భారతదేశంలో జల నిర్వహణ దిశగా సమగ్ర విధానం

కీర్తిశేషులైన మాజీ ప్రధాన‌మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రతిష్టాత్మక జ‌ల నిర్వహణ పథకం ‘అటల్ భూజ‌ల యోజన’ను భార‌త ప్ర‌భుత్వం జాతికి అంకితం చేసింది. త‌ద్వారా జ‌ల సంక్షోభం నుంచి లక్షలాది ప్ర‌జ‌లను గ‌ట్టెక్కించే త‌న‌ దృఢ సంక‌ల్పాన్ని చాటింది. వాస్త‌వానికి ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర మోదీ రెండోసారి బాధ్య‌త‌లు చేప‌ట్టాక ‘జలశక్తి’ మంత్రిత్వ శాఖ‌ను ఏర్పాటు చేయ‌డంతోనే జ‌ల సమస్యను మన దేశం ఎలా ప‌రిష్క‌రించ‌బోయేదీ ప్ర‌పంచానికి తెలియజెప్పారు. కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో జల సంబంధ విభాగీకరణకు స్వస్తి ప‌లికి ఒక విపుల, విశిష్ట విధానంవైపు ముంద‌డుగు ప‌డింది. ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లకు అనుగుణంగా దేశ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌క‌పోతే న‌వ భార‌త నిర్మాణం ఫ‌ల‌వంతం కాబోదు. అందుకే ప్ర‌భుత్వం ‘అటల్ భూజల యోజన’కు శ్రీకారం చుట్టింది. దీని అమలుతో గుజరాత్, రాజస్థాన్, హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని 78 జిల్లాల్లో భూగ‌ర్భజ‌ల మ‌ట్టం క్షీణ‌త స‌మ‌స్యకు ప‌రిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా ప్ర‌త్యామ్నాయ పంటల సాగు అవ‌స‌రంపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌లుగుతుంది.

దేశంలో ప్రధానంగా భూగర్భ జలాల వినియోగం ద్వారానే అధికశాతం పంటలు సాగవుతాయి. ఇందుకోసం అత్యధికంగా జలాలను తోడేయడంతోపాటు వర్షపాత ధోరణిలో మార్పులవల్ల భూగర్భజల మట్టం నానాటికీ పడిపోతోంది. ఒక అధ్యయనం ప్రకారం... గ‌డ‌చిన ప‌దేళ్ల‌లో దేశ‌వ్యాప్తంగా భూగ‌ర్భ‌జ‌ల మ‌ట్టం 61 శాతం మేర ప‌తనమైంది. రుతుప‌వ‌న వ‌ర్ష‌పాతంలో అస్థిర‌త్వానికేగాక తత్ఫలితంగా భూగ‌ర్భ‌జ‌ల మ‌ట్టం క్షీణించడానికిగల ప్ర‌ధాన కార‌ణాల్లో భూతాపం కూడా ఒక‌ట‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌రోవైపు 1950 నుంచి స‌గ‌టు వ‌ర్ష‌పాతం 7 శాతం మేర త‌గ్గింది. హిందూమ‌హాస‌ముద్రం, అరేబియ‌న్, బంగాళాఖాతం స‌ముద్రాల నుంచి తేమ‌తో కూడిన ప‌వ‌నాలు నైరుతి దిశ‌నుంచి వీచిన‌ప్పుడు భార‌త‌దేశంలో వ‌ర్షాకాలం మొద‌ల‌వుతుంది. ఏటా జూన్ నెల‌లో ప్ర‌వేశించే ఈ నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో జూలై, ఆగ‌స్టు, సెప్టెంబ‌రుదాకా నాలుగు నెల‌ల‌పాటు వ‌ర్షాలు కురుస్తాయి. అటుపైన అక్టోబ‌రు నుంచి డిసెంబ‌రు మ‌ధ్య ప‌వ‌నాలు మ‌రో దిశ‌నుంచి వీచ‌డం మొద‌ల‌వుతుంది. ఏదేమైన‌ప్ప‌టికీ వాతావ‌ర‌ణ మార్పుల ఫలితంగా కాలానుగుణ వర్షపాత చ‌క్రం కాస్తా క్ర‌మం త‌ప్పింది.

వర్షాకాల క్రమం చెదరడమేగాక‌ లోటు వర్షపాతం... దానికి తోడుగా కరవు, కొన్ని సందర్భాల్లో వరదలు కూడా నేడు మ‌నం చూస్తున్న కొత్త ద‌శ‌లు. అనేక అభివృద్ధి చెందిన దేశాల‌తో పోలిస్తే భార‌త్ చారిత్ర‌కంగా అత్య‌ల్ప హ‌రిత‌వాయు ఉద్గార దేశ‌మ‌న్న‌ది వాస్త‌వం. అయినప్పటికీ మన దేశం వాతావ‌ర‌ణ మార్పు దుష్ఫ‌లితాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో భూగ‌ర్భజ‌ల మ‌ట్టం క్షీణ‌త సమస్య నిర్మూలనకు భార‌త ప్ర‌భుత్వం సిద్ధం కావ‌డం ప్ర‌స్తుత శుభ‌ప‌రిణామం. దీన్ని గురించి ‘అట‌ల్ భూజ‌ల యోజ‌న‌’లో భాగంగాగల వ్యవస్థ విపులంగా వివరిస్తుంది. సుస్థిర భూగర్భజల నిర్వహణ కోసం వ్యవస్థీకృత చట్రాన్ని బలోపేతం చేయడంతోపాటు సామాజిక స్థాయిలో ప్రవర్తనపూర్వక మార్పులు తేవడం దీని ప్రధానోద్దేశం. అలాగే నీటి వినియోగదారుల సంఘాల ఏర్పాటు, భూగ‌ర్భ‌జ‌ల స‌మాచార ప‌ర్య‌వేక్ష‌ణ‌-ప్ర‌దానం, జ‌ల‌బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌, పంచాయ‌తీల స్థాయిలో జ‌లభ‌ద్ర‌త ప్రణాళిక‌ల అమ‌లులో సామాజిక భాగస్వామ్యం వగైరాలు ‘అట‌ల్ భూజ‌ల యోజ‌న‌’ కీలక లక్ష్యాలు. ఏడు రాష్ట్రాల్లోని 78 జిల్లాల పరిధిలోగల దాదాపు 8,350 పంచాయతీలకు ఈ పథకంతో ప్రయోజనం చేకూరుతుంది. జల నిర్వహణలో చక్కటి పనితీరు కనబరచే పంచాయతీలకు ప్రోత్సాహకాలు ప్రకటించే నిబంధన కూడా ఇందులో ఉంది. ఈ మేరకు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంగా ప్రకటించారు. మెరుగైన జల నిర్వహణకుగాను పంచాయతీలకు ఈ పథకం కింద మరిన్ని నిధులిస్తామని కూడా ప్రధానమంత్రి వివరించారు. భూగర్భ జల నిర్వహణ దిశగా ఇదొక సాహసోపేతమైన విధానమన్నది నిస్సందేహంగా వాస్తవం.

ఏదేమైనా ఈ పథకం ఫలితాలివ్వాలంటే రైతుల భాగస్వామ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి. సాగు పద్ధతులను మార్చుకునేలా అవగాహన కల్పించడమేగాక చేయిపట్టి వారిని ముందుకు నడిపించాలి. తక్కువ నీటి వినియోగంతో సాగయ్యే పంటలవైపు దృష్టి సారించాల్సిన అవ‌స‌రాన్ని వారికి వివ‌రించాలి. చెర‌కువంటి పంట‌ల సాగుకు నీరు అధికంగా అవ‌స‌రం... అలాంటి పంట‌లు సాగుచేసే ప్రాంతాల్లో భూగ‌ర్భజ‌ల మ‌ట్టం ఎక్కువ‌గా క్షీణించ‌డమే ఇందుకు నిద‌ర్శ‌నం. నీటి వృథాను త‌గ్గించే దిశ‌గా పాత‌కాల‌పు సాగు ప‌ద్ధ‌తుల్లో మార్పు తేవాల్సిన అవ‌స‌రం ఎంత‌యినా ఉంది. భూగ‌ర్భజ‌ల మ‌ట్టం త‌క్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో నీటి వినియోగంపై రైతులు బ‌డ్జెట్ రూపొందించుకునేలా ప్రోత్స‌హించాలి. అదే స‌మ‌యంలో జ‌ల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌, జ‌ల నిధి ఏర్పాటు దిశ‌గా గ్రామీణ ప్ర‌జ‌లంతా ఏక‌తాటిపైకి రావాలి. నెర్రెలిచ్చిన నేల ప‌చ్చ‌టి పైర్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడాల‌ని దార్శ‌నికుడైన మ‌న మాజీ ప్ర‌ధాన‌మంత్రి అట‌ల్ బిహారీ వాజ్‌పేయి క‌ల‌లుగన్నారు. ఈ నేప‌థ్యంలో జ‌ల‌ వినియోగం, నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌జ‌ల్లో ప్ర‌వ‌ర్త‌నపూర్వ‌క మార్పుల‌ద్వారా ఆ స్వ‌ప్నాల‌ను సాకారం చేయ‌డంలో ఈ ప‌థ‌కం విజ‌య‌వంతం కావ‌డంక‌న్నా ఆ మ‌హ‌నీయుడికి మ‌న‌మిచ్చే ఘ‌న నివాళి మ‌రేముంటుంది!

రచన: శంకర్ కుమార్, పాత్రికేయులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన