అమెరికాతో త్రివిధ దళాల సంయుక్త సైనిక విన్యాసాలు - 2019
అమెరికాతో భౌగోళిక వ్యూహాత్మక నిర్మాణం అనేది మోదీ రెండవ పదవీకాలంలో కీలక ప్రాధామ్యాలలో ఒకటిగా ఉంది. ఇటీవలి సంవత్సరాలలో ఆర్థిక పరివర్తనలోను, ప్రపంచ వేదిక మీద మరింత పెద్దగా వ్యవహరించాలన్న ఆకాంక్షను సాధించటంలోను భారత్‌కు అనివార్య భాగస్వామిగా ఆవిర్భవించినందున అమెరికాకు ఈ ప్రాధాన్యం ఏర్పడింది. ఈమధ్య కాలంలో ఆవిష్కృతమైన రక్షణ భాగస్వామ్యం అనే కొత్త కోణం ద్వైపాక్షిక సంబంధాలకు అండదండగా నిలుస్తోంది.
ఈ నేపథ్యంలో భారత్ - అమెరికా దేశాలు తమ తొలి త్రివిధ దళాల విన్యాసాలను ఆంధ్రప్రదేశ్ లోని సముద్ర ప్రాంతంలో నవంబరు 13-21 తేదీల మధ్య నిర్వహిస్తున్నాయి. టైగర్ ఘన విజయం పేరిట ఈ హ్యుమనిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిసాస్టర్ రిలీఫ్ (HADR) విన్యాసాలు జరుగుతున్నాయి.
అమెరికా మెరైన్ కార్ప్స్ - వైరి రహస్య పరిశోధన ప్రత్యేక దళాల బృందం, భారత నౌకాదళంలో సముద్ర ప్రాంత వైరిరహస్య పరిశోధనకు, జలాంతర్గాములకు వ్యతిరేకంగా వాడే దీర్ఘశ్రేణి P8i యుద్ధ విమానం కూడా ఈ టైగర్ ఘన విజయ విన్యాసంలో పాల్గొంటున్నాయి. ఈ విన్యాసాలు మొదటి విడత విశాఖపట్నం రేవులో నవంబరు 13 నుంచి 16 వరకు రెండో విడత కాకినాడలో నవంబరు 17 నుంచి 21 వరకు జరుగుతాయి. భారత సైన్యంలోని సిగ్నల్, వైద్య, కమ్యూనికేషన్ ఆయుధాలకు చెందిన దాదాపు 400 బృందాలు ఈ విన్యాసంలో పాలుపంచుకుంటున్నాయి. కాగా గతంలో ఒక్క రష్యాతో మాత్రమే భారత్ ఇటువంటి విన్యాసాలను నిర్వహించింది.
భారత - అమెరికా విదేశాంగ - రక్షణ మంత్రుల మధ్య 2018 సెప్టెంబరులో జరిగిన 2+2 ఆరంభ సంభాషణలలో ఈ త్రివిధ దళాల విన్యాసానికి సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మిలిటరీల నడుమ వేగంగా పెరుగుతున్న సంబంధాలను గుర్తిస్తూ కొత్తగా త్రివిధ దళాల విన్యాసాన్ని ఏర్పాటు చెయ్యాలని, ఇరు సైనిక, రక్షణ సంస్థల సిబ్బంది మధ్య పరస్పర అభిప్రాయ మార్పిడిని మరింత పెంచాలని నిర్ణయించారు.
ఈ ఏడాది సెప్టెంబరులో ప్రధానమంత్రి మోదీ అమెరికా సందర్శన సందర్భంగా జరిగిన హౌడి - మోడీ కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ ఈ విన్యాసాల ప్రకటన చేసారు. సుస్థిర ఇండో -పసిఫిక్ ప్రాంతంపై రండు దేశాల అభిప్రాయాలు ఒక్కటిగా ఉన్నాయి. అలాగే రాజకీయంగా కూడా ఏకీభావం నానాటికీ పెరుగుతోంది. ఈ కారణంగా ఉభయ దేశాలు అమలుకు అనువైన రెండు ఒప్పందాలపై సంతకాలు చేసాయి. అందులో ఒకటి లాగిస్టిక్స్ ఎక్స్‌ఛేంజ్ మెమొరాండంపై ఒప్పందం (LEMOA) - కాగా రెండవది కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ (CCSA)ఇక ఇప్పుడు ఇరువురు కూడా ఇదేవిధమైన 3వ ఒప్పందం బేసిక్ ఎక్స్‌ఛేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంటు (BECA)పై చర్చలు జరుపుతున్నారు. అంతరిక్షం నుండి భూచిత్రాలను తీసే జియోస్పేషియల్ మ్యాపుల ఉమ్మడి లభ్యతకు సంబంధించి ఈ ఒప్పందం ఉంటుంది. భారత్ - అమెరికాలు రెండు కలిసి ఒక ఏడాదిలో పరస్పర సేవల సహకారంతో 50కి పైగా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఇంకా రెండు దేశాలు ప్రతి ఏటా పలు యుద్ధ విన్యాసాలు చేపడతాయి.
ఇందులో భాగంగా ఇరు సైన్యాల మధ్య ఉగ్రవాదంపై పోరుకు వజ్ర ప్రహార్ - యుద్ధ అభ్యాస్ కసరత్తులు చేపడతారు. వీటివల్ల రెండు దేశాల దళాలు పెద్ద ఎత్తున వివిధ రకాలైన విన్యాసాలను రిహార్స్ చేసి పరస్పరం పనిచేసే తీరును అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న భారత్ - అమెరికా విన్యాసాల సందర్భంగా యుద్ధ పరిస్థితులలో కలిసి పనిచేసే సమయాలలో అమెరికా దళాల పనితీరును భారత్ నేర్చుకుంటుంది. అలాగే రానున్న కాలంలో ఇరుదళాల సంయుక్త సన్నద్ధతను ఈ విన్యాసాలు పెంపొందిస్తాయి. అంతేకాదు భారత్ - అమెరికా రక్షణ బంధాలు మరింత లోతుగా బలోపేతమవుతాయి.
ప్రస్తుతం భారత్ దేశ సరిహద్దుల నుండి సముద్ర ప్రాంత వాతావరణం నుంచి వస్తున్న ముప్పులను సమర్ధంగా ఎదుర్కొనడానికి తన రక్షణ సామర్ధ్యాలను త్వరిత గతిన నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు అధునాతన టెక్నాలజీ పరికరాలు అవసరం. భారత్ లో తయారీ కార్యక్రమం కింద రక్షణ పరికరాల తయారీ చేపట్టాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. అందుచేత రక్షణ పరిశోధన అభివృద్ధిలో అగ్రగామిగా వున్న అమెరికాతో భాగస్వామ్యం ఎంతగానో తోడ్పడుతుంది. అమెరికాకు భారత్ కూడా అలాంటిదే. ఇండో పసిఫిక్ ప్రాంతంలో వస్తున్న సవాళ్ళ పరిష్కారంలో భారత్ శక్తివంతమైన భాగస్వామిగా ఉంటుంది. భారత్ లోని రక్షణ మార్కెట్ వారికి మరో ఆకర్షణ.
ఇంకా మరింత రక్షణ భాగస్వామ్యాలు, శక్తి సామర్ధ్య కార్యక్రమాలు, సాయుధ దళాల పరస్పర సహకారాల విషయంలో భారత్ తో సంబంధాలు కావాలని అమెరికా కోరుకుంటోంది. రెండు దేశాలు ఇప్పుడు 2012 నాటి భారత్ - అమెరికా రక్షణ టెక్నాలజీ - వాణిజ్య కార్యక్రమానికి సవరణలు చేసి రంగులు దిద్దే ప్ర్రక్రియలో పడ్డాయి. దీనికింద తృతీయ దేశాల్లో అంకుర పరిశ్రమలు, ప్రాజెక్టుల ద్వారా ఎగుమతి అవకాశాలను అన్వేషించాలని ఆశిస్తున్నాయి. తత్ఫలితంగా పరిశ్రమకు - పరిశ్రమకు మధ్య మరింత అవగాహన, సాన్నిహిత్యం ఏర్పడి పరిశోధన - అభివృద్ధి వృద్ధి చెందుతాయి. ఇక ఇప్పుడు 2018లో 2+2 మంత్రిత్వ సమావేశానంతరం రక్షణ-భద్రత-విదేశీ విధానరంగాలలో పరస్పర ద్వైపాక్షిక పురోగతి సమీక్షపై ప్రధానంగా దృష్టి పెట్టారు.
ఆంగ్ల రచన : డా.స్తుతి బెనర్జి, అమెరికా వ్యవహారాలపై వ్యూహాత్మక విశ్లేషకులు
Comments
Post a Comment