బ్రిక్స్ సభ్యులతో బంధాలను పటిష్టం చేసుకున్న భారత్
భారతదేశ బహుపాక్షిక సంబంధాలలో నాలుగు దేశాల సమూహం ఉనికిలోకి వచ్చినప్పట్నించి దేశ విదేశాంగ విధానంలో బ్రిక్స్ చాలా ముఖ్యమైన వ్యూహాత్మక స్థలాన్ని ఆక్రమించింది. భౌగోళిక రాజకీయాలు, భౌగోళిక ఆర్థిక శాస్త్రం రూపాంతరం చెందుతున్న తరుణంలో పైకి ఆవిర్భవిస్తున్న బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచం ప్రధానంగా పరిగణించాల్సిన వ్యవస్థలుగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో జరిగిన 11వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్రమోది పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. శిఖరాగ్ర సదస్సుకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోది మాట్లాడుతూ - సదస్సు ప్రాముఖ్యాన్ని ప్రధానంగా ఎత్తి చూపారు. బ్రిక్స్ చట్ర పరిధిలో ఉగ్రవాద నిరోధక సహకారానికి యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని భారత్ - తదితర బ్రిక్స్ దేశాలు చూస్తున్నాయని మోది చెప్పారు.
బ్రిక్స్ వాణిజ్య మండలి నుద్దేశించి భారత ప్రధాని ప్రసంగిస్తూ ఈ దేశాలన్నీ కలిసి ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 50 శాతం వాటా కలిగి ఉన్నాయని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికి బ్రిక్స్ దేశాల వేగవంతమైన ఆర్థికాభివృద్ధి వల్ల లక్షలాది ప్రజలు పేదరికం నుండి బైట పడ్డారు. టెక్నాలజీ - ఆవిష్కరణలలో నూతన పుంతలు సాధించాం.
మా మార్కెట్ పరిమాణం, వైవిధ్యం, మా పరిపూరకాలు పరస్పరం ఎంతో ప్రయోజనకరమైనవని అన్నారు. ప్రపంచ వ్యాపార సోదరభావం నెలకొనాలని విజ్ఞప్తి చేస్తూ ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన పెట్టుబడులకు స్నేహ పూర్వకమైన ఆర్థిక వ్యవస్థ భారత్ లో ఉందని మోది వివరించారు. భారత్ అపరిమితమైన అవకాశాలకు నిలయమని చెప్పి దేశంలో ముఖ్యంగా మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని వ్యాపారవేత్తలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నాటికి పరస్పర పరిపూరకాల ఆధారంగా ఉమ్మడి వెంచర్ల స్థాపనకు కనీసం ఐదు రంగాలను గుర్తించాలని పిలుపునిచ్చారు.
కాగా భౌగోళిక సమస్యాత్మక అంశాలు, పరస్పర ఆసక్తులపై చర్చలు - సంప్రదింపులు జరపడానికి బ్రిక్స్ సదస్సు సభ్య దేశాలకు వేదికను కల్పిస్తుంది. ఈ సందర్భంగా దొరికిన ఇష్టాగోష్టి సమావేశాలను నాయకులు చక్కగా వాడుకున్నారు. ఒకరినొకరు కలుసుకుని ద్వైపాక్షిక, ప్రాంతీయ, బహుముఖ అంశాలపై అభిప్రాయాలు పంచుకునే అవకాశం వారికి చిక్కింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోది - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశమయ్యారు. అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం అద్భుతంగా వుంది. పూర్తి స్థాయి భారత్ - రష్యా సంబంధాలపై మేము సమీక్షించాం. వాణిజ్యం, భద్రత, సంస్కృతి తదితర రంగాలలో సహకారంపై విస్తృత చర్చలు జరిపాం.
ద్వైపాక్షిక సంబంధాలతో ఇరుదేశాల ప్రజలు ముఖ్యంగా ప్రయోజనం పొందుతారు అని మోదీ ట్వీట్ చేసారు. కాగా రష్యా - భారత్ ల మధ్య వాణిజ్యం 17 శాతం వృద్ధిని నమోదు చేసిందని పుతిన్ చెప్పారు. రష్యాలో వచ్చే మేనెలలో జరిగే విక్టరీ డే వేడుకలకు రావాలని పుతిన్, మోదీని ఆహ్వానించారు.
ఇంకా మన ప్రధానమంత్రి చైనా అధ్యక్షుడు గ్జీజిన్ పింగ్ ను కూడా కలుసుకున్నారు. మమల్లాపురంలో రెండవ అనధికార శిఖరాగ్ర సదస్సు అనంతరం నెలరోజుల్లోనే ఇరువురు నాయకులు సమావేశం కావడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా భారత్ - చైనా ద్వైపాక్షిక సంబంధాలను దృఢతరం చేసే విషయమై వారు చర్చించారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం - RCEP లో చేరాలని చైనా గట్టిగా కోరుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాలి. ఇందుకు సంబంధించి చైనా నాయకులు ఎంతో ఆశాభావం వ్యక్తం చేశారు. రెండవ అనధికార సదస్సులో తమకు లభించిన సాదర స్వాగతం పట్ల అధ్యక్షుడు గ్జీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది చైనా ఆతిథ్యం ఇవ్వబోయే 3వ అనధికార శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు. ఇంకా వాణిజ్యం - ఆర్థిక వ్యవస్థపై ఏర్పాటైన ఉన్నత స్థాయి యంత్రాంగం త్వరలోనే సమావేశం కావాలని మోదీ, గ్జీ అనుకున్నారు.
ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధులు మరోసారి కలుసుకుని సరిహద్దు ప్రశ్నకు సంబంధించి అంశాలపై చర్చిస్తే బాగుంటుందని ఉభయనేతలు ఆకాంక్షించారు. అలాగే సరిహద్దుపై శాంతి - ప్రశాంతతల నిర్వహణ ప్రధానమని కూడా వారు పునరుద్ఘాటించారు. బ్రిక్స్, WTO, RCEP వంటి పరస్పర ఆసక్తి గల అంశాలపై కూడా ఇరువురి మధ్య చర్చలు జరిగాయి.
వచ్చే సంవత్సరం జరగనున్న ఇరుదేశాల దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవ వేడుకల సన్నాహాలపై భారత ప్రధానమంత్రి - చైనా అధ్యక్షుడు సమీక్షించారు. దీనివల్ల ప్రజలకు - ప్రజలకు మధ్య సంబంధాలు మరింత పెంపొందుతాయని ఇద్దరు నాయకులు అంగీకరించారు.
ఆంగ్ల రచన : డా.రూప నారాయణ్ దాస్, వ్యూహాత్మక విశ్లేషకులు
Comments
Post a Comment