పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ తీర్మానాన్ని నిర్ద్వందంగా తిర‌స్క‌రించిన భార‌త్‌

వివిధ సంస్థ‌లు ప‌ర‌స్ప‌రం సంఘ‌ర్షించుకునే ఒక దేశం - పాకిస్తాన్‌. భార‌త్ ప్ర‌తి ఆంత‌రంగిక వ్య‌వ‌హారాన్ని చ‌ర్చించే దుర అల‌వాటు గ‌ల దేశం కూడా పాకిస్తాన్‌. భార‌త్ పార్ల‌మెంట్ ఆమోదం పొంది, చ‌ట్టంగా మారిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (CAA) పై పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ చ‌ర్చించింది. భార‌త్ అంత‌ర్గ‌త అంశ‌మైన ఈ విష‌యంపై చ‌ర్చించే హ‌క్కు పాకిస్తాన్ తో పాటు ఏ ఇత‌ర దేశానికి లేదు. ఆప్గ‌నిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ ల‌లో వివ‌క్ష‌కు గుర‌వుతున్న మెనార్టీల‌కు భార‌త పౌర‌స‌త్వం క‌ల్పించేందుకు ఉద్దేశించిన‌ది ఈ చ‌ట్టం.

మైనార్టీల ప‌ట్ల అత్యంత వివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నందుకు ప్ర‌పంచ దేశాలు తీవ్రంగా త‌ప్పు ప‌ట్టుతుండ‌డంతో భార‌త్ CAA చ‌ట్టంపై పాకిస్తాన్ గ‌గ్గోలు పెడుతోంది. త‌న పౌరుల‌ను కాపాడ‌వ‌ల‌సిన ప్ర‌భుత్వం మైనార్టీల‌ను అన్ని ర‌కాలుగా వివ‌క్ష‌కు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్న దారుణ‌మైన రికార్డు గ‌ల దేశం పాకిస్తాన్‌. మ‌త‌ధూష‌ణ ఆరోప‌ణ‌ల‌పై అరెస్ట్ చేసిన క్రైస్త‌వ వ‌నిత ఆసియా బిబిని పాకిస్తాన్ సుప్రీంకోర్టు విడిచిపెట్టిన‌ప్పుడు అక్క‌డి ఛాంద‌స‌వాదులు ఏ విధంగా స్పందించింది. ప్ర‌పంచ‌మంతా చూసింది. ఆమె, ఆమె కుటుంబం, ఆమె న్యాయ‌వాది పాకిస్తాన్ నుంచి పారిపోయి, విదేశంలో త‌ల‌దాచుకోవ‌ల్సి వ‌చ్చింది.

కాగా పాకిస్తాన్ ప్ర‌స్తుతం తాను మైనార్టీల ర‌క్ష‌కుడిగా క‌నిపించేందుకు తెగ ప్ర‌య‌త్నం చేస్తోంది. పాకిస్తాన్ ప్ర‌భుత్వం ఈ విష‌యంలో ఆత్మ శోధ‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. కొత్త‌గా దేశంగా ఏర్ప‌డిన రోజుల్లో మైనార్టీల ప‌ట్ల జ‌రుగుతున్న వివ‌క్ష మూలంగా పాకిస్తాన్ ముస్లీం లీగ్ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, ఆ దేశ‌పు తొలి న్యాయ కార్మిక శాఖ మంత్రి 1950ల్లోనే దేశాన్ని వీడి వెళ్ళి పోవాల్సి వ‌చ్చింది. కార్మిక శాఖ మంత్రి అయిన జోగేంద్ర నాథ్ మండ‌ల్ పాకిస్తాన్ పౌర‌స‌త్వాన్ని త్య‌జించి - కోల్ క‌తా శివార్ల‌లో శ‌ర‌ణార్ధిగా మారారు. పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాని జుల్ఫిక‌ర్ అలీ బుట్టోకు మ‌ర‌ణ శిక్షను వ్య‌తిరేకించిన పార్సీ మ‌త‌స్తుడైన న్యాయ‌మూర్తి దొరాబ్ ప‌టేల్ కు ఆ త‌రువాతి కాలంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప‌ద‌విని ద‌క్క‌కుండా చేశారు. ఇటువంటి ఉదాహ‌ర‌ణ‌లు ఎన్నో వున్నాయి. పాకిస్తాన్ అణు కార్య‌క్ర‌మ పితామ‌హుడైన డాక్ట‌ర్ ఏ.క్యూఖాన్ అహ్మ‌దీయా తెగ‌కు చెందిన వాడు కావ‌డంతో వివ‌క్షకు గుర‌య్యారు. భార‌త్ అంత‌ర్గ‌త వ్య‌హారంపై పాకిస్తాన్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని భార‌త్ నిర్ద్వందంగా తిర‌స్క‌రించింది. జ‌మ్మూ కాశ్మీర్, ల‌దాక్ ల అంశంపై త‌న దుర్నీతిని కొన‌సాగించేందుకు పాకిస్తాన్ చేసిన చౌక బారు ప్ర‌య‌త్నమిద‌ని భార‌త విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. భార‌త్ స‌రిహ‌ద్దు వెంబ‌డి నిరంత‌రం కొన‌సాగిస్తున్న సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని స‌మ‌ర్దించుకునేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్ర‌య‌త్న‌మిది. 

పాకిస్తాన్ చేస్తున్న ఇటువంటి ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కావ‌ని భార‌త్ గ‌ట్టిగా విశ్వ‌సిస్తోంది. త‌న దేశంలోని మైనార్టీల ప‌ట్ల సాగుతున్న తీవ్ర వివ‌క్ష‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ చేసిన విఫ‌ల ప్ర‌య‌త్న‌మే ఈ తీర్మాన‌మ‌ని భార‌త్ పేర్కొంది. హిందువు లేదా శిక్కు, క్రైస్త‌వుల‌వంటి మైనార్టీల జ‌నాభా పాకిస్తాన్ లో ఏ మేర‌కు ఉంద‌న్న‌దే ఇందుకు నిద‌ర్శ‌నం.

భార‌త్ తీసుకువ‌చ్చిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు పాకిస్తాన్ ఈ తీర్మానాన్ని చేసింది. కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో మ‌త‌మైనార్టీలుగా ఉండి వివ‌క్ష‌కు గుర‌వుతున్న వారికి భార‌త్ పౌర‌స‌త్వం క‌ల్పించేందుకు ఉద్దేశించినదే CAA చ‌ట్టం. భార‌త్‌కు చెందిన ఏ మ‌తానికి చెందిన వ్య‌క్తి పౌర‌స‌త్వాన్ని ఈ చ‌ట్టం హరించదు.

మైనార్టీల‌కు వ్య‌తిరేకంగా వివ‌క్ష పూరిత చ‌ట్టాలు చేసిన పాకిస్తాన్ అసెంబ్లీ ఇత‌రుల‌ను వేలెత్తి చూప‌టం హాస్యాస్ప‌దం. ఇత‌రుల‌పై నింద‌లు మోపే ముందు పాకిస్తాన్ ఆత్మ శోధ‌న చేసుకోవాల‌ని భార‌త్ పేర్కొంటోంది. ప్ర‌పంచంమొత్తం మీద అతి పెద్ద ప్ర‌జాస్వామిక దేశ‌మైన భార‌త్ లో ప్రభుత్వాలు సార్వ‌త్రిక ఎన్నిక‌ల ద్వారా ఏర్ప‌డ‌తాయి. దేశ పౌరులంద‌రికీ స‌మాన హ‌క్కులు వుంటాయ‌న్న విష‌యాన్ని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలి. యాధృచ్ఛికంగా పాకిస్తాన్ మాజీ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముషార‌ఫ్ కు దేశ ద్రోహం నేరంపై మ‌ర‌ణ‌శిక్ష ప‌డిన రోజునే పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ CAAపై తీర్మానం చేసింది. ముషార‌ఫ్ ప్ర‌స్తుతం దుబాయ్ లో వున్నారు. పాకిస్తాన్ కు విశ్వాస పాత్రుడ‌ని ఆ దేశ సైన్యం ప్ర‌క‌టించింది. ఒకరిపై మ‌రొక‌రుపై చేయి సాధించాల‌నే ప్ర‌హ‌స‌నం పాకిస్తాన్‌లో కొన‌సాగుతోంది. 

ర‌చ‌న - కౌషిక్ రాయ్‌, ఆకాశ‌వాణి వార్తా విశ్లేష‌కులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన