భారత యాక్ట్ ఈస్ట్ విధానం మరింత ముందుకు
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ - ఫిలిప్పీన్స్, జపాను దేశాలలో ఇటీవల పర్యటించారు. ఈ రెండు దేశాలు కూడా భారత్ యాక్ట్ ఈస్ట్ విధానంలో ప్రధాన పాత్రధారులుగా ఉన్నాయి. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కోవింద్ తొలుత ఫిలిప్పీన్స్ సందర్శించారు. దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పర్యటన జరిపారు. అనంతరం రాష్ట్రపతి చక్రవర్తి నరుహిటో పట్టాభిషేక మహోత్సవానికి హాజరయ్యేందుకు జపాను వెళ్ళారు.
ఒకేరకమైన విలువలు, పరస్పర వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా భారత యాక్ట్ ఈస్ట్ విధానంలో ఫిలిప్పీన్స్ ప్రధాన భూమిక వహిస్తోంది. నిబంధనల ఆధారిత ప్రపంచ క్రమాన్ని బట్టి అంతర్జాతీయంగా దేశాల శాంతి - సార్వభౌమ సమానత్వాలను నిలిపివుంచటంలో భారత్ - ఫిలిప్పీన్స్ దేశాలు రెండు కూడా సహజ భాగస్వాములుగా ఉన్నాయి.
దక్షిణ - దక్షిణ సహకారం పైనా సుదృఢ ప్రజాస్వామ్య పాలిటీ ఆధారంగా ఏర్పడిన ఇరు దేశాల సంబంధాలు యాక్ట్ ఈస్ట్ విధానం చట్రం పరిధిలో మరింత బలపడి వేగం పుంజుకున్నాయి. రాష్ట్రపతి సందర్శన సందర్భంగా సంతకాలు జరిగిన నాలుగు కొత్త ఒప్పందాల వల్ల భారత - ఫిలిప్పీన్స్ సంబంధాలు ఇంకా పటిష్ఠంగా, లోతుగా మారాయి. సముద్ర ప్రాంత భద్రత, పర్యాటకం, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక రంగాలలో ఈ ఒప్పందాలు కుదిరాయి. ఇంకా ఉగ్రవాదం, అంతరిక్షం వంటి కీలక రంగాలలో సహకారంపై చర్చలు జరిగాయి. అంతేకాదు క్వెజోన్ నగరంలో మిరియం కళాశాల వద్ద మహాత్మాగాంధీ విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు కూడా. కాగా బలోపేతమైన భారత్ - ఆసియాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ ద్వైపాక్షిక అవగాహనను మరింత పెంపొందింప జేసింది.
రెండు దేశాలు కూడా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా పరిగణనలో ఉన్నాయి. ఆర్థిక పరిపుష్టి కారణంగా భారత్ – ఫిలిప్పీన్స్ దేశాల మధ్య భారీ వాణిజ్య, పెట్టుబడుల అనుసంధానానికి గట్టి పునాది ఏర్పడుతోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోది చేపట్టిన భారత్ లో తయారీ కార్యక్రమం, ఫిలిప్పీన్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్టె – బిల్డ్, బిల్డ్, బిల్డ్ – కార్యక్రమం రెండూ కూడా వ్యాపారులకూ, పెట్టుబడిదారులకు గణనీయంగా మంచి అవకాశాలను కల్పిస్తాయి. ఇరు పక్షాలు ఆకర్షణీయ నగరాలు, రేవులు, డిజిటల్ ఐ-వేస్ వంటి అత్యధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నందున ఈ అవకాశాలు ఏర్పడతాయి.
ఇండియా – పిలిప్పీన్స్ వాణిజ్య సదస్సులోను, 4వ ఆసియాన్ – ఇండియా బిజినెస్ సమ్మిట్ లోను భారత రాష్ట్రపతి మాట్లాడుతూ – డిజిటల్ పరిశ్రమలు, ఆవిష్కరణలు, ఆరోగ్యం – ఔషధాలతో పాటు కీలకమైన వ్యవసాయభివృద్ధిలో ద్వైపాక్షిక సహకారానికి నూతన మార్గాలు అన్వేషించాలని పిలుపునిచ్చారు. ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక వాణిజ్యం గడచిన రెండేళ్లలో 17 శాంతి పెరిగి 2.3 బిలియన్ అమెరికా డాలర్ల మేరకు చేరింది.
భారత కంపెనీలు దుస్తులు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఔషధాలు మొదలైన రంగాలపై ప్రధానంగా దృష్టి పెడుతుండగా మౌలిక సదుపాయాభివృద్ధి, రక్షణ ఆధునికీకరణ తదితర రంగాలలో కూడా మంచి అవకాశాలున్నాయి.
మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, గంగానదీ ప్రక్షాళన ప్రాజెక్టు, స్వచ్ఛ భారత్, స్మార్టు సిటీస్, జలజీవన్ మున్నగు ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలలో పాలుపంచుకోవలసిందని రామ్ నాధ్ కోవింద్ ఫిలిప్సీన్స్ ను ఆహ్వానించారు.
ఇక తమ రెండో విడత పర్యటన కింద జపానును సందర్శించిన భారత రాష్ట్రపతి నరుహిటో చక్రవర్తి పట్టాభిషేకానికి హాజరయ్యారు; అలాగే చక్రవర్తి ఆతిథ్యం ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి షింజో అబే అధికార విందుకు కూడా కోవింద్ హాజరయ్యారు. ఇంకా నాగరికత బంధాలను పెంపొందించే దిశగా రామ్ నాధ్ కోవింద్ సుకిజి హాంగ్ వన్ జి బౌద్ధ దేవాలయాన్ని సందర్శించారు.
భారత్ – జపాన్ ల మధ్య బంధాలు మరింతగా బలపడుతున్నట్టు రాష్ట్రపతి కోవింద్ జపాను సందర్శన స్పష్టం చేస్తుంది. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలతోపాటు ఉమ్మడి వ్యూహాత్మక, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు గట్టి పునాదులుగా ఉభయ దేశాల భాగస్వామ్యం పటిష్ఠంగా ఉంది.
ఈ ఏడాది డిసెంబరులో జరుగనున్న జపాన్ – భారత్ వార్షిక సదస్సుకు ముందు తొలి విదేశీ, రక్షణ మంత్రత్వ స్థాయి సంభాషణలకు (2+2) భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
భారత యాక్ట్ ఈస్ట్ విధానంలో ఆగ్నేయ – తూర్పు ఆసియా ప్రాంతం గుండెకాయ వంటిది కావటంతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను నూతన శిఖరాలకు చేర్చటంలో భారత్ అత్యున్నత స్థాయిలో తన రాజకీయశక్తి యుక్తులను ఒడ్డి ముందుకు సాగుతుంది. రాష్ట్రపతి కోవింద్ సందర్శన ఈ లక్ష్యానికి మరింత బలం చేకూర్చింది.
రాజకీయంగా, వ్యూహాత్మకంగా విధానాల రూపకల్పనలో ఇండో ఫసిఫిక్ ప్రాంతం ప్రాముఖ్యత సంతరించుకున్న కారణంగా ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది.
రచన : డా. తిత్లీబసు - వ్యూహాత్మక విశ్లేషకులు
Comments
Post a Comment