పార్లమెంటులోఈ వారం

భారత పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎగువసభ రాజ్యసభ 250వ సమావేశ వేడుకలతో ఆరంభమై 3 వారాలపాటు కొనసాగే ఈ సమావేశాలలో ఇదే ప్రధానాంశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ - జాతీయ దృష్టి కోణానికి, ప్రాంతీయ ప్రయోజనాలకు మధ్య సమతుల్యతను పాటించాలని సభ్యులకు పిలుపునిచ్చారు. ప్రజాహిత అంశాలపై సభకు అంతరాయం కల్గించటం కాక చర్చలకు పెద్ద పీట వేయాలన్నారు. అడ్డు కట్టలకు, సమతుల్యతలకు దారికల్పించే ఎగువసభ ఉండటం ఎంతో అవసరమని ప్రధానమంత్రి వక్కాణించారు. కానీ అడ్డుకట్టలకు, ప్రతిష్ఠంభనలకు నడుమ గిరి గీయాలని ప్రధాని హెచ్చరించారు. భారత్ లోని భిన్నత్వంలో ఏకత్వం పెద్దల సభలో చాలా చక్కగా ప్రతిబింబిస్తుందన్నారు.

భారత రాజకీయ వ్యవస్థలో ఎగువ సభ భూమికను, సంస్కరణల ఆవశ్యకతను గురించి ప్రస్తావిస్తూ - రాజ్యాంగ వ్యవస్థాపకులు శాసన ద్విసభ చట్రం మంచిదని భావించి ఈ ఏర్పాటు చేసారని ఈ దార్శనికత వల్లనే దేశ ప్రజాస్వామ్యం సుసంపన్నంగా పరిఢవిల్లిందని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఎన్నికల రాజకీయాలకు దూరంగా వుండేవారు సైతం దేశానికి దేశాభివృద్ధికి పాటుపడే అవకాశాన్ని రాజ్యసభ కల్పిస్తుందన్నారు. రాష్ట్రాల కూటమి పార్లమెంటేరియన్లలో సహకార సమాఖ్య స్ఫూర్తిని పెంపొందిస్తుందని ప్రధాని చెప్పారు. యావత్తు దేశాభివృద్ధికి రాజ్యసభ అండనిచ్చి దన్నుగా నిలవాలన్నారు. సభాధ్యక్షుడు ఎమ్.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ - దేశ సామాజిక - ఆర్థిక ప‌రివ‌ర్తన క్రమంలో రాజ్యసభ గణనీయ పాత్రను పోషించిందని చెప్పారు.

ఇక హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి - గడచిన 6 నెలల్లో జమ్ము-కశ్మీరును 13 వేల మంది విదేశీయులతో సహా మొత్తం 35 లక్షలమంది పర్యాటకులు సందర్శించారని, పర్యాటకం ద్వారా రాష్ట్రం 25 కోట్ల రూపాయలమేర ఆదాయం గడిచిందని లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. జమ్ము-కశ్మీరులో 370వ అధికరణం రద్దు అనంతరం రాళ్ళు రువ్వే ఘటనలు తగ్గుముఖం పట్టినట్టు పార్లమెంటుకు తెలిపారు. 2019 ఆగస్టు 5వ తేదీ నుండి నవంబరు 15 వరకు రాళ్ళురువ్వటం, శాంతి భద్రతలకు సంబంధించి 190 కేసులు నమోదయ్యాయని కిషన్ రెడ్డి లిఖిత సమాధానంలో లోక్సభకు తెలిపారు.

కాగా జమ్ము-కశ్మీరులో పరిస్థితి పూర్తి సాధారణ స్థాయికి చేరిందని మొత్తం 195 పోలీసు స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఎత్తివేసినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్షా ఉద్భాటించారు. ఆ ప్రాంతంలో భద్రత పరిస్థితిపై సమీక్షించిన అనంతరం రాష్ట్ర అధికారులు చేసే సిఫార్సుల ఆధారంగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించే విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజ్యసభలో ఒక అనుబంధ ప్రశ్నకు జవాబిస్తూ ఆయన - 370 అధికరణ రద్దు, రాష్ట్ర విభజన తదుపరి పోలీసు కాల్పులలో ఒక్క మరణమూ లేదని మంత్రి తెలిపారు.

ఒక దేశం - ఒక భాష - ప్రతిపాదన ఏదీ తన వద్ద లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని అన్ని భాషలకు రాజ్యాంగం సమాన ప్రాధాన్యం కల్పించిందని పేర్కొంది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి ఈ మేరకు బదులిచ్చారు.

ఇక విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వి.మురళీధరన్ ఒక సమాధానంలో - చైనా చేపట్టిన వన్బెల్ట్ - వన్ రోడ్ (OBOR)ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉందని చెప్పారు. కాని కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ము-కశ్మీరు, లడఖ్ లలోని పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతాల మీదుగా ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టు కింద చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోందన్నారు. దీనివల్ల భారత సార్వభౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగం వాటిల్లుతుందని తెలిపారు. సార్వత్రిక గుర్తింపు పొందిన అంతర్జాతీయ నిబంధనలకు లోబడి అనుసంధాన కార్యక్రమాలు వుండాలని భారత్ గట్టిగా విశ్వసిస్తుందని ఆయన చెప్పారు.


ఇక దేశ రాజధానిలో కాలుష్య సమస్యపై లోక్ స‌భ‌ ప్రధానంగా చర్చించింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని రాజకీయాలను పక్కకు నెట్టి సమస్యకు సత్వర పరిష్కారం కనుగొనాలని పార్టీలకతీతంగా సభ్యులంతా ముక్త కంఠంతో పేర్కొన్నారు. ఇందుకు రైతులను ఆర్థికంగా సాధికారులను చేయాలని, పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టాలని వాయుశుద్ధి టవర్ల ఏర్పాటుకై ప్రతి పార్లమెంటు సభ్యుని MPLADS నిధుల నుండి రూ.2 కోట్ల వంతున ఇవ్వాలని వారు పలు సూచనలు చేసారు.




ఆంగ్ల రచన : వి.మోహనరావు, జర్నలిస్టు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన