యం పలుకుతయని భావించారు . కానీ అలా జరగలేదు. అత్యంత విచ్ఛిన్నమైన తీర్పు రావడంతో ప్రభుత్వం ఏర్పాటులో జాగు ఏర్పడింది. కొత్తగా ఎన్నికైన పార్లమెంటుకు ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఐదు నెలలకు పైగా కాలం పట్టింది. అక్టోబరు 2018లో పగ్గాలు చేపట్టిన అదెల్ అబ్దుల్ - మహదీ ప్రజల విశ్వాసం చూరగొనటానికి అంతగా ఏమీ చేయలేకపోయారు.

యువతకు ఉద్రిక్తులను చేసిన మరో అంశం ఇరాక్ స్వదేశీ విషయాలలో ఇరాన్ జోక్యం చేసుకోవడం. 2003లో సద్దాం హుస్సేన్ పాలన కూలిపోయిన తర్వాత ఇరాక్ అంతర్గత విషయాలలో ఇరాన్ రాజకీయంగా సైనికపరంగా తన ఆధిపత్యాన్ని చాటుకోవడం మొదలుపెట్టింది. ఐఆర్.జి.సి శిక్షణ పొందిన షియా సైనికులు పి.ఎమ్.ఎఫ్ ను ఏర్పాటు చేసి డేష్ ను ఓడించటంలో గణనీయమైన పాత్రను పోషించారు. మే 2018 ఎన్నికల తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో జాప్యానికి టెహ్రాన్ జోక్యం కూడా కారణమనే అభియోగాలున్నాయి. 

బాగ్గాద్ లో అమెరికా ప్రభావం కూడా చాలా ఉంది. అలాగే అరబ్ గల్ఫ్ రాచరికాలు ముఖ్యంగా సౌదీ అరేబియా బాగ్దాద్ లో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అమెరికా - ఇరాన్ ల పెత్తనం ప్రభావమే బాగ్దాద్ లో తమ క్రియాశీలక అధికారానికి పెద్ద ఆటంకమని ఇరాకీలకు కనెర్రగా వుంది. అందుచేతనే ఆందోళనకారులు ఈ ఇరువురిపై గుర్రుగా ఉన్నారు.

ఇరాక్ వద్ద భారీ చమురు నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలో చమురు ఎగుమతి చేసే అతి పెద్ద దేశాలలో ఒకటిగా వుంది. భారత్ కూడా ఇరాక్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. 2018 నుంచి భారత్ కు అగ్ర చమురు సరఫరాదారుగా నిలిచి సౌదీ అరేబియాను రెండవ స్థానానికి వెనక్కు నెట్టి వేసింది. 2018-19లో భారత్ 22.3 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన చమురును ఇరాక్ నుండి దిగుమతి చేసుకుంది. ఇది మొత్తం చమురు దిగుమతులలో దాదాపు 13 శాతం. అందుచేత న్యూఢిల్లీ ఇరాక్ లో పరిస్థితిని జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. అయితే ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా భారత్ తన చమురు దిగుమతులను వేర్వేరుగా మార్చింది.

కాగా నిరసన శాంతియుత పరిష్కారంలోను, ఉమ్మడి బాధ్యత స్వీకరణలోను ఇరాక్ అధికారుల వైఫల్యం వల్ల పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. ఇరాక్ ఈరోజు నడిరోడ్ల కూడలిపై ఉంది. ఇకముందు ఏ మార్గం తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. ఇరాక్ లోని సందిగ్ధ పరిస్థితి మధ్య ప్రాచ్య దేశాలపై ప్రభావం చూపక తప్పదు. తన ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ఇరాక్ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడుతుందని భారత్ ఆశిస్తోంది. అల్లకల్లోలమైన దేశంలో శాంతి భద్రతలు తిరిగిపాదుకొంటాయని ఆకాంక్షిస్తోంది.






రచన : డా. మహమ్మద్ ముదస్సిర్ ఖమర్, పశ్చిమాసియాపై వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం