పార్లమెంటులో ఈ వారం
భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26న రాజ్యాంగ సభ ఆమోదించిన నేపథ్యంలో గత మంగళవారం దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. కాగా- భారత గణతంత్ర చరిత్రలో నవ శకానికి నాంది పలుకుతూ 1950 జనవరి 26నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా పార్లమెంటు సెంట్రల్ హాలులో నిర్వహించిన ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. హక్కులు, బాధ్యతలు ఒకే నాణానికి రెండు పార్శ్వాలని, ఆ మేరకు పౌరులు తమ కర్తవ్యాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రజలు తమ బాధ్యతలను నెరవేర్చడంద్వారా తమ హక్కుల రక్షణకు తగిన పరిస్థితులను సృష్టించాలని కోరారు. అనంతరం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యసభ పాత్రపై ఒక సంచికను, రాజ్యసభ 250వ సమావేశానికి గుర్తుగా స్మారక నాణాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. వీటితోపాటు డిజిటల్ ప్రదర్శనను కూడా ఆయన ప్రారంభించారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆకాంక్షలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా, కరదీపికగా ఆయన అభివర్ణించారు. రాజ్యాంగ సార్వజనీనతను, శక్తిని ప్రస్తావిస్తూ- పౌరుల హక్కులతోపాటు బాధ్యతలకు ప్రాముఖ్యమివ్వడం ఇందులో విశేషాంశమని పేర్కొన్నారు. గడచిన 70 ఏళ్లుగా మన దేశం ప్రజాస్వామ్యబద్ధ రాజ్యాంగానికి కట్టుబడి ఉందని రాజ్యసభ చైర్మన్ కూడా అయిన ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. అంతేగాక రాజ్యాంగానికి ప్రాణప్రతిష్టసహా ప్రజాస్వామ్య విలువలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లడంలో అద్భుత ప్రగతి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా- జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా అక్కడ కల్లోల సృష్టికి పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టిందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ బుధవారం లోక్‌సభకు తెలిపారు. మరోవైపు జమ్ముకశ్మీర్ అంశాన్ని వివాదాస్పదం చేసేందుకు ఐక్యరాజ్యసమితి, మానవ హక్కుల మండలి, ఇస్లామిక్ సహకార సంస్థ తదితర అంతర్జాతీయ వేదికలను కూడా పాకిస్థాన్ దుర్వినియోగం చేసిందని చెప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా కుట్రపూరిత, తప్పుడు ప్రచారానికి పదేపదే యత్నించిందని గుర్తుచేశారు.
అయితే, పొరుగుదేశం కుట్రలను అన్ని సందర్భాల్లోనూ భారత్ పూర్తిస్థాయిలో వమ్ము చేసిందని మంత్రి చెప్పారు. అలాగే పాక్ భూభాగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులకు వేదిక కాకుండా చూడాల్సిందిగా పలు దేశాలు పాకిస్థాన్ సర్కారును కోరాయని వివరించారు. కాగా, దేశీయాంగ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి బుధవారం రాజ్యసభలో ప్రసంగించారు. పాక్ పరిధిలోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత వైమానిక దళం ధ్వంసం చేయడాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే, ఈ శిబిరాల పునరుద్ధరణకు అక్కడి ఉగ్రవాద సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని వివరించారు. తద్వారా భారతదేశంలో తమ జిహాదీ దుండగాలను తిరిగి ప్రారంభించేందుకు కుట్ర పన్నుతున్నాయని పేర్కొన్నారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజమిచ్చే విధంగా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నదని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అందువల్ల ఆర్థిక మందగమన ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై పడలేదని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనేక చర్యలు తీసుకున్నామని- ఈ అంశంపై రాజ్యసభలో సంక్షిప్త వ్యవధి చర్చకు మంత్రి బదులిచ్చారు.
ఐరోపా పార్లమెంటుకు చెందిన 27 మంది సభ్యుల అఖిలపక్ష ప్రతినిధి బృందం భారత సందర్శనకు వచ్చిందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ గురువారం నాడు రాజ్యసభకు వెల్లడించారు. అలీన అంశాలపై అధ్యయన చేసే ఢిల్లీలోని ఒక అంతర్జాతీయ మేధోనిలయ సంస్థ ఆహ్వానం మేరకు 2019 అక్టోబరు 28 నుంచి నవంబరు 1వరకూ ఈ బృందం పర్యటించిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా భారతదేశంపై ఉగ్రవాద ప్రభావాన్ని అధ్యయనం చేయడం కోసం కశ్మీర్ సందర్శనకు వెళ్తామని వారు కోరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విదేశీ అతిథుల పర్యటనల సందర్భంగా లోగడ చేసిన విధంగానే ఐరోపా పార్లమెంటు సభ్యుల ప్రతినిధుల బృందం కోసం కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. భారత దేశానికి... ప్రత్యేకించి కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు ఉగ్రవాదం ఎంతటి ముప్పుగా పరిణమించిందో ఈ బృందానికి అవగతమైందని మురళీధరన్ పేర్కొన్నారు. ప్రజల మధ్య సంబంధాలను మరింత లోతుకు తీసుకెళ్లాలన్న మన విదేశాంగ విధానానికి అనుగుణంగా ఇలాంటి ఆదానప్రదాన సందర్శనలు నిరంతరం సాగుతుంటాయని వివరించారు. ఇతర దేశాలతో బలమైన స్నేహాన్ని ప్రోత్సహించే భారత్ వైఖరివల్ల అంతిమంగా ప్రజల మధ్య అనుబంధం మరింత పెనవేసుకోగలదని పేర్కొన్నారు.
రచన: వి.మోహన్ రావు, పాత్రికేయులు
Comments
Post a Comment