అలీనోద్యమం ముందున్న సవాళ్లు

ఒకనాడు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అలీనోద్యమం-NAMకు నేడు ఆ గుర్తింపు లభించడంలేదు. ఇలాంటి నేపథ్యంలో నామ్ 18వ శిఖరాగ్ర సదస్సుకు వచ్చేవారం అజ‌ర్‌బైజాన్‌ ఆతిథ్యమివ్వనుంది. అయితే ఇప్పటి పరిస్థితిరీత్యా అలీనోద్యమం తన ఔచిత్యాన్ని కోల్పోయినట్లు భావించరాదు. ప్రపంచవ్యాప్తంగా అధికార శక్తిలో మార్పులు అంతర్జాతీయ సంబంధాల్లో కొత్త కూటమికి దారితీయడమే అలీనోద్యమంపై ఉదాసీనతకు కారణం. అట్లాంటిక్ శకం అంతమవుతూ, ఆసియా శతాబ్ది ఆవిష్కృతమవుతున్న పరిస్థితుల్లో ప్రపంచం నేడు కొత్త భౌగోళిక-రాజకీయ మార్పులకు సాక్షీభూతంగా మారింది. ఓ నిపుణుడి అభిప్రాయం ప్రకారం... వాస్తవానికి 21వ శతాబ్దంలో ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థల విస్తరణ ఫలితంగా ‘‘కూటమి-శూన్య ప్రపంచం’’ ఏర్పడింది. ఏ వాస్తవ అంతర్జాతీయ అంశాన్నయినా ముందుకు తీసుకెళ్లగల రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక ఏకీకరణ శక్తి ఏ ఒక్క దేశం లేదా కూటమికి లేదన్నదే ‘కూటమి-శూన్య ప్రపంచం’లోని అంతర్లీన సందేశం!

భారత అగ్రశ్రేణి వ్యూహ నిపుణులు కొన్నేళ్ల కిందట అలీనోద్యమం 2.0 పేరిట ఒక పత్రాన్ని రూపొందించారు. మన దేశం అలీనోద్యమ మూల సిద్ధాంతాలకు కట్టుబడినందువల్ల ప్రపంచ యవనికపై భారత్ కీలకపాత్ర పోషిస్తూ ఉద్యమ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని, విలువలను పరిరక్షించగలదని ఆ పత్రం పేర్కొంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధం 2.0 శకం మొదలైంది. దీని లక్షణాలు భిన్నమే అయినా, ఇది స్పర్థాత్మక ప్రయోజనాల ప్రాతిపదికనగాక స్పర్థాత్మక విలువల ఆధారంగా రూపొందినందున దీనివల్ల ముప్పువాటిల్లే అవకాశాలే అధికం. కాబట్టి అలీనోద్యమ పునరావిష్కరణ ఎంతో అవసరం. భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ S.జైశంకర్ మన విదేశీ విధానాన్ని విశదీకరించారు. అంశాలవారీ అలీనం, బలీయ శక్తుల మధ్య సంబంధాలు, అంతర్జాతీయంగా భారత ముద్రను విస్తరించడం అందులో భాగంగా ఉన్నాయి. ఒక్కమాటలో చెబితే అలీనోద్యమానికి ఇదొక ఆమోదముద్ర కాగా, ఏ దేశంతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం భారతదేశానికి లేదని చెప్పవచ్చు.

అలీనోద్యమ శిఖరాగ్ర సదస్సులపై అంచనాలు ఎన్నడూ ఆశాజనకంగా లేవు. మరోవైపు ఈసారి శిఖరాగ్ర సదస్సు నిర్వహించబోయే దేశానికి అలీన ప్రపంచంలో ఏనాడూ భాగస్వామ్యం లేదు. ఇతర అంతర్జాతీయ వేదికలైన G20, BRICSలలో భారత్ ప్రధాన పాత్రధారి అయినందున ప్రపంచ కార్యాచరణను ఆ దేశాలే నిర్ణయిస్తున్నాయి. నామ్ ప్రస్తుతం అత్యధిక దేశాల సభ్యత్వంగల కూటమిగా ఉంది. అలీనోద్యమ వ్యవస్థాపక దేశమైన భారత్- అందులో అంతర్లీనంగా ఉన్న విలువలకు ఇప్పుడు కూడా అంతే ప్రాధాన్యమిస్తోంది. స్వేచ్ఛ అన్నది మానవాళి విముక్తికి సాగే సంఘర్షణలో భాగం కావాలన్న గాంధీజీ ఆకాంక్షను యుద్ధానంతర ప్రపంచంలో అలీనోద్యమం సాకారం చేయగలదని భారత్ విశ్వసించింది.

ఒక విదేశీ విధాన సిద్ధాంతంగా, నిర్దిష్ట విదేశీ విధాన ధోరణిగా అలీనోద్యమం చాలాకాలంపాటు కొనసాగింది. అగ్రదేశాలు, కూటములవల్ల తమ సార్వభౌమాధికారం నీరుగారిపోకుండా రక్షించుకోవడం కోసం కొత్తగా విముక్తి పొందిన దేశాలు అలీనోద్యమంలో చేరాయి. సమానావకాశాల ప్రపంచ ఆకాంక్షసహా కొన్ని అంశాలపై నామ్ పోరాట వైఖరి ఇప్పటికీ అనుసరణీయమే. మరికొన్ని అంశాలు కొత్త స్వరూప-స్వభావాలు సంతరించుకోగా, అనేక సార్వజనీన సవాళ్లు నేటికీ కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో నామ్ సరికొత్త పంథాను ఎంచుకోవాల్సిన అవసరమేమీ లేదు. కాకపోతే... సమకాలీన ఔచిత్యం రీత్యా కొన్ని కార్యాచరణలకు పునఃరూపమివ్వడంతోపాటు నామ్ తన పనితీరును తిరిగి శక్తిమంతం చేసుకోవాలి.

అలీనోద్యమ లక్ష్యాలకు భారత్ కట్టుబడే ఉంది. ఆ మేరకు ‘‘వర్ధమాన ప్రపంచంలో సామూహిక ప్రయోజనాలకు తగిన కార్యాచరణకు వీలుండాలని నామ్ సూచిస్తోంది... ప్రత్యేకించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంస్కరణ, నిరాయుధీకరణ వంటి అంశాలపై శ్రద్ధ అవసరం’’ అని స్పష్టం చేస్తోంది.

ఐక్యరాజ్య సమితి కూడా ఒకప్పుడున్నంత ప్రభావవంతంగా లేదు. అంతమాత్రాన దాన్ని వదిలిపోవాలని ఏ దేశమైనా ఆలోచిస్తుందా? ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం డిమాండ్ దిశగా మద్దతు కూడగట్టగల శక్తిమంతమైన వేదికగా నామ్ ఉపయోగపడుతుంది. మరొక కారణం ఏమిటంటే... నేడు దక్షిణ-దక్షిణ ప్రాంత సహకారం ఊపందుకుంది. వర్ధమాన దేశాలకు అన్నివిధాల సహాయం అందిస్తున్న ప్రధాన శక్తిగా భారత్ అవతరించింది. బాండుంగ్ సదస్సులో తీర్మానించిన మేరకు- జాతీయ సార్వభౌమత్వాన్ని గౌరవించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, సమానత్వం, సాంస్కృతిక భిన్నత్వం, గుర్తింపు, స్థానికతలకు ప్రాధాన్యం వంటి అంశాల స్ఫూర్తితో దక్షిణ-దక్షిణ ప్రాంత సహకారానికి ఉత్తేజం లభించింది.

ఈ నేపథ్యంలో అజర్‌బైజాన్‌ రాజధాని బాకూ నగరంలో జరగబోయే నామ్ శిఖరాగ్ర సదస్సు కొన్ని ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యమివ్వనుంది. తదనుగుణంగా 2030నాటికి నిర్దేశించిన సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధన, వాతావరణ మార్పుపై పారిస్ ఒప్పందం అమలుసహా అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలపై గట్టిగా దృష్టి సారించనుంది. అంతేగాక ఉగ్రవాదంపై పోరు కూడా ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

అలీనోద్యమ నాయకత్వం కోసం అజర్‌బైజాన్‌ ఎదురుచూస్తోంది. ఆ దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం ఎంతో విజ్ఞతను సూచిస్తోంది. రష్యా, నాటోలతోపాటు రెండు వైరిపక్షాలతో భాగస్వామ్యాలను నిర్మించుకోవడం ఇందుకు నిదర్శనం. అందువల్ల నామ్ నేతృత్వానికి అజర్‌బైజాన్‌ అన్నివిధాలా అర్హురాలే. ఈ నేపథ్యంలో... ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనడం, శాంతి-సుస్థిరతలుసహా అంతర్జాతీయ భద్రతను సంఘటితం చేయడం, నామ్ సభ్యదేశాల నడుమ సహకార విస్తృతి తదితరాలపై బాకూ శిఖరాగ్ర సదస్సు లోతుగా చర్చించనుంది.


రచన: డాక్టర్ యాష్ నారాయణ్ రాయ్, సంచాలకులు, సామాజిక శాస్త్రాల సంస్థ, ఢిల్లీ

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన