గగనంలో భార‌త ‘సునిశిత నేత్రం’

దేశంలోని తూర్పు తీరంలోగల సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి భారత్ నిన్న తన ‘సునిశిత నేత్రా’న్ని గగనంలో ప్రవేశపెట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ISRO విజ‌యాశ్వమైన‌ ధ్రువ ఉపగ్రహ ప్రయోగ వాహనం PSLV-C47 ఈ బాధ్య‌త‌ను నెర‌వేర్చింది. ఈ మేర‌కు భారతదేశపు మూడో తరం అధునాతన భూ గ్ర‌హ ప‌రిశీల‌న‌, రేఖా చిత్రీక‌ర‌ణ ఉప‌గ్ర‌హం కార్టోసాట్-3ని కేవలం 17 నిమిషాల్లో సూర్యానువ‌ర్తిత ధ్రువ కక్ష్యలోకి ప్రవేశ‌పెట్టింది. ఇస్రో ఇప్ప‌టిదాకా కక్ష్య‌లో ప్ర‌వేశ‌పెట్టిన గ‌గ‌న నేత్ర ఉప‌గ్ర‌హాల‌లో అత్య‌ధిక స్ప‌ష్ట‌త‌తో చిత్రాలు తీయ‌గ‌ల సామ‌ర్థ్యం కార్టోశాట్‌-3 ప్ర‌త్యేక‌త‌. ఇందుకోసం ఉప‌యోగించిన PSLV-C47 వాహ‌నం అత్యంత శ‌క్తిమంత‌మైనది కాగా- ఇది ఆరు అనుసంధాన బూస్ట‌ర్‌ రాకెట్ల సాయంతో నింగిలోకి దూసుకెళ్లింది. భార‌త అంత‌రిక్ష శాఖ‌కు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌-NSILతో అమెరికాలోని రెండు సంస్థ‌ల‌ వాణిజ్య ఒప్పందం మేర‌కు మ‌న‌ కార్టోశాట్‌-3తోపాటు 13 సూక్ష్మ ఉప‌గ్ర‌హాల‌ను ఈ రాకెట్ విజ‌య‌వంతంగా క‌క్ష్యలో నిలిపింది. నిర్దేశిత ప్ర‌ణాళిక ప్ర‌కారం కార్టోశాట్‌-3ని భూమికి 509 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ప్ర‌వేశ‌పెట్టాక సూక్ష్మ ఉప‌గ్ర‌హాల‌ను వ‌రుస‌గా వాటి క‌క్ష్య‌లోకి విడుద‌ల చేసింది.

ఈ ప్ర‌యోగానికి ముందు కార్టోశాట్-1, కార్టోశాట్‌-2 ప‌రంప‌ర‌లో 7స‌హా మొత్తం 8 ఉప‌గ్ర‌హాల‌ను ఇస్రో అంత‌రిక్షంలో నిలిపింది. ఇవ‌న్నీ ప్ర‌త్యేకంగా మ‌న సాయుధ బ‌ల‌గాల వినియోగానికి ఉద్దేశించిన‌వే. వీటిలో దాదాపు అన్నీ... ముఖ్యంగా మూడేళ్ల వ్య‌వ‌ధిలో ర‌మార‌మి వరుస‌గా ప్ర‌యోగించిన‌ కార్టోశాట్-2 ప‌రంప‌ర‌లోని చివ‌రి నాలుగు ఉప‌గ్ర‌హాలు నేటికీ స‌మాచారం అందిస్తూనే ఉన్నాయి. కాగా- నిన్న ప్ర‌యోగించిన 1,625 కిలోల కార్టోశాట్-3 మిగిలిన ఎనిమిదింటితో పోలిస్తే రెట్టింపు బ‌రువైన‌ది కావ‌డం విశేషం. అత్యంత చురుకైన‌ క‌ద‌లిక‌లుగ‌ల కెమెరా, అమిత వేగంతో స‌మాచార స‌ర‌ఫ‌రా, అధునాత‌న కంప్యూట‌ర్ వ్య‌వ‌స్థ‌, శ‌క్తిమంత‌మైన ఎల‌క్ట్రానిక్ ఉప‌క‌ర‌ణాలు వంటి అనేక కొత్త సాంకేతిక ప‌రిజ్ఞానాలతో కూడిన‌ కార్టోశాట్‌-3 మిగిలిన వాటిక‌న్నా ఎంతో విశిష్ట ఉప‌గ్ర‌హం. కార్టోశాట్ పరంప‌ర‌లో ఇది 9వ ఉప‌గ్ర‌హం. భూ ఉప‌రిత‌లాన్ని అత్యంత స్ప‌ష్టంగా చిత్రీక‌రించే మూడో త‌రం అధునాత‌న స‌దుపాయాలు ఇందులో ఉన్నాయి. కార్టోశాట్‌-2 ప‌రంప‌ర‌లోని ఏడింటిలో చివ‌రివైన కార్టోశాట్‌-2సి, 2డి, 2ఇ, 2ఎఫ్ ఉప‌గ్ర‌హాలు 65 సెంటీమీట‌ర్ల స్థాయిదాకా వ‌స్తువుల‌ను చిత్రించ‌గ‌ల‌వు. వీటితో పోలిస్తే కార్టోశాట్‌-3లోని చిత్రీక‌ర‌ణ వ్య‌వ‌స్థ 500 కిలోమీట‌ర్ల‌కుపైగా ఎత్తునుంచి భూమిపైగ‌ల 25 సెంటీమీట‌ర్ల వ‌స్తువును కూడా స్ప‌ష్టంగా చిత్రించ‌గ‌ల‌దు. అందువ‌ల్ల దీన్ని స‌రిహ‌ద్దుల‌లో సునిశిత‌ నిఘా కోసం కూడా వాడుకోవచ్చు. కాగా- 31 సెంటీమీట‌ర్ల స్ప‌ష్ట‌త‌తో చిత్రాలు తీయ‌గ‌ల అమెరికా సంస్థ మాక్స‌ర్‌కు చెందిన వ‌ర‌ల్డ్‌ వ్యూ-3 ఉప‌గ్ర‌హం ఇప్పుడు రెండోస్థానంలోకి వెళ్లింది.

కార్టోశాట్‌-3తోపాటు పంపిన 13 సూక్ష్మ ఉప‌గ్ర‌హాల‌లో ఒక‌టైన ‘మెష్‌బెడ్‌’- ఉప‌గ్ర‌హ స‌మాచార వ్య‌వస్థ మెరుగుకు ఉద్దేశించిన‌ది. మిగిలిన 12 FLOCK-4P ఉప‌గ్ర‌హాలు కాగా, వీటిని భూ ప‌రిశీల‌న నిమిత్తం ప్ర‌యోగించారు. అయితే, కార్టోశాట్-3 బ‌హుళ ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంద‌ని ఇస్రో తెలిపింది. ఈ ఉప‌గ్ర‌హం తీసే రేఖా చిత్రాలు భూ సంబంధ‌, ప‌ట్ట‌ణ‌-గ్రామీణ అనువ‌ర్త‌నాల‌తోపాటు మౌలిక వ‌స‌తుల ప్ర‌ణాళిక‌లు, తీర భూముల వినియోగం-నియంత్ర‌ణ‌, ర‌హ‌దారులుస‌హా నీటి స‌ర‌ఫ‌రా వంటి స‌దుపాయాల ప‌ర్య‌వేక్ష‌ణ‌-నిర్వ‌హ‌ణ‌, భూ వినియోగ చిత్రప‌టాల త‌యారీ వంటి ఎన్నో అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని పేర్కొంది. కాగా- ఉప‌గ్ర‌హాల కూర్పు, ఏకీక‌ర‌ణ‌, ప‌రీక్ష త‌దిత‌రాల్లో ప్రైవేటు పారిశ్రామిక రంగ స‌న్నిహిత భాగ‌స్వామ్యం కార్టోశాట్‌-3 ప్రయోగంలో కీల‌కాంశం కావ‌డం గ‌మ‌నార్హం. ప్రైవేటు రంగంలో పూర్తిస్థాయి ఉప‌గ్ర‌హాల త‌యారీకి ఇది బాట‌లు ప‌రుస్తుందని ఈ సంద‌ర్భంగా ఇస్రో ఆశాభావం వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతం ఏడాదికి 12 నుంచి 18 ఉప‌గ్ర‌హాల త‌యారీని ఇస్రో ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా విజ‌య‌వంత‌మైన విక్రేత‌లకు ఇస్రో స‌ద‌వ‌కాశం క‌ల్పిస్తుంది. ఆ మేర‌కు రానున్న మూడేళ్ల‌లో ప్ర‌యోగించ త‌ల‌పెట్టిన 36 ఉప‌గ్ర‌హాలకుగాను 27 ఉప‌గ్ర‌హాల త‌యారీలో అవి స‌మ‌ష్టిగా పాలుపంచుకునే వీలుంటుంది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు PSLV రాకెట్ విశ్వసనీయ విజయాశ్వమ‌నే వాస్త‌వం నిన్న‌టి సాఫ‌ల్యంతో మ‌రోసారి రుజువైంది. ఇప్ప‌టిదాకా 49 సార్లు ఈ రాకెట్‌తో ప్ర‌యోగాలు నిర్వ‌హించ‌గా- కేవ‌లం రెండుసార్లు మాత్ర‌మే అది విఫ‌ల‌మైంది. అందులో 1993నాటి తొలి ప్ర‌యోగం మొద‌టిది కాగా- 2017 సెప్టెంబ‌రులో PSLV-C39 నిర్దేశిత క‌క్ష్య‌ను క‌చ్చితంగా చేరినా, ఉష్ణ‌క‌వ‌చం తెరుచుకోని కార‌ణంగా IRNSS-1H ఉప‌గ్ర‌హం విడుద‌ల సాధ్యం కాలేదు. ఈ రెండు వైఫ‌ల్యాలు మిన‌హా PSLV ఎన్న‌డూ నిరాశ‌ప‌ర‌చ‌లేదు. చంద్రుడిపైకి, అంగార‌క గ్ర‌హానికి ఇస్రో తొలి ప్ర‌యోగాలు చంద్ర‌యాన్‌-1, మంగ‌ళ్‌యాన్‌-1ల‌ను ఈ రాకెట్‌తోనే నిర్వ‌హించారు. ఇప్పుడిక తొలిసారి భార‌త భూ భూగంపైనుంచి స్వ‌దేశీ వ్యోమ‌గాముల‌ను పంప‌డానికి ఇస్రో స‌న్న‌ద్ధమ‌వుతోంది. ఆ మేర‌కు 2022లో భార‌త 75వ స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా భూ-స‌మీప క‌క్ష్య‌లోకి తొలి బృందాన్ని పంపాల్సి ఉంది. వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న ఇస్రో ఈ ల‌క్ష్య సాధన‌లోనూ స‌ఫ‌లం కాగ‌ల‌ద‌ని ఆశిద్దాం!

రచన: బిమన్ బసు, శాస్త్రీయాంశాలపై సీనియర్ వ్యాఖ్యాత

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన