RCEP సంప్రదింపులపై కృతనిశ్చయంతో ఉన్న భారత్
నవంబరు 2 నుంచి 4వ తేదీ వరకు జరిగే తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు ఆసియాన్ తో పాటు ఇతర సంబంధిత సమావేశాలకు ముందుగానే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం – RCEP ఖరారుపై సంప్రదింపులు ముగుస్తాయని భావిస్తున్నారు. తద్వారా 2020లో ఈ వ్యవహారంపై లాంఛనంగా సంతకాలకు మార్గం ఏర్పడుతుంది. వచ్చే నెల మొదట్లో జరుగనున్న తూర్పు ఆసియా శిఖరాగ్ర సభలో, ఇతర సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోది పాల్గొంటారు. అజెండాలో RCEP సమావేశం ప్రధానంగా ఉంటుంది. నవంబరు 2012లో ఆరంభమైన RCEP సంప్రదింపులలో సంభాషణల భాగస్వాములైన ఆరు దేశాలు పాల్గొంటాయి. ఆగ్నేయాసియా దేశాల (ఆసియాన్) సంఘంలో భారత్, జపాను, దక్షిణ కొరియా, న్యూజిలాండు, ఆస్ట్రేలియా, చైనా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. గడచిన 7 ఏళ్లలో ఆసియాన్ ఆధ్వర్యంలో నడచిన బహుముఖ సంప్రదింపులలో ప్రధానమైన ఆసియా ఆర్థిక వ్యవస్థలు పాల్గొన్నాయి.
ఈ భారీ ప్రాంతీయ వాణిజ్య బ్లాకు తాజా సమావేశం బ్యాంకాకులో ఈ వారమే ముగిసింది. సంప్రదిపులకు సంబంధించి 80 శాతానికి పైగా ఒప్పందాలు పూర్తయినాయి. మొత్తం 225 ఒప్పందాలకు గాను 185 ఒప్పందాలను సంప్రదింపుల ద్వారా దేశాలు ఆమోదించినట్టు తెలుస్తోంది. కీలక అంశాలైన వస్తువులు, సేవలు, పెట్టుబడులలో ఒక అంశం ప్రత్యేకించి ప్రతి ఒప్పందంలోను ఉంటుంది.
ఆసియాన్ సభ్యులతో పాటు భారత్ సహా దాని భాగస్వామ్య దేశాలు పాల్గొనే ప్రాంతీయ ఆర్థిక సంభాషణలలో RCEP ప్రధానమైనదిగా ఆవిర్భవించింది. RCEP సంభాషణలలో పాలుపంచుకోవటాన్ని భారత్ యాక్ట్ ఈస్ట్ విధానానికి ముఖ్యాంశంగా భావిస్తున్నారు. ఒకసారి ఖరారైన పక్షంలో RCEP వల్ల భాగస్వామ్య దేశాలకు మరింత సాఫీగా ఆటంకాలులేని వాణిజ్యం చేసుకునే వీలు ఏర్పడుతుంది. అంతర ప్రాంతీయ వాణిజ్య బంధాలలో ముందస్తు అవగాహనతో పాటు సుస్థిరత నెలకొంటుంది.
అయితే RCEP చర్చలు సంతృప్తకరంగా ముగియటం అంత తేలికైన విషయం కాదు అందులో అనేక సున్నితమైన అంశాలు ఉన్నాయి. మార్కెట్ లభ్యత, రక్షిత వస్తువులు అనే రెండు అంశాలపై సభ్య దేశాల మధ్య అంగీకారం కుదరటం కష్టం. అందుచేతనే RCEP సంభాషణలను ఖరారు చేసేలోపు ఎనిమిది ప్రధానంశాలపై మంత్రిత్వ స్థాయి చర్చలు జరగాల్సి ఉంది. భారత్ కు తీవ్ర ఆందోళన కలిగించే అంశాలు 3. అవి వివాద పరిష్కార విధానాలు, ఈ-వాణిజ్యం, ప్రాథమిక నిబంధనలు.
బ్యాంకాకులో జరిగిన మంత్రుల స్థాయి సమావేశంలో భారత్ తరఫున వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. అయితే సమావేశం అసంపూర్తిగా ముగిసింది; ముఖ్యమైన అంశాల పరిష్కారం జరగలేదు. RCEP చర్చల సమావేశానికి సంబంధించి సంయుక్త ప్రకటన సారాంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు.
కాగా పరస్పర ఆమోద యోగ్యమైన పరిష్కారానికై భారత్ ఇతర పక్షాలతో సంప్రదింపులు జరుపుతోంది. సక్రమమైన, కేవలం నిబంధనల ఆధారిత ప్రాంతీయ వాణిజ్య ఏర్పాటు కావాలని భారత్ మనస్ఫూర్తిగా కోరుకుంటోందని దీనివల్ల స్పస్టమవుతుంది. ఇంకా చెప్పాలంటే భారత మార్కెటులో చైనా వంటి దేశాలు పొందుతున్న ఆటంకాలు లేని లభ్యత ఇతర దేశాలలో తనకు కూడా ఉండాలని భారత్ పట్టుదలతో ఉంది. మరో వంక RCEP సంభాషణలు సత్వరమే ఒక కొలిక్కి రావాలని చైనా పట్టుబడుతోంది. ఇండియా వంటి మార్కెట్లలో మరింత తేలిగ్గా ప్రవేశం కలిగి ప్రస్తుతం అమెరికాతో జరుగుతున్న వాణిజ్య పోరులో ఊరట లభిస్తుందని చైనా తొందరపడుతోంది.
ఇంతవరకు కొన్ని రంగాలలో విధించిన దిగుమతి ఆంక్షల కారణంగా చైనాలోని నష్టం పొందే రంగాలకు రక్షణ లభిస్తుండగా RCEP అమల్లోకి వచ్చాక పరిస్థితి తారుమారు కావచ్చు. పైగా భారత్ 50 బిలియన్ అమెరికా డాలర్లను మించి చైనాతో వాణిజ్యలోటును ఎదుర్కొంటోంది. భారత్ వ్యక్తం చేసే ఫిర్యాదుల పరిష్కారానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చెయ్యాలను బీజింగు ప్రతిపాదించింది. భారత్ లో గ్రామీణ ప్రజలతో నేరుగా అనుబంధం గల పశు సంవర్ధకం వంటి ఉపరంగాలు ఆస్ట్రేలియా – న్యూజిలాండు వంటి దేశాలలో ఈ రంగంలోని అత్యంత సమర్ధమైన పరిశ్రమల వల్ల బాగా దెబ్బతింటాయి. ఈ విధమైన సవాళ్ళను గట్టిగా ఎదుర్కొనేందుకుగాను ఇట్టి దేశాల నుండి దిగుమతులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడకుండా నిరోధించేందుకు తగిన నిబంధనలు ఉండాలని భారత్ ఎలుగెత్తి చెప్తోంది.
ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ ప్రతిపాదించిన రక్షణ యంత్రాంగాలను ఒప్పందాలలో చేర్చిన పక్షంలో RCEP లో జేరేందుకు భారత్ సుముఖంగా ఉంది. సమాజంలోని బలహీన వర్గాలే కాక సన్నకారురైతులు, మధ్య – చిన్న తరహా ఔత్సాహిక పరిశ్రమలు వంటి ఆర్థిక వ్యవస్థలోని బడుగురంగాలు కూలబడకుండా ఈ చర్యలు అవసరమని భారత్ పట్టుపడుతోంది. ఎటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒడంబడికను అమలు చేసేందుకు ముందు దేశీయమైన ప్రతి పరిశ్రమ, భారత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించి తీరాలనేది ప్రభుత్వ లక్ష్యమని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. సర్వీసులలోగాని, పెట్టుబడుల విషయంలో గానీ అన్ని విధాలా జాతీయ ప్రయోజనాల పరిరక్షణను విస్మరించే ప్రసక్తి లేదని మంత్రి స్పష్టం చేశారు.
తన దేశ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ, ప్రాంతీయ, బహుళపక్ష వాణిజ్యం – ఆర్థిక సహకార ఏర్పాట్ల మధ్య మంచి సమతౌల్యం ఉండేలా భారత్ స్థిరంగా జాగరూకతతో వ్యవహరిస్తుంది.
రచన : రాహుల్ మిశ్రా తూర్పు – ఆగ్నేయాసియాపై వ్యూహాత్మక విశ్లేషకులు
Comments
Post a Comment