సమున్నత స్థాయికి భారత-డచ్ సంబంధాలు

భారత్-నెదర్లాండ్స్ స్నేహానుబంధం 17వ శతాబ్దం నాటిది కావడంవల్ల రెండు దేశాల మధ్య సంబంధాలకు సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉంది. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చాక రెండు దేశాల నడుమ అధికారిక దౌత్య సంబంధాలు మొదలయ్యాయి. ఆ క్రమంలో ఆర్థిక సంబంధాలు 1970-1980 దశాబ్దాల మధ్య నిలకడగా పెరుగుతూ వచ్చినా 1990 దశకంలో భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణతో వేగం అందుకున్నాయి. తదుపరి కాలంలో రెండువైపుల నుంచీ ఉన్నతస్థాయి పర్యటనలతో రాజకీయ సంబంధాలు ఇనుమడించాయి. దీనివల్ల రాజకీయంగా, ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక స్థాయులలోనూ ద్వైపాక్షిక సంబంధాలు ఊపందుకున్నాయి. డచ్ ప్రధానమంత్రి ‘యాన్ పీటర్ బాల్కనెండ’ 2006లో భారతదేశాన్ని సందర్శించారు. ఆ తర్వాత గడచిన నాలుగేళ్లుగా ప్రధానమంత్రుల స్థాయిలో రెండు దేశాల మధ్య మూడు పర్యటనలు జరిగాయి. ఇందులో భాగంగా 2018 మే నెలలో నెదర్లాండ్స్ ప్రధానమంత్రి ‘మార్క్ రట్టే’ అతిపెద్ద వాణిజ్య బృందంతో భార‌త్‌లో పర్యటించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల్లో పెరుగుదలను ఈ పర్యటన ప్రస్ఫుటం చేసింది.

డచ్ రాజదంపతులు విలెమ్ అలెగ్జాండర్, మాగ్జిమా ఇటీవల ఐదు రోజులపాటు భార‌త్‌లో పర్యటించారు. నెదర్లాండ్స్ రాజుగా 2013లో పట్టాభిషిక్తుడైన విలెమ్ అలెగ్జాండర్ భార‌త్‌లో అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి. సుశిక్షిత విమాన చోదకుడైన రాజు, ఈ పర్యటనలో తమ విమానాన్నే స్వయంగా నడిపారు. ఆయన లోగడ KLM విమానాలకు సహ-చోదకుడుగా వ్యవహరించేవారు. నెదర్లాండ్స్ రాజరికం రాజ్యాంగబద్ధమైనది కాగా- ప్రస్తుత రాజు అలెగ్జాండర్ తల్లి, 2007లో ఆ దేశానికి రాణిగా ఉన్న ‘బీట్రిక్స్’ భారతదేశాన్ని సందర్శించారు.

రాజదంపతులకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ సాదర స్వాగతం పలికారు. భారత-నెదర్లాండ్స్ సంబంధాలకు ఆర్థిక భాగస్వామ్యమే మూలస్తంభమని వారి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు సమావేశంలో రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆ దేశానికి చెందిన వందకుపైగా కంపెనీలు భార‌త్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తుండటమే ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు. మరోవైపు ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ అభ్యర్థనకు నెదర్లాండ్స్ మద్దతిస్తోంది. అంతేకాకుండా అనేక ఎగుమతి నియంత్రణ వ్యవస్థలలోనూ భాగస్వామ్యం దిశగా భారత్ డిమాండును బలపరుస్తోంది. బలమైన చారిత్రక సంబంధాల ఆధారంగా ‘‘ఆవిష్కరణలు, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞాన చోదిత భాగస్వామ్యాన్ని రెండు దేశాలూ సృష్టించుకున్నాయ’’ని కోవింద్ ఈ సందర్భంగా చెప్పారు. అలాగే ‘‘అత్యాధునిక పరిష్కారాలు, నగరాలు, హరిత ఇంధనం, అంకుర సంస్థలు, నవశకం ఉత్పత్తులు రెండు దేశాలనూ మరింత సన్నిహితం చేస్తున్నాయ’’ని వివరించారు. ముఖ్యంగా నదుల పునరుజ్జీవన సాధనలో నెదర్లాండ్స్ అనుభవాలను పంచుకునేందుకు, కొత్త అంశాలను నేర్చుకునేందుకు భారత్ ఆసక్తి చూపుతున్నదని పేర్కొన్నారు. కాగా...

భారత తొలి ప్రధానమంత్రి నెహ్రూ 1957నాటి నెదర్లాండ్స్ తొలి పర్యటన సందర్భంగా చేసిన ప్రసంగాన్ని రాజు విలెమ్ అలెగ్జాండర్ ప్రస్తావించారు. ‘‘మనమంతా ఒకరి ముంగిట మరొకరం నివసిస్తున్నాం’’ అంటూ రెండు దేశాల సాన్నిహిత్యంపై ఆనాటి నెహ్రూ వ్యాఖ్యలను గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ‘‘అంతర్జాతీయ చట్టాలు, విస్తృత సహకారం ప్రాతిపదికగాగల ప్రపంచ క్రమానికి మద్దతుగా ఐరోపా సమాఖ్యతో భారత్ చేయికలపడంపై నెదర్లాండ్స్ హర్షం వ్యక్తం చేస్తున్నద’’ని రాజు ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశిత ‘సుస్థిర ప్రగతి లక్ష్యాల’ సాధనలో భారత్ చిత్తశుద్ధిని కూడా ఆయన కొనియాడారు.
ఐరోపా సమాఖ్య దేశాల స్థాయిలో భార‌త్‌కు- నెదర్లాండ్స్ ఐదో అతిపెద్ద పెట్టుబడిదారుగా, నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో భారత శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వ శాఖ, భారత పరిశ్రమల సమాఖ్యలు నెదర్లాండ్స్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ‘25వ సాంకేతికశాస్త్ర శిఖరాగ్ర సదస్సు-ప్రదర్శన’కు రాజదంపతులు యాదృచ్ఛికంగా హాజరు కావడం విశేషం. నీరు, వ్యవసాయం, ఆహారం, ఆరోగ్యం అంశాలపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారించింది. ఆయా రంగాల్లో యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం దిశగా ఈ సదస్సు సాగింది. వివిధ కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వాములు, విజ్ఞాన సంస్థలు ఇందులో పాల్గొనగా, వాటితో తమ వినూత్న ఆలోచనలను పంచుకునే గొప్ప అవకాశం 15 భారత-డచ్ అంకుర సంస్థలకు లభించింది. అంతకుముందు రాజు విలెమ్ అలెగ్జాండర్ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘‘ఆవిష్కరణ అంటేనే సహ-సృష్టి’’ అని రాజు తన ప్రసంగంలో పేర్కొన్నారు. అంతేగాక మానవాళిని ప్రభావితం చేసే సామాజిక సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ నైపుణ్యం, విజ్ఞానాలను ఏకం చేయడంగానూ అభివర్ణించారు.

ఇక సామాజిక-సాంస్కృతిక సంబంధాల విషయానికొస్తే- నెద‌ర్లాండ్స్‌లో సుమారు 2 లక్షల 35వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఐరోపా స్థాయిలో బ్రిటన్ తర్వాత అత్యధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నది ఈ దేశంలోనే. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్.లో చదువుకున్న విద్యార్థులనుంచి ఎంపిక చేసిన 50 మంది బృందంతో చారిత్రక సఫ్ద‌ర్‌జంగ్‌ సమాధివద్ద రాజదంపతులు ఈ నెల 15న సమావేశమయ్యారు. కాగా, ఆంగ్ల మాధ్యమంలో అతి తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యాభ్యాసానికి నెలవుగా మారిన ఐరోపా ముఖద్వారం వంటి హాలండ్ భారత విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తోంది.

రాజదంపతుల ముంబై నగర సందర్శన సందర్భంగా 400 ఏళ్లనాటి ఉమ్మడి వారసత్వాన్ని సంస్మరించుకుంటూ ‘‘ రెంబ్రాంట్ కాలంనాటి భారత-డచ్ సంబంధాలు’’ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనను వారు ప్రారంభించి, డచ్ పౌరులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం కేరళలోని మట్టాంచెరిలోగల డచ్ రాజసౌధం సందర్శనతో వారి పర్యటన ముగిసిన నేపథ్యంలో భారత-నెదర్లాండ్స్ సంబంధాలు సమున్నత స్థాయిని అందుకుంటాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

రచన: ప్రొఫెసర్ ఉమ్మూ సల్మా బావా, ఐరోపా అధ్య‌య‌న కేంద్రం చైర్‌ప‌ర్స‌న్-జీన్ మోనెట్ పీఠం అధిప‌తి, జ‌వ‌హ‌ర్లాల్ నెహ్రూ విశ్వ‌విద్యాల‌యం

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన