బంధాలు బలోపేతానికి భారత విదేశాంగ మంత్రి శ్రీ లంక పర్యటన
శ్రీలంక ఏడవ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎన్నికైన గోతబయ రాజపక్సను, భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్.ఎస్. జైశంకర్ కొలంబోలో కలిశారు.శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జైశంకర్ ప్రత్యేకంగా కొలంబో వెళ్లి, నూతన అధ్యక్షునిగా ఎన్నికైన గోతబయను అభినందించారు.ఈ సందర్భంగా భారత దేశంలో పర్యటించాలని శ్రీలంక నూతన అధ్యక్షుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరపున జైశంకర్ ఆహ్వానించారు. శ్రీలంక అధ్యక్షుడు భారత దేశ ఆహ్వానాన్ని ఆమోదించారు. నవంబర్ 29న భారత దేశంలో పర్యటించేందుకు అంగీకరించారు. ఇదే శ్రీలంక నూతన అధ్యక్షుని తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. శ్రీలంక నూతన అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించేందుకు స్వయంగా విదేశాంగ మంత్రిని కొలంబో పంపడం ద్వారా భారత దేశం, ఉభయ తారకంగా, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత దేశం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.అలాగే, నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం ఆసక్తి చూపుతోందనే స్పష్టమైన సంకేతాలను ఆ దేశానికి ఇచ్చినట్లయింది.భారత దేశంతో పాటుగా అమెరికా,పాకిస్థాన్,ఇరాన్, చైనా కూడా గోతబయ రాజపక్సేను అభినందించాయి. అయితే యురోపియన్ యూనియన్ మాత్రం ప్రజా తీర్పుపై ఆచి తూచి స్పందించింది. ద్వీప దేశ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన రాజపక్సేను, మానవ హక్కుల ఒప్పందాలను గౌరవించాలని ఈయూ కోరింది.
గోతబయ రాజపక్ష గెలుపు, భవిష్యత్’లో దేశ పార్లమెంట్’లోనూ శ్రీలంక పోదుజన పెరుమున (ఎస్ఎల్పీపీ) ఆధిక్యతను సుస్థిర పరుస్తుంది. ఈ నేపధ్యంలో శ్రీలంక మాజీ అధ్యక్షుడు, గోతబయ సోదరుడు, మహీంద రాజపక్సే దేశ ప్రధాని అవుతారు. అదే గనుక జరిగితే, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత ప్రయోజనాలు, సమస్యల పట్ల అంతగా సానుకూలంగా లేని పొరుగు దేశంతో చాలా జాగ్రత్తగా మెలగ వలసి వస్తుంది. అలాగే, శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో, ముఖ్యంగా యుద్దానంతరం ప్రారంభమైన జాతుల మధ్య సయోధ్య యత్నాల విషయంలోనూ భారత ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది.అయితే, గతంలో ఈలం నాల్గవ యుద్ధం సమయంలో గోతబయ రాజపక్సే శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శిగా,భారత అధికారులతో చాల సన్నిహితంగా మెలిగారు, కలిసి పనిచేశారు. భారత అధికారులతో సన్నిహితంగా పనిచేసిన యంత్రాంగం LTTE ని ఓడించడంలో శ్రీలంకకు ఉపకరించింది. అప్పట్లో శ్రీలంక ఆ యంత్రాంగం విజయవంతమైందని భావించింది. అలాగే, అదే విధమైన యంత్రాంగం ద్వారా, శ్రీలంక జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు కొనసాగించాలని భావించింది.
నిజానికి, SLPP ఎన్నికల ప్రణాలికలోనూ ఇదే విషయాన్నిపేర్కొంది. ప్రాంతీయ భద్రత, సార్క్, BIMSTEC దేశాల భద్రత భరోసా కొరకు శ్రీలంక భారత దేశంతో సన్నిహితంగా కలిసి పనిచేస్తుందని, SLPP ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. అదే విధంగా ఎన్నికలకు ముందు SLPP, సయోధ్యత, జవాబుదారీ తనానికి సంబందించిన అంశాల విషయంలో ఐక్య రాజ్య సమితి తీర్మానాన్ని గౌరవించేది లేదని స్పష్టం చేసింది. గత ఐదు సంవత్సరాలుగా భారత దేశం ఐక్యరాజ్య సమితిలో శ్రీలంకను సమర్ధిస్తూ వస్తోంది. ఈ నేపధ్యంలో సంక్లిష్ట సమస్య పరిష్కారానికి భారత, శ్రీలంక ప్రభుత్వాలు సంయుక్తంగా పనిచేయవలసిన అవసరం ఉంది. ఇది కాదనలేని వాస్తవం.హిందూ మహా సముద్ర ప్రాంతంలో, నౌకా కేంద్రం, పోర్ట్ కాల్ మానిటరింగ్ వ్యవస్థల ఏర్పాటుకు సంబందింఛి భారత దేశ రక్షణ విషయంగా వ్యక్తపరుస్తున్న ఆందోళనలకు శ్రీలంక నూతన ప్రభుత్వం సున్నితంగా, సానుకూలంగా స్పందిస్తుందని భారత దేశం ఆశిస్తోంది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రణాలిక - BRI – అమలు చేయడంలో శ్రీలంక ఒక ప్రధాన భాగస్వామిగా ఉంది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన ప్రభుత్వం 2017లో హంబాన్’టోటా పోర్టును చైనాకు 99 సంవత్సరాల లీజుకు ఇచ్చింది.అయితే, పోర్టును చైనాకు లీజును ఇవ్వడాన్ని, SLPP తీవ్రంగా వ్యతిరేకించింది. అంతే కాదు, తాము అధికారంలోకి వస్తే పోర్టు లీజు ఒప్పందాన్ని పునః పరిశీలిస్తామని ప్రజలకు వాగ్దానం చేసింది.
అదే విధంగా SLPP, ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మ్యానిఫెస్టోలో, గాల్లే, కంకేసంతురాయి, ట్రిన్న్కోమలై పోర్టులను, మట్టాల, కటునాయకే విమానాశ్రయాల అభివృద్ధితో కూడిన, ‘జాతీయ ఆర్థిక పునరుద్ధరణ’ ప్రణాళికను అమలు చేస్తామని పేర్కొంది. శ్రీలంక ఈ కలను నిజం చేసుకునేందుకు ఇరుగు పొరుగు ఆసియా దేశాల వైపు చూస్తుంది. ఇది శ్రీలంక నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు భారత దేశానికి ద్వారాలు తెరుస్తుంది.
ఇదిలా ఉండగా, చైనా ప్రభుత్వం, శ్రీలంక నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేందుకు సిద్ధంగా ఉందని ఆ దేశం ప్రకటించింది. శ్రీలంక అధ్యక్షునిగా ఎన్నికైన గోతబయను అభినందిస్తూ చైనా ప్రభుత్వం ‘ద్వైపాక్షిక అంశాలు, BRI పరిధిలోని ప్రాజెక్టుల విషయంలో మరింత ప్రగతి సాధన లక్ష్యంగా శ్రీలంక నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు, చైనా సిద్ధంగా ఉందని పేర్కొంది. కాబట్టి, చైనా ప్రాజెక్టుల వలన శ్రీలంకపై రుణ భారం పెరుగుతున్నా, చైనా, శ్రీలంక అభివృద్ధి, వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న నేపధ్యంలో శ్రీలంక నూతన ప్రభుత్వం, గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం చైనా ప్రారంభించిన ప్రాజెక్టులను కొనసాగించవచ్చును. భారత దేశం పొరుగు దేశంలో, చైనా BRI ప్రాజెక్టుల విషయంలో శ్రద్ధ చూపడం లేదు. అంతే చైనా BRI ప్రాజెక్టులను సహేతుక ఆధారాలతో భారత దేశం వ్యతిరేకిస్తోంది.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గమనిస్తే, 2015 నుంచి ఐదేళ్ళ పాటు అధికారంలో ఉన్న యూనిటీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను లంక ప్రజలు వ్యతిరేకించారు, అని అర్థమవుతుంది. కాబట్టి, శ్రీలంక నూతన ప్రభుత్వం, రాజకీయ, ఆర్థిక, రక్షణ, విదేశాంగ విధానాలలో అనివార్యంగా మార్పులు చోటుచేసుకుంటాయి, అందులో సందేహం లేదు. ఈ అవకాశాలను వినియోగించుకుని,శ్రీలంకలో నూతన ప్రభుత్వం ఏర్పడడం వలన తలెత్తే సవాళ్లను భారత దేశం తనకు అనుకులంగా మలచుకోవాదం పై ఉభయ దేశాల భవిష్యత్ బంధాలు ఆధారపడి ఉంటాయి. అదే విధంగా శ్రీలంక నూతన నాయకత్వ పై కూడా భవిష్యత్ బంధాలు ఆధారపడతాయి.అలాగే, వచ్చే వారం జరిగే శ్రీలంక నూతన అధ్యక్షుడి భారత పర్యటన ఉభయ దేశాల ద్వైపాక్షిక భవిష్యత్ సంబంధాలతో పాటుగా, ఇరుగుపొరుగు దేశాల మధ్య ప్రాంతీయ సహకారం పై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అంత వరకు వేచి చూద్దాం.
రచన: డాక్టర్. ఎం. సమత, శ్రీలంక వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు
Comments
Post a Comment