పార్లమెంటు శీతాకాల సమావేశాల ఎదుట గల అంశాలు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 18న ప్రారంభమవుతున్నాయి. డిసెంబరు 13 వరకు జరుగుతాయి. ఈ సమావేశంలో అనేక బిల్లులను చర్చకు చేపడతారు. ఈ సమావేశాలలో రెండు కీలక ఆర్డినెన్సులు కూడా చట్టరూపం దాల్చనున్నాయి. అలాగే విధాన ఆమోదం, ఉత్పాదకత, కీలక దేశ ప్రయోజన అంశాలపై రాజకీయ ఏకాభిప్రాయం - అనే మూడు అంశాలు సమావేశాలలో కీలకంగా ఉంటాయి. వివిధ సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు ప్రయత్నించే వున్నందున పార్లమెంటు శీతాకాల సమావేశాలు రభసగా ఉంటాయని భావిస్తున్నారు. గడచిన రెండేళ్లలో శీతాకాల సమావేశాలు నవంబరు 21న ప్రారంభమై జనవరి మొదటివారంలో ముగిసాయి.
ఈ ఏడాది జరిగిన వర్షాకాల సమావేశాలలో ట్రిపుల్ తలాఖ్, మోటారు వాహనాల చట్టం, జాతీయ దర్యాప్తు సంస్థ సవరణల చట్టం మైలురాయి బిల్లులు కాగా 370వ అధికరణతోపాటు జమ్మూ - కాశ్మీరును పూర్తిగా జాతీయ ప్రధాన స్రవంతిలో కలిపేందుకు అడ్డంకిగా ఉన్న జమ్మూ - కాశ్మీరు పునర్ వ్యవస్థీకరణ చట్టాల రద్దును సమావేశాల మరీ ప్రత్యేకంగా చెప్పాలి. ఇక జాతీయ పౌరుల రిజిస్టర్‌లు (NRE) తుదిజాబితాను ఆగస్టులో ప్రకటించినందున అధికార భారతీయ జనతాపార్టీ (BJP) తన మొదటి పదవీకాలంలో 2019 జనవరి 8వ తేదీన ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు ఈసారి మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
అదే సమయంలో కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన రెండు ఆర్డినెన్సులను ఈసారి సమావేశాల్లో పార్లమెంటు ముందుంచుతారని భావిస్తున్నారు. వాటిలో ఒకటి ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని నిలువరించేందుకు వీలుగా కొత్త, స్వదేశీ తయారీకంపెనీలకు కార్పొరేటు పన్ను రేట్లు తగ్గించటాని కుద్దేశించింది. ఈ ఆర్డినెన్సును 1961లో చేసిన ఆదాయం పన్ను చట్ట సవరణలు 2019 ద్రవ్య చట్ట సవరణలను అమల్లోకి తేవడానికి ఈ సంవత్సరం సెప్టెంబరులో జారీ చేశారు. 2వ ఆర్డినెన్సు కూడ మహారాష్ట్ర- హర్యానాలలో ఎన్నికల గెలుపు ఖాయంగా కనిపించిన అనంతరం సెప్టెంబరులోనే జారీ అయింది.
ఇక భారత్ లో ఈ-సిగరెట్ల అమ్మకం, తయారీ, నిల్వలను నిషేధిస్తూ చేసిన బిల్లులు కూడా ఈ సమావేశాలలో పార్లమెంటు ముందుకు రానున్నాయి.
ఇలా ఉండగా ప్రతిపక్షాలు కూడా సమావేశాలకు తమవంతు సన్నద్ధమవుతున్నాయి. తాము దేశ ఆర్థికవ్యవస్థ పరిస్థితి, జమ్మూ కాశ్మీరు పరిస్థితి - ఈ రెండు కీలకాంశాలను ఈ శీతాకాల సమావేశాలలో లేవనెత్తుతామని సీనియర్ నాయకులు సూచించారు. ముంబయిలో గతవారం జరిగిన ముఖాముఖిలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ - పంజాబు - మహారాష్ట్ర సహకార బ్యాంకు విషయం కూడా ఈసారి పార్లమెంటు సమావేశాలలో చర్చకు రావచ్చునని చెప్పారు.
శీతాకాల సమావేశాలకు ముందు ఎగువసభ - రాజ్యసభ ఛైర్మన్ ఎమ్.వెంకయ్యనాయుడు గత ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సభ అజెండాలో ప్రధానంగా చర్చకు వచ్చే అంశం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపు కానుంది. గత అనేక సంవత్సరాలలో ఎగువ సభలో అధికార కూటమి సౌకర్యవంతమైన మెజార్టీ కలిగి ఉండటం ఇదే మొదటిసారి. బిజుజనతాదళ్ (BJD), తెలంగాణ రాష్ట్రసమితి (TRS), వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (YSRCP), BJPకి అంశాల ఆధారంగా మద్దతునిస్తున్న సంగతిని గుర్తించాలి.
ఇంకా ఈ శీతాకాల సమావేశాలలో ఇన్‌సాల్వెన్సీ - బాంకరప్సీ కోడ్ (IBC)లో సవరణ ప్రవేశపెట్టడానికి కూడా ప్రణాళిక సిద్ధమవుతోంది. సీమాంతర దివాళాకు సంబంధించి నిబంధనలు చేర్చేందుకోసం ఈ సవరణలను ఉద్దేశించారు. ఈ నిబంధనల వల్ల భారత సంస్థలు - విదేశీ సంస్థల నుంచి రావలసిన బకాయిలను అడగటానికి అలాగే విదేశీ రుణదాతలు భారత కంపెనీల నుంచి రుణాలను రాబట్టేందుకు వీలు ఏర్పడుతుంది. విదేశీ రుణదాతలేకాదు, భారత బ్యాంకుల విదేశీ శాఖలు కూడా భారత్ లో తమ బకాయిలను రాబట్టగలుగుతాయి. ఇంకా IBC పరిధిలో సీమాంతర దివాళా నిబంధనలను ప్రవేశపెట్టటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రుణ గ్రహీతల ఆస్తుల కేసుల పరిష్కారానికై రుణదాతలు ప్రయత్నాలు కొనసాగించే వెసులుబాటు వుంటుంది.
కోడ్ కింద 227వ సెక్షన్ ను నోటిఫై చేయాలని కూడా కేంద్రం యోచిస్తోంది. దీనివల్ల బ్యాంకింగేతర ఆర్థికసంస్థల (ఎన్.బి.ఎఫ్.సిఎస్) వంటి ఆర్థిక సేవల ప్రొవైడర్ల కేసుల పరిష్కారానికి కూడా మార్గం సుగమం అవుతుంది.
ఇటువంటి సంక్లిష్ట కేసుల పరిష్కారానికి ఇన్‌సాల్వెన్సీ చట్టంలో స్పష్టమైన నిబంధనలు లేని కారణంగా ప్రస్తుతం ఎటూ తేలకుండా వున్న ఎన్నో కేసుల సమర్ధ, సత్వర పరిష్కారం ఈ చర్యలతో సాధ్యం కానుంది.
కాగా సభలో రభస సృష్టించి వాకౌట్ చేయడం కాకుండా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసి చర్చలలో పాల్గొనాలి. పార్లమెంటులో అన్ని పార్టీల నుంచి కాకలు తీరిన పలువురు పార్లమెంటేరియన్లు ఉన్న సమయం ఉన్నది. మళ్ళీ ఇప్పుడు నవభారత్ కోసం అటువంటి జట్టును నిర్మించాల్సిన అవకాశం ఇదేమరి.
ఆంగ్ల రచన : యోగేష్ సూద్ - జర్నలిస్టు
Comments
Post a Comment