భార‌త‌-సెర్బియా సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణ‌

భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్ట‌ర్ S.జైశంక‌ర్ సెర్బియా ప‌ర్య‌ట‌న స‌ఫ‌ల‌మైంది. ఈ ప‌ర్య‌ట‌నలో భాగంగా బెల్‌గ్రేడ్ న‌గ‌రంలో సెర్బియా విదేశాంగ మంత్రి ‘ఇవిచా డాచిచ్‌’తో ఆయ‌న సమావేశ‌మ‌య్యారు. అలాగే దేశాధ్య‌క్షుడు ‘అలెగ్జాండ‌ర్ ఉచిచ్’తోపాటు జాతీయ చ‌ట్టస‌భ అధిపతిని కూడా క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా 21వ శ‌తాబ్ద‌పు అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ద్వైపాక్షిక భాగ‌స్వామ్య రూపాంత‌రీక‌ర‌ణ‌పై వారు దృష్టి సారించారు. ఇక రెండు దేశాల మ‌ధ్య ర‌క్ష‌ణరంగ స‌హ‌కార ఒప్పందం డాక్ట‌ర్ జైశంక‌ర్ ప‌ర్య‌ట‌న‌లో కీల‌కమైన‌ది కాగా, భ‌విష్య‌త్ ద్వైపాక్షిక సంబంధాలను ఇది మ‌రింత ప‌టిష్ఠం చేయ‌నుంది. భార‌త‌-సెర్బియా సంబంధాల‌కు చారిత్ర‌క నేప‌థ్యం ఉంది. సెర్బియా పూర్వ‌పు యుగోస్లావియాలో భాగంగా కాగా, భారత్‘తో కలసి అలీనోద్య‌మ కూటమి వ్య‌వ‌స్థాప‌క దేశాల్లో ఒకటిగా ఉంది. ఆ మేరకు పండిట్ నెహ్రూ, జోసెఫ్ టిటోల పేర్ల‌తో ముడిప‌డిన జాతీయ స్ఫూర్తిని ఈ ఉద్య‌మం మ‌రింత ముందుకు నడిపించింది. సెర్బియా మేధోవ‌ర్గంతో స్వామి వివేకానంద‌, ర‌వీంద్ర‌నాథ్ టాగూర్ల అనుబంధం కూడా రెండు దేశాల భాగస్వామ్య చరిత్రను ప్రతిబింబిస్తుంది. అయితే, ప్ర‌చ్ఛ‌న్న యుద్ధశ‌కం ముగిశాక ఈ స్నేహంలోని అసాధార‌ణ సౌహార్ద‌త మ‌రింత ఉత్తేజిత భాగ‌స్వామ్యంగా రూపొందక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. నాటి సంక్లిష్ట వ్యూహాత్మ‌క ప‌రిస్థితుల‌నుంచి బ‌య‌ట‌ప‌డ‌టంపై రెండు దేశాలూ ప్ర‌ధానంగా దృష్టి సారించాల్సి రావడమే ఇందుకు కారణం. దీంతో వాటి విదేశీ విధానాల్లో ప్రాథ‌మ్యాలు తమ స‌మీప, బలమైన పొరుగుదేశాల‌తో సంబంధాలవైపు మ‌ర‌లాయి. ఆ త‌ర్వాత మరో పాతికేళ్ల పాటు ద్వైపాక్షిక సంబంధాల‌లో స్త‌బ్ద‌త కొన‌సాగింది.

ఇటీవ‌ల మెరుగుప‌డుతున్న‌ ద్వైపాక్షిక‌ రాజ‌కీయ సంబంధాల్లో భాగంగా డాక్ట‌ర్ జైశంక‌ర్ సెర్బియా ప‌ర్య‌ట‌న సాగింది. రెండు దేశాల్లో జాతీయ రూపాంత‌రీక‌ర‌ణ వేగంగా సాగుతున్న త‌రుణంలో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను పాత మిత్రుల‌తో స్నేహ‌బంధం పున‌రుద్ధ‌ర‌ణ ప్ర‌య‌త్నంగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. ప్ర‌పంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌లో ఒక‌టిగా అవ‌త‌రించిన భార‌త్- నేడు అంత‌ర్జాతీయ ప‌రిణామాలను ప్ర‌భావితం చేసే ప్ర‌య‌త్నంలో ఉంది. అదేవిధంగా యుగోస్లావియా విభ‌జ‌న‌, కొసావో వేర్పాటు ప్రకటన నేపథ్యంలో సెర్బియా కూడా అంత‌ర్గ‌త అల‌జ‌డుల నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లే క‌నిపిస్తోంది. ఐరోపా ఖండంలో మంద‌గ‌మ‌నం నడుమ అద్భుత వృద్ధి న‌మోదు చేసిన సెర్బియా- 2025నాటికి ఐరోపా సమాఖ్య‌లో చేరేదిశ‌గా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ ఒడుదొడుకుల‌ను అధిగ‌మించే ప్ర‌య‌త్నాల్లో ఉన్న న‌వ భార‌తం, న‌వ సెర్బియాల మ‌ధ్య ప్ర‌యోజ‌న సాన్నిహిత్యం పెరుగుతుండ‌టాన్ని నేడు గ‌మ‌నించ‌వ‌చ్చు.

ప్రస్తుత 21వ శ‌తాబ్దానికి మూల‌స్తంభమైన ప్ర‌పంచీక‌ర‌ణ ఇవాళ విప‌రీత ప్ర‌తికూల‌త‌ను ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ర‌క్ష‌ణాత్మ‌క ధోర‌ణి, ష‌ర‌తుల‌తో కూడిన మూల‌ధ‌న ప్ర‌వాహం, కొత్త సాంకేతికత కుదుపులు... వంటివ‌న్నీ క‌ల‌గ‌ల‌సి అంత‌ర్జాతీయ వ్యూహాత్మ‌క ప‌ర్యావ‌ర‌ణాన్ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి. సంప్ర‌దాయ‌, సంప్ర‌దాయేత‌ర భ‌ద్ర‌త ముప్పులు భారీస్థాయిలో పెరిగాయి. పాత వ్యూహాత్మ‌క స‌మ‌తౌల్యం విచ్ఛిన్న‌మ‌వుతుండ‌గా అధికారంలో స‌రికొత్త శ‌క్తి స‌మ‌తూకం ఇంకా ఆవిర్భ‌వించ‌లేదు. భార‌త్‌, సెర్బియా త‌మ బ‌లాల‌ను సంఘ‌టితం చేస్తే ఇలాంటి స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌డానికి అది తోడ్ప‌డుతుంది. ‘‘వ‌సుధైవ కుటుంబ‌కం’’ అంటే- ప్ర‌పంచ‌మంతా ఒకే కుటుంబం. ‘‘విశ్వ‌బంధుత్వం’’ అంటే- ప్ర‌పంచ సౌభ్రాత్రం... ఇవి రెండూ భార‌త జీవ‌న సంప్ర‌దాయాలు. రెండు దేశాల సంయుక్త విధానాలు ఈ భార‌తీయ జీవ‌న విలువ‌ల‌తో మ‌మేకం కాగ‌ల‌వు. త‌ద్వారా అంద‌రితోనూ చేయిక‌లిపి, స‌హ‌కార‌స్ఫూర్తితో అంత‌ర్జాతీయ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌న్న భార‌త ఆకాంక్ష‌ను ఇవి ప్ర‌తిబింబిస్తాయి.

ప్రధాన వ్యూహాత్మక సమస్యలపై మద్దతులో భారత-సెర్బియాల ప‌ర‌స్ప‌ర వ్యూహాత్మ‌క స‌హానుభూతి- ద్వైపాక్షిక భాగ‌స్వామ్యానికి గీటురాయిగా నిలుస్తోంది. జ‌మ్ముక‌శ్మీర్ విష‌యంలో స‌ద‌రు అంశం భార‌తదేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హార‌మ‌ని సెర్బియా ప్ర‌క‌టించింది. అదేవిధంగా కొసావో ఏక‌ప‌క్షంగా స్వ‌తంత్రం ప్ర‌క‌టించుకోవ‌డంపై భార‌త్ కూడా సెర్బియాకు మ‌ద్ద‌తుగా నిలిచింది. అణుస‌ర‌ఫ‌రా దేశాల కూట‌మితోపాటు ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌త మండ‌లి విస్త‌ర‌ణలో శాశ్వ‌త స‌భ్య‌త్వంపై భార‌త్ డిమాండ్ స‌హా వివిధ అంశాల్లో బ‌హుళ వేదిక‌ల‌పై రెండు దేశాలూ ప‌ర‌స్ప‌రం బాసటగా నిలిచాయి.

ఆగ్నేయాసియా, మ‌ధ్యాసియాలను క‌లిపే సెర్బియా భౌగోళిక వ్యూహాత్మక స్థానం భారతదేశానికి ఎంతో ప్రధానమైనది. ఆ మేరకు తూర్పు ఐరోపా, బాల్క‌న్ దేశాల‌కు ముఖద్వారంలా సెర్బియా ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతంలో అది స‌మాచార కూడ‌లి కావటంతోపాటు ఐరోపా స‌మాఖ్య‌స‌హా ర‌ష్యా, ట‌ర్కీ దేశాల‌తో సెర్బియాకు అనుకూల వాణిజ్య ఒప్పందాలున్నాయి. భారత-సెర్బియాల మధ్య ప‌ర‌స్ప‌ర సానుకూల అంశాలు చాలా ఉన్న‌ప్ప‌టికీ ద్వైపాక్షిక వాణిజ్యంలో 200 మిలియ‌న్ డాల‌ర్లదాకా లోటు ఒక బ‌ల‌హీన బంధంగా నిలుస్తోంది. ప్రాంతీయ స‌మ‌గ్ర ఆర్థిక భాగ‌స్వామ్యం సంప్ర‌దింపుల నుంచి వైదొల‌గిన నేప‌థ్యంలో కొత్త వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబ‌డి వ‌న‌రుల కోసం అన్వేష‌ణ భార‌త్‌కు త‌ప్ప‌నిస‌రి. అందువల్ల రెండు దేశాల మ‌ధ్య ఆర్థిక భాగ‌స్వామ్యం బ‌లోపేతం కావ‌డంలో ఆయుర్వేద‌, యోగా, ర‌క్ష‌ణ‌, ప‌ర్యాట‌క రంగాలుస‌హా ఔష‌ధ‌, వ్య‌వ‌సాయ‌, స‌మాచార సాంకేతిక‌, ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగాలు కీల‌క పాత్ర పోషించ‌గ‌ల‌వు. ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌క‌టించే వాణిజ్య సౌల‌భ్య ర్యాంకుల‌లో రెండు దేశాల స్థానం మెరుగుప‌డటంతోపాటు వీసా నిబంధ‌న‌లో ద్వైపాక్షిక స‌డ‌లింపు వంటివి భార‌త‌-సెర్బియా కంపెనీల రూపాంత‌రీక‌ర‌ణ‌లో స‌మ‌న్వ‌యానికి తోడ్ప‌డ‌గ‌ల‌వు. ఈ భాగ‌స్వామ్య సామ‌ర్థ్యం అపార‌మైన‌దే అయినా, ఇదే వేగాన్ని కొన‌సాగిస్తూ ప్ర‌స్తుత రాజ‌కీయ సౌహార్ద‌త‌ను ఉత్తేజ‌క‌ర వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యంగా మ‌ల‌చుకోవ‌డ‌మే భార‌త్ ముందున్న స‌వాలు.

రచన: రాజ‌ర్షి రాయ్‌, ప‌రిశోధ‌క విశ్లేష‌కులు, ఐడీఎస్ఏ

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన