బ్రిటన్‌లో ఆకస్మిక ఎన్నికలు... స్థూల పరిశీలన
బ్రిటన్‌లో డిసెంబరు 12వ తేదీన పార్లమెంటు ఆకస్మిక ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ నిష్క్రమణ సంబంధిత ‘‘బ్రెగ్జిట్’’ ప్రణాళికకు చట్టసభలో సంపూర్ణ మద్దతు లక్ష్యంగా ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. మొత్తంమీద ఐదేళ్ల వ్యవధిలో సార్వత్రిక ఎన్నికలు జరగడం ఇది నాలుగోసారి. ‘‘బ్రెగ్జిట్’’పై 2016లో ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత దేశంలో రాజకీయ అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఈ నిరంతర సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి ఎన్నికలే మార్గమని జాన్సన్ స్పష్టం చేశారు. ఇంతకుముందు 2017లోనూ అప్పటి ప్రధాని ‘థెరెసా మే’ ఆకస్మిక ఎన్నికలకు వెళ్లారు. అయితే, కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వం పార్లమెంటులో ఆధిక్యం కోల్పోయింది. ఫలితంగా అధికారంలో కొనసాగడం కోసం డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ-DUP మద్దతు తీసుకోవాల్సి వచ్చింది.
సార్వత్రిక ఎన్నికల ప్రచారం మూడో వారంలో ప్రవేశించిన నేపథ్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ మేరకు- ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీపై కన్జర్వేటివ్ పార్టీ 19 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఆ మేరకు కన్జర్వేటివ్ పార్టీకి 47 శాతం, లేబర్ పార్టీకి 28 శాతం వంతున ఓటర్ల మద్దతున్నట్లు తేలింది. ఇక లిబరల్ డెమోక్రాట్ పార్టీ 12 శాతం, బ్రెగ్జిట్ పార్టీ 3 శాతం చొప్పున ఓటర్ల మద్దతుతో వెనుకబడి ఉన్నాయి. ఆయా పార్టీల ఎన్నికల ప్రణాళికలను స్థూలంగా పరిశీలిస్తే- అవన్నీ ప్రస్తుత ప్రధాన సమస్య అయిన బ్రెగ్జిట్ కేంద్రకంగానే రూపొందాయని స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది జనవరి ఆఖరుకల్లా బ్రెగ్జిట్ ప్రణాళిక సంపూర్ణ అమలుకు శపథం చేసిన కన్జర్వేటివ్ పార్టీ- దీన్నే తమ ప్రధాన ప్రచారాంశంగా మలచింది. తద్వారా ‘‘నవ బ్రిటన్’’ నిర్మాణమే తమ లక్ష్యమని ప్రకటించింది. ‘‘బ్రెగ్జిట్’’ సంపూర్ణ అమలుద్వారా దేశంలో జాతీయ ఆరోగ్య సేవలు, పాఠశాల విద్య, పోలీసు తదితర ప్రధాన వ్యవస్థల ప్రగతిపై దృష్టి కేంద్రీకరించడం సాధ్యమని పేర్కొంటోంది.
‘‘బ్రెగ్జిట్’’పై ప్రజలకు అంతిమ నిర్ణయాధికారంద్వారా ఆరు నెలల్లో ఆ సమస్యను పరిష్కరిస్తామని లేబర్ పార్టీ నేత జెరెమీ కోర్బిన్ ఇటీవలి తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు. అలాగే కొత్త ఒప్పందంలో యునైటెడ్ కింగ్‌డమ్ వ్యాప్తంగా ‘‘శాశ్వత, సమగ్ర దిగుమతి సుంకాల’’ విధానం, ఏకీకృత విపణితో సాన్నిహిత్యం అంతర్భాగంగా ఉంటాయని ఆ పార్టీ స్పష్టం చేసింది. కాగా, తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘‘నిష్క్రమించండి లేదా కొనసాగండి’’ అనే నినాదాన్ని పట్టించుకోనని కోర్బిన్ మరొక సందర్భంలో తటస్థ వైఖరి ప్రకటించారు. అయితే, దేశాన్ని పీడిస్తున్న రాజకీయ అనిశ్చితిని అంతంచేసి, తమ సామాజిక-ఆర్థిక జీవనానికి భరోసా ఇవ్వగల నాయకత్వం కోసం బ్రిటన్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందువల్ల కోర్బిన్ తటస్థ వైఖరి లేబర్ పార్టీకి విఘాతంకాగల ప్రమాదం ఉంది. మరోవైపు తమకు పూర్తి ఆధిక్యంతో అధికారం సంక్రమిస్తే ఐరోపా సమాఖ్యలో బ్రిటన్ కొనసాగేలా 50వ రాజ్యాంగ నిబంధనను రద్దు చేస్తామని లిబరల్ డెమోక్రాట్ పార్టీ తమ ప్రణాళికలో ప్రకటించింది. ఇక ‘‘ఒడుదొడుకులు లేని బ్రెగ్జిట్’’పై ప్రధానంగా దృష్టిపెట్టిన బ్రెగ్జిట్ పార్టీ మాత్రం ఈ దిశగా ఒప్పందం కుదుర్చుకోవాలని కన్జర్వేటివ్ పార్టీకి పిలుపునిచ్చింది.
ఇదిలా ఉంటే- ఈ ఎన్నికలతో ఏ సంబంధమూ లేకపోయినా లేబర్ పార్టీ అనవసరంగా భారత్‌ను ఒక ప్రచారాంశంగా మార్చేసింది. ఆ మేరకు ‘‘కశ్మీర్‌లో మానవతావాద సంక్షోభం’’ కొనసాగుతున్నదని, అక్కడి ప్రజలకు స్వీయ నిర్ణయాధికారం ఇవ్వాలని సెప్టెంబరునాటి పార్టీ సమావేశంలో తీర్మానించడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఇది సత్యదూరమైనదేగాక, పూర్తిగా అర్థరహిత ప్రేలాపన అనడంలో సందేహం లేదు. సార్వభౌమాధికారంగల రాజ్యంగా అంతర్గత మార్పుచేర్పులు చేసుకునే హక్కు భారతదేశానికి ఉంది. తదనుగుణంగా 370 రాజ్యాంగ నిబంధన రద్దుకు జాతీయంగానేగాక అంతర్జాతీయంగానూ సంపూర్ణ ఆమోదం లభించింది. బ్రిటన్‌లో ఓటింగ్‌కు కశ్మీర్ వంటి అంశం నిర్ణయాత్మకం కావడమంటే ఎన్నికలకు ముందు అనవసర ఉద్రిక్తతలకు తావివ్వడమే అవుతుంది.
ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ నిష్క్రమణపై ప్రతిష్టంభనను ఈ ఎన్నికలు తొలగించలేని పక్షంలో దేశ భవితవ్యమే అనిశ్చితిలో పడవచ్చు. వచ్చే ఏడాదికల్లా బ్రెగ్జిట్ భారం దించుకోవడానికి ఇదే మంచి తరుణం. ఇప్పుడిది సాధ్యం కాకపోతే అనిశ్చితి పేరుకుపోయి దేశ ప్రగతిని, ఆర్థిక వ్యవస్థ వృద్ధిని దెబ్బతీసే ముప్పు పొంచి ఉంది. ఈ పరిస్థితుల నడుమ ఆకస్మిక ఎన్నికలకు వెళ్లడంద్వారా ప్రధానమంత్రి జాన్సన్ సాహసం చేశారనే చెప్పాలి. మరోవైపు తమ పార్టీ అధికారంలోకి వస్తే- ఒప్పందంతో నిమిత్తంలేని బ్రెగ్జిట్‌కు సన్నాహాలు కొనసాగుతాయని ఆర్థికశాఖ మంత్రి రిషి సునాక్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జాన్సన్‌కు గడ్డు కాలం ఎదురయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా 2020 డిసెంబరు 31 తర్వాత చర్చల గడువు పొడిగింపు ఉండదని కూడా జాన్సన్ నిర్ణయించారు. దీనివల్ల ఐరోపా సమాఖ్య ఎలాంటి షరతులు విధించినా అంగీకరించడం తప్పనిసరి కావచ్చు... లేదా ఎలాంటి ఒప్పందం లేకుండా యునైటెడ్ కింగ్‌డమ్ నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదిఏమైనా బ్రెగ్జిట్‌పై ఒక కచ్చితమైన నిర్ణయానికి పార్లమెంటులో ఆధిక్యం లేకపోవడమన్నది ప్రధాన అవరోధం. కాబట్టి ప్రస్తుత ఎన్నికలతో ఈ సమస్య సమసిపోతుందా అన్న ప్రశ్నకు సమాధానం కోసం ఫలితాలు వెలువడేదాకా వేచిచూడక తప్పదు!
రచన: డాక్టర్ సంఘమిత్ర శర్మ, ఐరోపా వ్యవహారాలపై వ్యూహాత్మక విశ్లేషకులు
Comments
Post a Comment