ఎకనామిక్ విజన్ ను బలపరచిన భారత్ – అమెరికా వ్యూహాత్మక వేదిక
భారత్ – అమెరికా వ్యూహాత్మక వేదిక రెండవ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను దృఢతరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోది తమ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా వచ్చే ఐదేళ్లలో భారత్ ను 5 ట్రిలియన్ అమెరికా డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చెయ్యాలన్న తమ నిర్ణయాన్ని వివరించి చెప్పారు. తన అర్థ వ్యవస్థ పరిమాణాన్ని రెట్టింపు చెయ్యాలన్న భారత్ నిర్ణయం పట్ల భారత్ – అమెరికా వ్యూహాత్మక ఫోరం ప్రతినిధి బృందం విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
భారత్ వచ్చే ఐదేళ్ల కాలం ప్రపంచానికి తదుపరి 25 ఏళ్లను నిర్వచిస్తుందని సమావేశంలో పాల్గొన్న అగ్ర కార్పొరేటు సిఐఒలు, దౌత్యవేత్తలు అంగీకరించారు. జాన్ ఛాంబర్స్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రిని కలుసుకున్న ఫోరం ప్రతినిధి బృందంలో అమెరికా ప్రచ్ఛన్న యుద్ధ శకపు దౌత్యవేత్త హెన్రీకిస్సింజర్, మాజీ అమెరికా విదేశాంగ మంత్రి కండొలిజా రైస్, అగ్రస్థాయి కార్పొరేట్ సంస్థలకు చెందిన 300 మందికి పైగా సిఈఓలు ఉన్నారు.
గడచిన కొద్ది దశాబ్దాలలో భారత్ – అమెరికా దేశాల మధ్య సంబంధాలు గుణాత్మకంగా వృద్ధి చెందాయి. ఈ విషయాన్ని వాణిజ్య – పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒప్పుకున్నారు; ద్వైపాక్షిక సంబంధాలు ప్రస్తుతం అత్యంత పరిపుష్టంగా ఉన్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని బట్టి 2025 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 238 బిలియన్ అమెరికా డాలర్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అమెరికా దైత్యపరమైన నిర్మాణంలో వాణిజ్య అంశాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయన్న విషయం పట్ల భారత్ కు అవగాహన ఉంది.
జాతీయ ప్రయోజనాలను చొప్పించి పరస్పర సమ్మతి పొందేందుకు కూడా భారత్ చర్యలు తీసుకుంది. అమెరికాతో కుదిరిన నూతన వాణిజ్య ఒప్పందం గురించి గోయల్ ఫోరంకు తెలిపారు. లోగడ గల విభేదాలను సామరస్యంగా తొలగించాలన్న ఉభయ దేశాల నిర్ణయానికి ఇది తార్కాణంగా చెప్పవచ్చు.
ఇంకా వాణిజ్యం మరింత తేలిగ్గా జరిగేలా చూసేందుకు భారత్ చేపట్టిన చర్యలను మోదీ ఫోరంకు పరిచయం చేసారు. ఆర్థిక వృద్ధిని పెంపొందించే దిశగా కార్పొరేటు పన్నులో కోత విధిస్తూ భారత్ సకాలంలో నిర్ణయం తీసుకుందన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఏర్పాటు చేసిన ఆహ్లాదకరమైన Eco-System గురించి ప్రధానమంత్రి సుదీర్ఘంగా వివరించారు. నిజానికి ఇటీవలి కొద్ది సంవత్సరాలలో పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ప్రయోగ శాలల ఏర్పాటు ద్వారా ఆవిష్కరణలను సంస్థాగతం చేసేందుకు గాను గట్టి చర్యలు చేపట్టినట్టు మోదీ తెలిపారు.
ప్రజాస్వామ్యం, డెమోగ్రఫీ, బుద్ధిబలం అనే మూడు అంశాలు భారత్ కు బలాన్ని చేకూరుస్తున్నాయని మోదీ చెప్పారు. ఇతరులకంటే బాగా అమెరికాకు భారతీయుల బుద్ధిబలం గురించి తెలుసునన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను భారతీయుల ప్రజ్ఞాపాటవాలు నూతన శిఖరాలకు చేరుస్తున్నాయని అంటూ అందుకు సిలికాన్ వ్యాలీ నిదర్శనంగా నిలుస్తుందన్నారు.
భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలు ఇటీవలి దశాబ్దాలలో విపరీతంగా పెరిగాయి. వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో కాంట్రాక్టు పద్ధతిపై వస్తు తయారీకి ద్వారాలు తెరిచి భారత్ సరైన చర్య తీసుకుంది. అమెరికాలో భారీ తయారీ దిగ్గజాలు చైనాలోని తమ సంస్థలకు ప్రత్యామ్నాయాల కోసం వెదుకులాడుతున్న తరుణంలో భారత్ ఈ చర్యను చేపట్టింది. కొన్ని తూర్పు ఆసియా దేశాలు ఈ పరిస్థితిని అదనుగా తీసుకోవాలని చూసాయి.
ఆంగ్ల భాషపై భారత్ కు గల విలువైన పరిజ్ఞానం నిరంతరం పెరుగుతున్న నైపుణ్యాలు గల మానవ శక్తితో పాటు సులువైన వాణిజ్యం భారత్ను పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యంగా చేస్తున్నాయి.
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ – ఇకపై బిజినెస్ అనేది ద్వైపాక్షిక సంబంధాలలో ప్రధానాంశంగా ఉంటుందన్నారు. మానవ వనరులను నాణ్యంగా మార్పు చెయ్యటంపై ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ భారత్ – అమెరికా వాణిజ్య బంధాలకు వన్నె తెస్తుందని చెప్పారు.
ప్రధానమంత్రి అమెరికా సందర్శన సందర్భంగా హూస్టన్ లో ఆ దేశం లోని అగ్ర ఇంధన కంపెనీల సిఈఓలతో కూడా సమావేశమయ్యారు. అనంతరం భారత పెట్రోలియం – ఖనిజ వాయు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ద్వైపాక్షిక సంబంధాలలో ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. అమెరికాతో భారత్ ఇంధన వ్యాపారం ఈ ఏడాది 10 బిలియన్ డాలర్లను మించుతుందని చెప్పారు.
ట్రంప్ పాలనలోని సీనియర్ సభ్యుల భారత్ సందర్శనలకు ముందుగా ప్రధానమంత్రి అమెరికా పర్యటన సందర్భంగా ఈ చర్యలన్నీ జరగడం విశేషం. దీనివల్ల పరస్పర లాభకరమైన భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంతో ద్వైపాక్షిక సంబంధాలు నూతన పుంతలు తొక్కనున్నాయి.
ఆంగ్ల రచన : మనీష్ ఆనంద్ – సీనియర్ ప్రత్యేక విలేకరి, ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్
Comments
Post a Comment