ముందెన్న‌డు లేని స్థాయికి దిగ‌జారిన పాకిస్తాన్‌

భార‌త్‌కు పూర్తి అంత‌ర్గ‌త విష‌యంపై పాకిస్థాన్ అధ్య‌క్షునితో స‌హా విదేశాంగ మంత్రి వ‌ర‌కు అధికార యంత్రాంగం అనూహ్య‌రీతిలో అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో శ‌తాబ్దాల త‌ర‌బ‌డి అప‌రిష్కృతంగా ఉన్న అయోధ్య భూవివాదంలో ఆ హ‌క్కును రామ‌మందిర నిర్మాణానికి క‌ట్ట‌బెడుతూ 2019 న‌వంబ‌రు 9న 5గురు న్యాయ‌మూర్తుల భార‌త సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఏక‌గ్రీవంగా ఇచ్చిన తీర్పు ఈ వివాదానికి తెర‌దించింది. ఈ తీర్పును స‌మాజంలోని అన్ని వ‌ర్గాలు స్వాగ‌తించాయి. అలాగే మ‌సీదు నిర్మాణం కోసం అయోధ్య‌లోనే ఒక ప్ర‌ముఖ ప్ర‌దేశంలో 5 ఎక‌రాల భూమిని గుర్తించి కేటాయించాల‌ని కూడా ధ‌ర్మాస‌నం కేంద్ర - రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది. ఇంకా వివాదాస్ప‌ద భూమిని ఒక ట్ర‌స్టుకు అప్ప‌గించాల‌నీ ఈ ట్ర‌స్టును కేంద్ర ప్ర‌భుత్వం మూడు నెల‌ల్లోగా ఏర్పాటు చెయ్యాల‌నీ కూడా చెప్పింది.

వివాదంలో ఉన్న అన్ని ప‌క్షాలూ కూడా తీర్పును స్వాగ‌తించాయి. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ తీర్పుపై పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేసారు. అదేరోజు సాయంత్రం జాతి నుద్దేశించి ప్ర‌ధాని మాట్లాడుతూ - భార‌త స‌మాజంలోని ప్ర‌తి వ‌ర్గ‌ము, ప్ర‌తి క‌మ్యూనిటీ, ప్ర‌తి మ‌త ప్ర‌జ‌ల‌తో పాటు దేశం యావ‌త్తు తీర్పును మ‌న‌స్ఫూర్తిగా అంగీక‌రించిన విధానం అనాదిగా ఉన్న భార‌త‌దేశ నైతిక విలువ‌లు, సంస్కృతి-సాంప్ర‌దాయాలు, స్వ‌భావ‌సిద్ధ‌మైన సౌభ్రాతృత్వ స్ఫూర్తి, సామ‌ర‌స్యాల‌ను స్ప‌ష్టంగా ప్ర‌తిబింబిస్తాయ‌ని అన్నారు.

కానీ బెంబేలెత్తిన పాకిస్థాన్ మాత్రం అయోధ్య భూవివాద ఏక‌గ్రీవ తీర్పును జీర్ణించుకోలేక‌పోయింది; నోటికొచ్చిన‌ట్టు అవాంఛ‌నీయ వ్యాఖ్య‌లు చేసింది.

ఈ వ్యాఖ్య‌ల‌ను న్యూఢిల్లీ వెంట‌నే ఘాటుగా ఖండించింది; ఇస్లామాబాదు కుయుక్తుల‌ను తిప్పికొట్టింది. భార‌త విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో - పాకిస్తాన్ అవ‌గాహ‌న లోపం తెలిసిందేన‌నీ ఇందులో ఆశ్చ‌ర్య‌ప‌డ‌వ‌ల‌సిన విష‌యం ఏమీలేద‌నీ పేర్కొంది. భార‌త అంత‌ర్గ‌త విష‌యాల‌పై వ్యాఖ్య‌లు చేసి దేశ ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చు పెట్టాల‌న్న‌ది వారి ధ్యేయ‌మ‌నీ పాకిస్థాన్ కు పుట్టుక‌తో వ‌చ్చిన ఈ పాడు బుద్ధి ఎక్క‌డికి పోతుంద‌నీ ఎండ‌గ‌ట్టింది. పాకిస్తాన్ విదేశాంగ కార్యాల‌యం, విదేశాంగ మంత్రి షామ‌హ‌మూద్ ఖురేషీ చేసిన ప్ర‌క‌ట‌న‌కు భార‌త విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ - భార‌త్‌కు పూర్తి అంత‌ర్గ‌త‌మైన ఒక చ‌ట్ట‌బ‌ద్ధ విష‌యంపై చేసిన ఈ అవాంఛిత వ్యాఖ్య‌ల‌ను గ‌ట్టిగా తిర‌స్క‌రిస్తున్నామ‌ని తెలిపింది. ఇది పాకిస్థాన్ కు ఎట్టి సంబంధ‌మూ లేని విష‌య‌మ‌ని తేల్చిచెప్పింది.

అంతేకాదు, రెండు చారిత్ర‌క స్థ‌లాలైన మ‌న పంజాబులోని గురునాన‌క్ పూర్ జిల్లాలో ఉన్న డేరాబాబా నాన‌క్ ను, పాకిస్థాన్‌లోని న‌రోవాల్ లో ఉన్న క‌ర్తార్‌పూర్ గురుద్వారా ద‌ర్బార్ ను క‌లుపుతూ నిర్మించిన కారిడార్ ను ఆవిష్క‌రించే ప‌విత్ర‌ సంద‌ర్భాన్ని అయోధ్య‌పై సుప్రీంకోర్టు తీర్పు పైన‌, క‌శ్మీరు ప‌రిస్థితి పైన వ్యాఖ్య‌లు చేయ‌టానికి పాకిస్థాన్‌ ఎంచుకోవ‌టం ఎంతో దుర‌దృష్ట‌క‌రం. భార‌త్ వైపున క‌ర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్స‌వంలో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోది మాట్లాడుతూ - పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కు భార‌త్ ప్ర‌జ‌లంటేను, వారి భావోద్వేగాలంటేను ఎంతో గౌర‌వం ఉంద‌ని ప్ర‌శంసించారు.

కానీ పాకిస్తాన్ త‌ర‌ఫున అక్క‌డ జ‌రిగిన కార్య‌క్ర‌మాన్ని పాకిస్థాన్ నాయ‌కులు - క‌శ్మీరు, అయోధ్య అంశాల‌ను కెల‌క‌టానికి వాడుకున్నారు. 2016లో యురి ఆర్మీ క్యాంపుపై జ‌రిగిన ఉగ్ర‌దాడి త‌దుప‌రి భార‌త్ - పాకిస్థాన్ ల మ‌ధ్య సంబంధాలు స్థంభించి గ‌డ్డ‌క‌ట్టుకుపోయాయి. ఆపై జ‌మ్మూ - కాశ్మీరును భార‌త్ లో పూర్తిగా విలీనం చేస్తూ 370వ అధిక‌ర‌ణ ర‌ద్దు అనంత‌రం ఇవి మ‌రింత బెడిసాయి.

ఈ నేప‌థ్యంలో క‌ర్తార్‌పూర్ కారిడార్ తో కొంత చ‌ల్ల‌బ‌డ‌తాయ‌నుకున్న అగ్గికీల‌లు అయోధ్య‌తీర్పుపై అవాంఛ‌నీయ వ్యాఖ్య‌ల వ‌ల్ల ఆ అవ‌కాశాన్ని కోల్పోయి మ‌రింత పైకి ఎగిసాయి.

పాకిస్తాన్ ప్ర‌స్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇమ్రాన్ ఖాన్ అధికారం పెను ముప్పులో ప‌డింది. దేశాన్ని ముందుకు న‌డిపించే స‌త్తా ప‌ట్ల సందిగ్ధం ఏర్ప‌డింది. జ‌మియ‌త్ ఉలేమాలు ఇస్లామ్ అధినేత ఫ‌జ్లుర్ ర‌హ‌మాన్ నాయ‌క‌త్వంలో వేలాది పార్టీ కార్య‌క‌ర్త‌లు ఇస్లామాబాదులో స‌మావేశ‌మై ప్ర‌ధాన‌మంత్రి రాజీనామాను డిమాండు చేసారు. అలాగే ఇత‌ర ప్ర‌తిప‌క్ష పార్టీలు కూడా పాకిస్తాన్ ప్ర‌భుత్వంపై గుర్రుగా వున్నాయి. త‌మ పార్టీని అంత‌మొందించాల‌ని పాకిస్తాన్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోందంటూ మాజీ ప్ర‌ధాన‌మంత్రి న‌వాజ్ ష‌రీఫ్ పార్టీ PML-N, ప్ర‌ధాని కుటుంబ స‌భ్యులు ఆరోపించారు.

దేశ స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్ళించ‌టానికే ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ భార‌త వ్య‌తిరేక వ్యూహాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారేమోన‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఉగ్ర‌వాద ప్రేరేప‌ణ భార‌త అంత‌ర్గ‌త విష‌యాల్లో జోక్యాల‌ను మానుకుంటే త‌ప్ప భార‌త్‌తో సంబంధాలు మెరుగుప‌డ‌బోవ‌ని పాకిస్థాన్ ఇప్ప‌టికైనా అర్థం చేసుకోవాలి.

ఆంగ్ల ర‌చ‌న : ర‌త‌న్ స‌ల్దీ - రాజ‌కీయ విశ్లేష‌కులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన