కొమురోస్, సియెర్రా లియోన్ దేశాలతో భారత్ సంబంధాలు పటిష్ఠం

ఆఫ్రికా ఖండంతో స్నేహ సంబంధాలను మరింత పటిష్ఠం చేసుకోవడం లక్ష్యంగా భారత ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు కొమొరోస్, సియెర్రా లియోన్ దేశాల్లో పర్యటించారు. సముద్రతీర పొరుగు దేశమైన కొమొరోస్ ప్రజలతో తన పురోగమన అనుభవాలను పంచుకునేందుకు భారత్ సిద్ధమైంది. అంతేకాకుండా కొమొరోస్ ప్రగతిలో ముఖ్యమైన భాగస్వామి కావాలని కూడా భారత్ ఆకాంక్షిస్తోంది.

ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు ‘అజలీ అసుమని’తో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంభాషించారు. ఈ సందర్భంగా అనేక ఉత్తేజపూర్వక అవకాశాలపై నాయకులిద్దరూ చర్చించారు. తదనుగుణంగా ఆరోగ్య, పునరుత్పాదక ఇంధన, సమాచార సాంకేతిక, సముద్ర భద్రతసహా పలు రంగాల్లో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల విస్తృతిపై వారొక అంగీకారానికి వచ్చారు.

అనంతరం రక్షణ రంగ సహకారంపై ఒక అవగాహన ఒప్పందంమీద సంతకాలు పూర్తయ్యాయి. దీంతోపాటు ఆరోగ్యం, సంస్కృతి సంబంధిత రంగాలపైనా ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. అలాగే దౌత్య, అధికారిక పాస్.పోర్టులుగల రెండు దేశాల పౌరులు స్వల్పకాలిక సందర్శనకు వచ్చినపుడు వీసా పొందాల్సిన నిబంధన నుంచి పరస్పర మినహాయింపు ఇవ్వాలని భారత్, కొమొరోస్ నిర్ణయించాయి.

కొమొరోస్.లోని మొరోనీలో 18 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం 41.6 మిలియన్ డాలర్ల మేర విడతలవారీ రుణ సహకారానికి భారత్ అంగీకరించింది. అంతేగాక వృత్తి శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఆర్థిక సహాయం ప్రతిపాదనను ఆమోదించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత ఇనుమడించాయి.
కొమొరోస్.కు మిలియన్ డాలర్ల విలువైన మందులను భారత్ బహూకరించనుంది. అంతేకాకుండా వెయ్యి టన్నుల బియ్యం, 2 మిలియన్ డాలర్ల విలువైన సముద్ర గస్తీ నౌకలు, మిలియన్ డాలర్ల విలువైన రవాణా సామగ్రిని కూడా ఉదారంగా అందజేయనుంది. ఈ సాయంతోపాటు హై స్పీడ్ ఇంటర్.సెప్టర్ బోట్ల కొనుగోలుకు 20 మిలియన్ డాలర్ల మేర విడతలవారీ రుణం ఇస్తామని భారత్ ప్రకటించింది. అలాగే దూరవిద్య, దూరవైద్యం, ఈ-విద్యాభారతి, ఈ-ఆరోగ్య భారతికి సంబంధించి రెండు దేశాలూ ఒప్పందం చేసుకున్నాయి.
అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న అనేక ముఖ్యమైన సవాళ్లపై బహుపాక్షికంగా కొమొరోస్, భారత్ విధానాల మధ్య ఒక సామ్యం ఉంది. అంతేగాక విభిన్న బహుపాక్షిక వేదికలపై పరస్పర మద్దతును రెండు దేశాలూ స్థిరంగా కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరులో, ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో సంస్కరణలుసహా భారతదేశానికి శాశ్వత సభ్యత్వం విషయంలోనూ కొమొరోస్ నిరంతర మద్దతు ఇవ్వడంపైనా భారత్ కృతజ్ఞతలు తెలిపింది.

కొమొరోస్ అభివృద్ధి, పురోగమనం కోసం తన శక్తిసామర్థ్యాల పరిధి, కొమొరోస్ ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా అన్నివిధాలా సహకరించేందుకు సదా సిద్ధమని భారత్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.

రెండు దేశాల పర్యటన మలివిడతలో భాగంగా వెంకయ్యనాయుడు సియెర్రా లియోన్ సందర్శనకు వెళ్లారు. భారత ఉన్నతస్థాయి బృందం ఆ దేశంలో పర్యటించడం ఇదే ప్రథమం. సార్వజనీన విలువలు, ఉమ్మడి దృష్టికోణం ప్రాతిపదికన రెండు దేశాల మధ్య సాదర, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. పరస్పర విశ్వాసం, గౌరవం, అవగాహన సూత్రాల ఆధారంగా ఈ బంధం కొన్నేళ్లుగా విస్తృతమవుతూ వస్తోంది.

సియెర్రా లియోన్.లో ప్రజాస్వామ్యాన్ని సంఘటితం చేయడంపై భారత్ అభినందించింది. ఐదు ఎన్నికలను, మూడు అధికార మార్పిడులను శాంతియుతంగా పూర్తిచేయడం ఇందుకు నిదర్శనమని పేర్కొంది. నిరుడు సియెర్రా లియోన్ అధ్యక్షుడుగా ఎన్నికైన ‘జూలియస్ మాదాబయో’కు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

సియెర్రా లియోన్.తో భారతదేశానికి ఇప్పటికే సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ దేశంలో శాంతి, సుస్థిరతలు నెలకొల్పడంతో మన దేశం కీలకపాత్ర పోషించింది. ఇందులో భాగంగా సియెర్రా లియోన్.లో ఐక్యరాజ్య సమితి కార్యాచరణ కింద మొట్టమొదటగా శాంతిదళాలను పంపిన దేశాల్లో భారత్ కూడా ఒకటి కావడం గమనార్హం.

ద్వైపాక్షిక సంబంధాల్లోని ప్రధానాంశాలుసహా ఉమ్మడి ప్రయోజనాలున్న అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై అధ్యక్షుడు జూలియస్ మాదాబయోతో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చర్చించారు. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక, దీర్ఘకాలిక సంబంధాలను మరింత పటిష్ఠం చేయడంపై తమ కట్టుబాటును నాయకులిద్దరూ నొక్కిచెప్పారు.

వ్యవసాయం, ఆహార తయారీ, సమాచార సాంకేతికత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సమర్థత పెంపుతోపాటు వివిధ రంగాల్లో సహకార విస్తృతికి రెండు దేశాలూ అంగీకరించాయి. సియెర్రా లియోన్.లో భారత కంపెనీల విస్తరణను ప్రోత్సహించేందుకు భారత్ సంసిద్ధత తెలిపింది.

సియెర్రా లియోన్ ప్రగతి పయనంలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ తనవంతు కర్తవ్యం నిర్వర్తిస్తోంది. ఈ మేరకు అనేక రంగాల్లో ఆ దేశానికి 217.5 మిలియన్ డాలర్ల విలువైన విడతలవారీ రుణసాయం అందించింది. ఈ నేపథ్యంలో పలు అవగాహన ఒప్పందాలు/ఒడంబడికలపై సంతకాలు పూర్తయ్యాయి. ధాన్యం ఉత్పత్తిలో సియెర్రా లియోన్ స్వావలంబన దిశగా ‘తొమాబమ్’లో నీటిపారుదల సదుపాయాల అభివృద్ధికి 30 మిలియన్ డాలర్ల విడతలవారీ రుణం అందించే ఒప్పందం కూడా వీటిలో భాగంగా ఉంది. అంతేకాకుండా తాగునీటి పథకానికి సంబంధించి 15 మిలియన్ డాలర్ల రుణసాయాన్ని భారత్ పునర్నవీకరించింది.

ఆఫ్రికా అంతటా భారత్ అమలు చేయబోతున్న దూరవిద్య, దూరవైద్యం, ఈ-విద్యాభారతి, ఈ-ఆరోగ్య భారతికి సంబంధించి సియెర్రా లియోన్ భాగస్వామ్యంపైనా ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. సియెర్రా లియోన్.లో సమాచార సాంకేతిక నైపుణ్య కేంద్రం ఏర్పాటుకు భారత్ త్వరలోనే చర్యలు ప్రారంభించనుంది. అలాగే రాబోయే కొన్ని నెలల్లో సౌహార్దత ప్రకటన కింద సియెర్రా లియోన్.కు వెయ్యి టన్నుల బియ్యాన్ని భారత్ పంపించనుంది.

రచన: పదమ్ సింగ్, ఆకాశవాణి: వార్తా విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన