ఎవరెస్టు శిఖర అధిరోహణ నియమాలను కఠినతరం చేయనున్న నేపాల్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం,8848 మీటర్ల ఎత్తున్న ఎవరెస్ట్ ఉన్న నేపాల్ కు ప్రతి ఏటా పర్వతారోహణ ద్వారా చక్కని ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ ఏడాది మేలో శిఖరారోహణ ప్రయత్నంలో 11 మరణాలు సంభవించడం ఆందోళన కలిగించింది.2015 లో హిమాలయ ప్రాంతాల్లో తీవ్రమైన భూకంపం సంభవించడంతో 22 మరణాలు నమోదయ్యాయి. ఏప్రిల్ ఇరవై అయిదు న మంచు చరియలు విరిగిపడటంతో అనేకులు పర్వతారోహకులు అందులో చిక్కుకు పోయారు. ఈ ఏడాది ఎనిమిది వందలకు పైగా పర్వతారోహకులు శిఖరానికి చేరుకునేందుకు ప్రయత్నించారు. చాలామందికి గంటల కొద్దీ ఎనిమిది వేల మీటర్ల ఎత్తులో మృత్యు ప్రాంతంగా వ్యవహరించబడే చోట ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రతిఒక్కరూ అనుకూల వాతావరణం స్వల్పంగా ఉన్న సమయంలోనే శిఖరానికి చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఎక్కువ ఎత్తులో ఉండటం వలన ఏర్పడిన అనారోగ్యం అలసటలతో మరణాలు సంభవించాయి. ఈ ఏడాది మే ఇరవై రెండు న ఒక్క రోజునే రెండు వందల ఇరవై మూడు మంది పర్వతారోహకులు శిఖరాగ్రాన్ని చేరినట్లు నేపాల్ ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది పర్వతారోహణ చేసిన వారి సంఖ్య రెండు వందల నాలుగును ఈ ఏడాది విజయవంతంగా అధిగమించారు.

ప్రతి ఏటా పర్వతారోహణ కాలంలో ఎదురవుతున్న భయంకరమైన రద్దీపై నేపాల్ ప్రభుత్వం ఆందోళనగా ఉంది. ఎత్తైన శిఖరాన్ని అధిరోహించేందుకు పోటీ పడుతున్న ఔత్సాహికులు అంతకంతకు ఎక్కువ కావడంతో వారి భద్రత కోసం కఠినమైన మార్గదర్శకాలను రూపొందించే దిశగా ఉంది.ఈ ఏడాది 381 అనుమతులు మంజూరయ్యాయి. ఇది ఇప్పటి వరకూ జారి ఆయిన అనుమతులకంటే అత్యధికం. దీనితో ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకునేందుకు భారీ రద్దీకి దారి తీసింది.

నిపుణుల బృందం నివేదిక మేరకు రూపొందించిన నిబంధనలను నేపాల్ ప్రభుత్వం 2020 పర్వతారోహణ సీజన్ లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది.11 వేల డాలర్ల రుసుము చెల్లించినట్లుగా రుజువు, నేపాల్ లో కనీసం 6500 మీటర్ల ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించి ఉండటం, దృఢమైన ఆరోగ్యం కలిగి వుండటం ఈ నియమాల్లో కొన్ని .ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద తప్పనిసరిగా వీరికి ఆరోగ్య పరీక్ష నిర్వహించాలని నేపాల్ ప్రభుత్వం యోచిస్తోంది. ఎవరైనా ఎత్తైన చోట చిక్కుకు పోతే జీవిత బీమా కాక, గాలింపు, రక్షణ, చికిత్సలకు సంబంధించిన బీమా కూడా ఉండాలి .ఎత్తైన శిఖరాలు ఎక్కిన కనీస మూడేళ్ల అనుభవం ఉండాలి.

ఎవరెస్ట్ శిఖర అధిరోహకులకు ప్రస్తుత నియమాల మేరకు పాస్పోర్టు, వారి సంక్షిప్త జీవిత చరిత్ర ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది . పర్వతారోహణ నిర్వహణ సంస్థలు ఎవరెస్ట్ అధిరోహణకు కనీసం ముప్పై అయిదు వేల డాలర్లను చెల్లించాలి .ఎనిమిది వేల మీటర్ల కన్నా ఎత్తున్న శిఖరాలను ఎక్కేందుకు ఇరవై వేల డాలర్లు చెల్లించాలి.శిఖరం వద్ద రద్దీని నివారించడానికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి జారీ చేసే పర్మిట్ల సంఖ్యను పరిమితం చేయాలని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది అయితే ఈ ఈ చర్య వలన ఆదాయాన్ని కోల్పోయే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటోంది.

1953 లో ఎడ్మండ్ హిల్లరీ టెన్సింగ్ నార్గే లు ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన నాటి నుంచి ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాలనే పర్వతారోహకుల సంఖ్య నానాటికీ ముఖ్యంగా 1990 నుంచి పెరుగుతోంది .అయితే వీరు మానవ వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు, చిరిగిపోయిన గుడారాలు, తాళ్లు, ఉపయోగించిన ఆక్సిజన్ సిలిండర్లు, నిచ్చెనలు, ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు వీటన్నింటినీ ఆ కొండల్లో వదిలేసుకుంటూ వచ్చారు .
ఈ ఏడాది నేపాల్ ప్రభుత్వం 11 టన్నుల చెత్తని, నాలుగు మృతదేహాలను ఆయా ప్రాంతాల నుంచి తొలగించింది.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో మంచు చరియలు కొండ చరియలు విరిగిపడటం వరదలు వంటి వాటికి కారణమవుతున్న వాతావరణ మార్పులకు దారితీసే భూతాపం గురించి అంతర్జాతీయ సమాజం ఆదుర్దాగా ఉంది. భారత్ నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి మైన్మార్ వరకూ విస్తరించి ఉన్న ఈ ప్రాంతాల్లోని హిమానీ నదాలు కనీసం మూడింట ఒక వంతు ఈ శతాబ్దం చివరి నాటికి కరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

ఎవరెస్టు శిఖరాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న వారి సంఖ్యను పరిమితం చేయాలన్న నేపాల్ చర్యను భారత్ స్వాగతించింది. ఈ పరిణామాలపై న్యూఢిల్లీ సహజంగానే ఆందోళన చెందుతోంది. హిమాలయ జీవావరణ వ్యవస్థ క్షిణతను అరికట్టేందుకు న్యూఢిల్లీ కట్టుబడి ఉంది. హిమాలయ పర్యావరణ వ్యవస్థ సుస్థిరతకు జాతీయ కార్యాచరణ ప్రణాళికను, జాతీయ మిషన్ను అమలు చేసింది. సిక్కిం మేఘాలయ నాగాలాండ్ ఉత్తరాఖండ్ సహా పన్నెండు పర్వత రాష్ట్రాలు గత ఏడాది పదిహేను వందలకు పైగా ప్రాంతాలలో హిమాలయన్ క్లీనప్ కార్యక్రమాన్ని నిర్వహించాయి.


రచన: రత్తన్ సల్ది, రాజకీయ విశ్లేషకుడు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన