బ్రెసీలియాలో జ‌రిగిన 11వ బ్రిక్స్ శిఖ‌రాగ్ర స‌ద‌స్సు

బ్రెసిలియాలో విజ‌య‌వంతంగా ముగిసిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర స‌ద‌స్సు వాటి క్రియాశీల‌త‌కు నానాటికి పెరుగుతున్న వాటి ప్రాముఖ్యానికి కొల‌బ‌ద్ద‌గా నిలుస్తుంది. గ‌డ‌చిన ద‌శాబ్ద కాలంలో బ్రిక్స్ దేశాలు భౌగోళిక వృద్ధికి ప్ర‌ధాన చోద‌కులుగా ప‌నిచేసాయ‌ని సంయుక్త ప్ర‌క‌ట‌న పేర్కొంది. అస‌లు బ్రిక్స్ ఆవిర్భావ‌మే కొత్త‌గా ఉద్భ‌విస్తున్న భౌగోళిక ఆర్థిక క్ర‌మంలోని మారుతున్న ధోర‌ణుల‌కు అద్దం ప‌డుతుంది. ప్ర‌పంచంపై ప‌శ్చిమ దేశాల పెత్త‌నాన్ని ప్ర‌శ్నించ‌ట‌మే కాదు, ఆలోచ‌నా స‌ర‌ళిని, ప్ర‌పంచ దృష్టి కోణాన్ని నూత‌నంగా మ‌ల‌చేందుకు బ్రిక్స్ య‌త్నిస్తోంది. ఆవిష్క‌ర‌ణల‌తో కూడిన భ‌విత‌కై ఆర్థిక వృద్ధి - అనేది 11వ బ్రిక్స్ శిఖ‌ర స‌భ ఇతివృత్తం. నిజంగా ఆవిష్క‌ర‌ణ‌లే భ‌విత‌కు ఆహ్వాన ప‌త్రిక‌లు. కొత్త ఆవిష్క‌ర‌ణ లేనిదే అంధ‌కారంలో మునిగిన‌ట్టే.

బ్రిక్స్ నాయ‌కులు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న అంద‌రు అనుకున్న‌ట్టు గానే ఉంది. యునైటెడ్ నేష‌న్స్ - UN తోపాటు WTO - IMF స‌హా ఇత‌ర బ‌హుళ స‌మాంత‌ర సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేయాల‌ని పిలుపునిచ్చింది. వాటిలో సంస్క‌ర‌ణ‌లు చేయాల్సిన అవ‌స‌రం వుంద‌ని చెప్పింది. ఈ అంశంపై అంత‌ర్జాతీయ వ‌ర్గాల నుండి తీవ్ర విమ‌ర్శ‌లు కురుస్తూండ‌గా, బ్రిక్స్ దేశాలు చూపుతున్న మొక్క‌వోని నిబ‌ద్ధ‌త అసాధార‌ణంగా ఉంది. బ్రెట్ట‌న్ ఉడ్స్ - భావం కింద ఏర్పాటైన ఈ బ‌హుళ సంస్థ‌లు ఆశించిన స్థాయికి నిల‌వ‌లేద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఈ సంస్థ‌ల‌కు ఆద్యులైన వారే ఈనాడు వాటిపై దాడి చేయ‌డం మ‌రీ విడ్డూరం. మార్కెట్ వ‌ర్ధ‌మానానికి ప్ర‌పంచీక‌ర‌ణ‌ను విధిగా చేప‌ట్టాల‌ని ప్ర‌పంచ ద‌క్షిణ ప్రాంతాన్ని ఒత్తిడి చేసి ఇంకా ఎంతోకాలం కాక మునుపే క్ర‌మంగా గాడిలో ప‌డుతున్న వ‌ర్ధ‌మాన‌దేశాల‌ను ప్ర‌పంచీక‌ర‌ణ వ‌ద్దంటూ గ‌గ్గోలు మొద‌లైంది.

ఇక బ్రిక్స్ కొత్త‌గా చెప్పే ఈ సంస్థ‌ల విష‌యానికి వ‌స్తే ఈ ఏర్పాటు క‌ల‌సిపంచుకునే అభివృద్ధిగా గోచ‌రిస్తుంది. శాంతిభ్ర‌ద‌త‌లు, సుస్థిరాభివృద్ధి నిర్వ‌హ‌ణ‌తో పాటు మాన‌వ‌హ‌క్కులు, అంద‌రికీ మౌలిక స్వేచ్ఛ‌ల క‌ల్ప‌న‌, ప‌రిర‌క్ష‌ణ జ‌రిగేలా చూడ‌ట‌మే ధ్యేయంగా బ‌హుళ‌ముఖ సంస్థ‌ల‌కు సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో ప్రాధాన్యం క‌ల్పించారు.

గ‌త కొద్ది ఏళ్ల‌లో ఉగ్ర‌వాద పాత‌కానికి వ్య‌తిరేకంగా ప్ర‌పంచ దేశాల ఏకాభిప్రాయ నిర్మాణానికి భార‌త్ అలుపెరుగ‌ని కృషి చేసింది. భార‌త్‌, ర‌ష్యా, చైనా వంటి దేశాలు ఉగ్ర‌వాదానికి బ‌లిప‌శువులు కాగా స‌భ్య దేశాలేకాక‌, ఏ మూల‌నైనా ఎట్టి రూపంలోనైనా టెర్ర‌రిజం ఉండ‌రాద‌ని ఎలుగెత్తి చెప్ప‌టంలో కృత‌కృత్య‌మైంది.

ఫ్లీన‌రీ స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోది ప్ర‌సంగిస్తూ - ఉగ్ర‌వాదాన్ని తిరుగులేని విధంగా ఖండించారు. అభివృద్ధి, శాంతి సౌభాగ్యాల‌కు టెర్ర‌రిజం పెనుముప్పుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఉగ్ర‌వాదం వ‌ల్ల ప్ర‌పంచ అర్థ వ్య‌వ‌స్థ‌కు ట్రిలియ‌న్ అమెరికా డాల‌ర్ల మేర న‌ష్టం వాటిల్లింద‌నీ వ‌ర్థ‌మాన దేశాల‌లో ఆర్థిక వృద్ధి 1.5 శాతం మేర దిగ‌జారింద‌ని అన్నారు.

బ్రిక్స్ దేశాల మ‌ధ్య వాణిజ్యం వృద్ధి చెందాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను నొక్కి చెప్తూ ప్ర‌స్తుతం ప్ర‌పంచ వాణిజ్యంలో ఇది కేవ‌లం 15 శాతంగా ఉన్న‌ద‌ని మోదీ చెప్పారు. బ్రిక్స్ వాణిజ్య ఫోరం స‌మావేశాన్ని సంయుక్త ప్ర‌క‌ట‌న స్వాగ‌తించింది. ఆర్థిక‌, వాణిజ్య వృద్ధిని పెంపొందించ‌టంలో స‌మావేశం ఎంతో కీల‌క‌మ‌ని పేర్కొంది. ప్ర‌స్తుత తీవ్ర వాతావ‌ర‌ణ సంక్షోభ త‌రుణంలో సుస్థిరాభివృద్ధికై 2030 అజెండా అమ‌లుకు క‌ట్టుబ‌డి వున్న‌ట్టు బ్రిక్స్ పున‌రుద్ఘాటించింది. వాతావ‌ర‌ణ మార్పు స‌ద‌స్సులో యుఎన్ ఫ్రేమ్‌వ‌ర్కు నిబంధ‌న‌ల కింద ఆమోదించిన ప్యారిస్ ఒప్పందం అమ‌లును కూడా బ్రిక్స్ స‌మ‌ర్ధించింది.

బ్రిక్స్ శిఖ‌రాగ్ర స‌ద‌స్సు సంద‌ర్భంగా భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ - బ్రెజిల్‌, ర‌ష్యా, చైనా అధ్య‌క్షుల‌తో జ‌రిపిన ద్వైపాక్షిక స‌మావేశాలు ఫ‌ల‌వంతంగా ముగిసాయి. వ‌చ్చే ఏడాది గ‌ణ‌తంత్ర ఉత్స‌వాల‌కు ముఖ్య అతిథిగా హాజ‌రు కావాల‌న్న భార‌త్ ఆహ్వానాన్ని జైర్ బొల్సొనారో అంగీక‌రించ‌టం శుభ ప‌రిణామం. దీనివ‌ల్ల లాటిన్ అమెరికాతో భార‌త్ సంబంధాలు మ‌రింత దృఢం కాగ‌ల‌వు.

న్యూ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకు - ఎన్‌డిబి కి కొత్త ఊత‌మిచ్చేందుకు బ్రిక్స్ దేశాల సుస్థిర చ‌ర్య‌లు ప్ర‌పంచ వ్యాప్త ప్ర‌శంస‌లు పొందాయి. స‌భ్య‌త్వ విస్త‌ర‌ణ‌లో ఎన్‌డిబి చూపిన ప్ర‌గ‌తి ప‌ట్ల బ్రిక్స్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. స‌భ్య దేశాల‌లో శాఖ‌లు తెర‌వాల‌న్న ఎన్‌డిబి నిర్ణ‌యాన్ని స్వాగ‌తించింది. ఈ సంద‌ర్భంగా ఇన్నొవేష‌న్ బ్రిక్స్ నెట్‌వ‌ర్కుతో పాటు కొత్త‌గా శాస్త్ర, సాంకేతిక‌, ఆవిష్క‌ర‌ణ‌ల ఆర్కిటెక్చ‌ర్ ఏర్పాటు వ‌ల్ల బ్రిక్స్‌కు మ‌రింత ప్రాధాన్యం, చ‌ట్ట‌బ‌ద్ధ‌త ల‌భించిన‌ట్ట‌యింది.

చురుకైన ఏ సంస్థ‌లైనా, గ్రూపులైనా ఊహ‌ల‌తో స‌రిపెట్ట‌క నిరంత‌రం ఆచ‌ర‌ణ‌లో పెట్టి చూపాలి. అంద‌రి శ్రేయ‌స్సును కాంక్షించే ఆర్థిక వ్య‌వ‌స్థ‌కై బ్రిక్స్ నిబ‌ద్ధ‌తతో ప‌ని చేయాలి. స‌మాజం మెడ‌లువంచే ఆర్థిక వ్య‌వ‌స్థ‌కై కాక స‌మాజ శ్రేయ‌స్సుకు త‌గిన ఆర్థిక వ్య‌వ‌స్థ కోసం బ్రిక్స్ ప‌ని చేయాలి. 

ఆంగ్ల ర‌చ‌న : డా.య‌శ్ నారాయ‌ణ్‌రాయ్‌, సోష‌ల్ సైన్సెస్ సంస్థ డైరెక్ట‌ర్‌

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన