ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్ష ఎన్నికలు

ఆఫ్ఘనిస్థాన్ లో ప్రాథమిక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడటంతో యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఆ దేశం ప్రజాస్వామ్య సంస్థలను ఒక తాటిపై తెచ్చే దిశగా మరో మైలురాయిని అధిగమించింది. 50.46 శాతం ఓట్లను సాధించిన ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఎన్నికల్లో గెలుపొందినట్లు ఆఫ్ఘని స్తాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయన సమీప ప్రత్యర్థి, మాజీ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లా రెండు లక్షల ఓట్ల తేడాతో ఎన్నికల్లో పరాజితులయ్యారు.

తాలిబన్ల ఉన్మాద హింస నేపథ్యంలో పౌర పాలన నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్న ఆ దేశంలో ఎన్నికల్లో మోసాలను అరికట్టడంలో స్వతంత్ర ఎన్నికల సంఘం అత్యంత పకడ్బందీగా వ్వవహరించింది. ఫలితంగా బయోమెట్రిక్ పరీక్షల్లో పట్టుబడిన వేలాది మంది ఓటర్లు అనర్హతతో వెనుతిరిగారు. అయినప్పటికీ ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయి. ప్రతి ఒక్క ఫిర్యాదును పరిశీలిస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది.


ఫిర్యాదుల పరిశీలన కొన్ని వారాలో నెలలో కొనసాగవచ్చు .ఒకవేళ అప్పుడు అష్రఫ్ ఘనీకి పోలైన ఓట్లు యాభై శాతానికి తక్కువగా ఉంటే రెండవ పర్యాయం ప్రధాన అభ్యర్థుల మధ్య పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ సుదీర్ఘ ప్రక్రియ కారణంగా రాజకీయ అనిశ్చితికి దారి తీయకుండా ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రతికూలంగా ప్రభావితం కాకుండా చూడటం చాలా ముఖ్యమైనది.

ఈ నేపథ్యంలో చాలామంది ప్రపంచ నాయకులు వేచి చూసే ధోరణిలో ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అష్రఫ్ ఘనీ ని అభినందించేందుకు ముందుకు రావటం అభినందనీయం. ఏకీకృత, సార్వభౌమిక, ప్రజాస్వామిక, సంపన్న, శాంతియుత ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఆఫ్గనిస్తాన్ లో సమగ్ర శాంతి ప్రక్రియకు భారత్ అందించే సూత్రపాయ మద్దతును, ప్రధానమంత్రి నొక్కి వక్కాణించారు. అభివృద్ధికి దోహదపడేలా, భద్రతను పెంచేలా ఆ ప్రాంతంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో సన్నిహితంగా సహకరిస్తుందని మోదీ పేర్కొన్నారు.

తీవ్ర వ్యతిరేకతను అధిగమించి అధ్యక్ష ఎన్నికలను విజయవంతంగా నిర్వహించటం సామాన్యమైన విషయం కాదని భారత్ అభిప్రాయపడుతోంది. 2001లో తాలిబన్ల పతనం దరిమిలా ఇది ఆఫ్గనిస్థాన్లో జరిగిన నాల్గవ అధ్యక్ష ఎన్నిక .అప్పటి నుంచి తాలిబన్లను పెద్దగా పట్టించుకోకపోయినా వారు పూర్తిగా వైదొలగలేదు. కాబూల్ లో ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రెండు రోజుల తర్వాత ఉత్తర బల్క్ ప్రావిన్స్ లో కనీసం పదిహేను మంది భద్రతా దళ సభ్యులను తాలిబన్లు పొట్టన పెట్టుకున్నారు. అదే సమయంలో పశ్చిమ ఫరా ప్రావిన్స్ లో ఇరవై ఏడు మంది శాంతి కార్య కర్తలను అపహరించుకు పోగలిగారు.

ఈ అవరోధాలను అధిగమిస్తూ తుపాకీ పాలన స్థానంలో పౌర పాలన నెలకొల్పాలని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు శ్రమిస్తున్నారు. తాలిబన్లు సృష్టించిన రక్తపాతం నుండి దేశాన్ని కాపాడి యుద్ధ వినాశానికి గురయిన దేశానికి శాంతిని చేకూర్చడానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే సరియైన మార్గమన్నది న్యూఢిల్లీ భావన. తాజా అధ్యక్ష ఎన్నికలు ఈ దిశలో మరో ముందడుగుగా భావించవచ్చు.

అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లాలు ఆఫ్గనిస్తాన్ లోని వేరు వేరు ప్రాంతీయ గుర్తింపులతో ప్రాతినిధ్యం వహిస్తున్నా వారికి అధికార పంపిణీ కొత్త కాదు. మూడవ అధ్యక్ష ఎన్నికల తరువాత ప్రభుత్వ బాధ్యతలను పంచుకోవాలని వారిని ఒప్పించారు. భారత్ లో ఉన్నత విద్యను అభ్యసించిన డాక్టర్ అబ్దుల్లా అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసిన అనుభవజ్ఞుడు. అధ్యక్షుడు ఘనీ ఆఫ్గనిస్తాన్ మేథో వర్గంలో అత్యుత్తమంగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో మాదిరి ప్రభుత్వాన్ని నడిపించేందుకు కలిసి రావాలని వారిని నొప్పించటం కష్టతరం కాకపోవచ్చు. వాకిట్లో తోడేలు పొంచి వుంది అన్న సామెత లాగా ఆఫ్గనిస్థాన్ కు తాలిబన్ సమస్యలు ముందుగా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


రచన: ఎం కే టిక్కు, రాజకీయ వ్యాఖ్యాత

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన