లావాదేవీల స్థాయిని అధిగమించిన న్యూఢిల్లీ రియాద్ సంబంధాలు




ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారంలో జరిపిన సౌదీ అరేబియా పర్యటన, రియాద్ పై, ఆ దేశ సమర్థవంతమైన ప్రయోజనాలపై, భారత విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులను ప్రస్ఫుటంగా తెలియజేస్తోంది .సాంప్రదాయంగా ఈ సంబంధాలు హజ్ యాత్ర, ఇంధన దిగుమతుల ఆధారంగా ఉంటుండేవి .అయితే ఈ లావాదేవీల స్థాయిని అధిగమించి రూపాంతరం చేసేలా ఇటీవల కాలంలో ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి

మూడవ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్, ఎఫ్ ఐ ఐ, లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన కీలక ఉపన్యాసం ఈ దిశలో కీలకమైనది .సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు .దావోస్ ఇన్ ద డిజర్ట్ గా కూడా వ్యవహరించే ఈ ఎఫ్ఐఐ, ఆ దేశంలో ఇంధనేతర రంగాల లో పెట్టుబడులకు, ఆర్థికపరమైన అవకాశాలను తెలియజేసే వేదికగా ఉంది. సాంప్రదాయేతర ఇంధనం, పర్యాటకం, వినోదం తదితరాల వలన, ఇంధన రంగంపై సౌదీ ఆధారపడటం తగ్గుతుంది. రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారత అర్ధ వ్యవస్థ అయిదు ట్రిలియన్ల అమెరికా డాలర్లకు రూపాంతరం చేయాలన్న ప్రధానమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా క్రౌన్ ప్రిన్స్ నాయకత్వంలోని ఈ చొరవలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి.

సౌదీ అరేబియాతో పెరుగుతున్న సంబంధాలలో భాగంగా ఈ పర్యటనను పేర్కొనవచ్చు. రెండువేల పధ్నాలుగు లో ప్రధానమంత్రి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇరు నాయకత్వాల మధ్య ఇది ఎనిమిదవ సమావేశం .క్రౌన్ ప్రిన్స్ తో ఆరవది.

ఈ ఏడాది జరిగిన సమావేశాలలో ఇది మూడవది .జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి మూడు వందల డెబ్బై అధికరణాన్ని రద్దు చేసిన నాటి నుంచి ఇది మొదటిది . మధ్య ప్రాచ్య దేశాలలో, ఆ వెలుపల, అరబ్బు ఇస్లామిక్ దేశాలతో పాకిస్తాన్ దౌత్యం ఈ అధికారణం రద్దు పై విపరీతధోరణిని ప్రదర్శించింది.

రెండు వేల ఆరు లో కింగ్ అబ్దుల్లా భారత పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి ఢిల్లీ ఒప్పందం శ్రీకారం చుట్టినా,ఇటీవల కాలం వరకు పురోగతి అంతంత మాత్రమే .మహారాష్ట్రలో పెట్రో రసాయనాల శుద్ధి కర్మాగారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఆసక్తి కనబరిచింది .అలాగే ప్రపంచంలోని అతిపెద్ద చమురు సంస్థ ఆరామ్కో ,రిలయన్స్ సంస్థలో పదిహేను బిలియన్ల అమెరికన్ డాలర్ల స్టేకు కొనుగోలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇవన్నీ ద్వేపాక్షిక సంబంధాల రూపాంతరీకరణ కు రియాద్ సుముఖంగా ఉన్నదనడానికి తార్కాణాలు.

ప్రధానమంత్రి తన పర్యటనలో కింగ్ సల్మాన్ తో సహా అనేక మంది సౌదీ నాయకులతో సమావేశమయ్యారు .కింగ్ ,క్రౌన్ ప్రిన్స్ గా ఉన్న సమయంలో, రెండువేల పధ్నాలుగు నవంబరులో బ్రిస్బేన్ జి ఇరవై సదస్సు సందర్భంగా ఆయనను ప్రధాన మంత్రి మొదటిసారిగా కలిశారు. తదాదిగా ఆయన సౌదీ రాజును మూడు సార్లు కలిశారు.రెండువేల పదహారులో ఆ దేశాన్ని సందర్శించినప్పుడు ఆఖరిసారిగా మోదీ రాజును కలిశారు.

ప్రధాన మంత్రి పర్యటన అనంతరం వెలువడిన సంయుక్త ప్రకటన చాలా కీలకమైనది. ఏమంటే దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఎటువంటి వెలుపలి ప్రమేయాన్ని సహించమన్న అంశాన్ని, దేశాల సార్వభౌమత్వంపై జరిగే దాడులను నివారించేందుకు తమ బాధ్యతలను అంతర్జాతీయ సమాజం నెరవేర్చాల్సిన అవసరాన్ని, ఈ ప్రకటనలో పునరుద్ఘాటించారు. భారత్ ఎదుర్కొంటున్న సీమాంతర ఉగ్రవాదం, సౌదీ చమురు స్థావరాలపై డ్రోన్ దాడులు, వీటిపై అంతర్జాతీయ సమాజం తగు రీతిన స్పందించాల్సిన అవసరం వంటివి, దౌత్యపరంగా ఇందులో నిబిడీకృతమైన అంశాలు.

వ్యూహాత్మక భాగస్వామ్య కౌన్సిల్ని ఏర్పరచటం అన్నది ఈ ఈ సందర్శన సందర్భంగా ప్రముఖంగా పేర్కొనవచ్చు. భారత ప్రధానమంత్రి, సౌదీ క్రౌన్ ప్రిన్స్ అధ్యక్షతన ఈ కౌన్సిల్ ఏర్పడింది. ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి ఇరువురు అగ్రనేతలు క్రమం తప్పకుండా సమావేశమవుతారని దీనివల్ల విశదమవుతోంది.

ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా పన్నెండు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇంధనం, పౌర విమానయానం, భద్రతా, సహకారం, రక్షణ, వైద్య పరికరాలు తదితరాలు ఇందులో ఉన్నాయి. సౌదీ అరేబియాలో మన ప్రధానమంత్రి రూపే కార్డును కూడా ఆవిష్కరించారు. పాలస్తీనా అంశంపై మద్దతు వంటి సాంప్రదాయ అంశాలను కూడా సంయుక్త ప్రకటన ప్రస్తావించింది. ఇక విదేశాంగ విధానంపై ఇరువురు నేతలు ఎమెన్ అంశాన్ని చర్చించారు. అది ఆ రాజ్యానికి చాలా ముఖ్యమైనది. అలాగే సిరియా అంశం కూడా చర్చకు వచ్చింది.

సౌదీ అరేబియా పెట్టుబడులు పెట్టేందుకు, భారత్ ఇంధన మౌలిక వసతి రంగం అనువైన లక్ష్యమని ప్రధాన మంత్రి అభివర్ణించారు. రానున్న కొద్ది ఏళ్లలో వంద బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకోవాలని ఆయన ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య పటిష్టమైన, ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు ఏర్పడేందుకు ఈ పర్యటన ఒక వేదికగా మారింది.ముఖ్యంగా పబ్లిక్ ప్రైవేటు రంగాలలోని భారత దేశ వ్యూహాత్మక చమురు నిల్వలు, పెట్రో రసాయనాల కర్మాగారాలు, పెట్టుబడులకు అనువైనవిగా తెలియజెప్పారు. ఇరు దేశాల సమిష్టి కృషితో అతి కొద్ది కాలంలో ఆశించిన ఫలితాలు వెలువడటం పై ప్రధాన మంత్రి రియాద్ పర్యటన విజయవంతమవుతుందన్న విషయం ఆధారపడి ఉంటుంది.

రచన: ప్రొఫెసర్ పి.ఆర్ .కుమారస్వామి, పశ్చి మాసియా అధ్యయనాల కేంద్రం అధ్యక్షులు, జెఎన్ యూ.

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన