కశ్మీర్‌పై పాకిస్తాన్ అర్థలేని రాధ్ధాంతం

జమ్ము, కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని భారత ప్రభుత్వం తొలగించినప్పటి నుంచి, ఆ రెండింటినీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా భారత ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి పాకిస్తాన్ నాయకత్వం తీవ్ర గందరగోళానికి గురవుతోంది. అంతేకాదు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై హెచ్చరికలను సంధించడానికి ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదు. అణ్వాయుధ యుద్ధమ తప్పదంటూ కూడా భయపెట్టింది. అంతేకాదు భారత్ పట్ల ఏహ్యకరమైన భాషను సైతం వాడటానికి సంకోచించలేదు. కశ్మీర్ అంశంపై ప్రపంచం తగిన విధంగా భారత్ పట్ల స్పందించని పక్షంలో రెండు దేశాలు సైనిక పోరాటానికి దగ్గరవుతాయంటూ హెచ్చరించారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి ఇమ్రాన్ ఖాన్‌తో గొంతు కలిపినా, కశ్మీర్ వివాదానికి యుద్ధం పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ భారత, పాకిస్తాన్ల అక్టోబర్ లేదా నవంబరు నెలలో యుద్ధం సంభవిస్తుందని అన్నారు. ఈ అర్థంలేని వ్యాఖ్యలు కశ్మీర్‌పై భారత్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి పాకిస్తాన్ ఎంత తీవ్ర భంగపాటుకు గురైందో స్పష్టంచేస్తోంది.

కశ్మీర్ వివాదానికి సంబంధించి అంతర్జాతీయ కమ్యూనిటీ కలుగజేసుకునేలా పాకిస్తాన్ అన్ని ప్రయత్నాలు చేసినా వారి నుంచి చేదు అనుభవాన్నే అది చవిచూసింది. ఈ అంశం పరంగా పాక్ ప్రయత్నాలన్నీ వైఫల్యం చెందాయి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ దేశాలు కశ్మీర్‌పై స్పందిస్తూ ఇది పూర్తిగా భారత అంతర్గత విషయమని వ్యాఖ్యానించాయి. బయటశక్తుల జోక్యాన్ని అవి అంగీకరించలేదు. అన్ని క్లిష్ట సమయాల్లోనూ పాకిస్తాన్‌కు అండగా నిలిచే చైనా సైతం బహిరంగంగా కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌కు మద్దతు పలకకపోవడం గమనార్హం. అయినప్పటికీ, శుక్రవారం ఒక గంట పాటు ఇమ్రాన్ ఖాన్ దేశంలో స్తబ్దపరిస్థితిని ప్రకటించారు. కానీ అది కాస్తా ‘ఫ్లాప్ షో’ అయింది. ఇమ్రాన్ ప్రకటించిన ఈ ప్రదర్శనకు ఎక్కువ మంది పాకిస్తాన్ ప్రజలు హాజరుకాలేదు.

కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుకువెడతామంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు కూడా. అలాగే ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్‌కు కూడా తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని శాశ్వత సభ్య దేశాలు భారత్‌కు అనుకూలంగా తమ అభిప్రాయాన్ని విస్పష్టంగా ప్రకటించాయి.

దీంతో పాకిస్తాన్ నాయకత్వం తీవ్ర భంగపాటుకు గురైంది. అంతేకాదు ఈ అంశంపై భారత్‌తో చర్చలు నిర్వహించడానికి సంబంధించి పాకిస్తాన్ నాయకత్వం రెండుగా చీలింది కూడా. భారత్‌తో చర్చలు జరపడం అనేది ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వదని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ వచ్చారు. విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి యు టర్న్ తీసుకున్నారు. భారత్‌తో చర్చలకు పాకిస్తాన్ ఎప్పుడైనా సిద్ధమేనన్నారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ భారత్‌తో ఇస్లామాబాద్ చర్చలకు సిద్ధంగా ఉందంటూ వచ్చిన మీడియా వార్తలను ఖండించాల్సి వచ్చింది.

భారత్, ఇతర దేశాల పట్ల ఇస్లామాబాద్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా అనుసరిస్తున్నంత కాలం ఆ దేశంతో చర్చలను పున: ప్రారంభించే విషయంలో భారత నిర్ణయం మారదని స్పష్టం చేసింది. భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి డా. ఎస్. జైశంకర్ మాట్లాడుతూ ఉగ్రవాదం, హింసకు తావులేని వాతావరణంలో కశ్మీర్ అంశం తప్ప మిగతా అన్ని అంశాలపై పాకిస్తాన్‌తో భారత్ చర్చలకు సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.

పాకిస్తాన్ మాత్రం తన ప్రయత్నాలను ఆపలేదు. ఇతర దేశాల నుంచి మద్దతు సంపాదించడానికి తన కృషి చేస్తూనే ఉంది. ఇస్లామిక్ దేశాల నుంచి మద్దతు కోసం కూడా తన ప్రయత్నాలను ఆపకుండా కొనసాగిస్తూనే ఉంది. ఈమధ్య కాలంలో సౌదీ ఆరబ్, కువైత్‌లతో పాక్ నిత్యం సంప్రదింపులు చేస్తోంది. ముఖ్యంగా కశ్మీర్‌లో మానవ హక్కుల అతిక్రమణ ఆరోపణలను చేస్తోంది. కానీ నిజం ఏమిటంటే, కీలక ప్రభావాన్ని చూపే కొన్ని ఇస్లామిక్ దేశాలు కశ్మీర్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన్ని సత్కరించడం, పౌర అవార్డులతో సన్మానించడం జరిగింది. యుఎఇ కేవలం కొన్ని రోజుల క్రితమే తమ దేశ ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ అవార్డుని ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. తద్వారా ఎమిరేట్స్ భారత్‌తో సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తోందని పరోక్షంగా వెల్లడించింది. పాకిస్తాన్ నాయకులు సృష్టిస్తున్న కలగాపులగం పరిస్థితులకు లొంగేది లేదని కూడా స్పష్టం చేసింది.

పాకిస్తాన్‌కు చెందిన సీనియర్ లామేకర్ ఒకరు స్పందిస్తూ ‘ ఇస్లామిక్ ఉమ్మా బుడగ పగిలింది’ అని వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశంపై భారత ప్రభుత్వం తీసుకున్న చర్యపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ నిశ్శబ్దాన్ని కొనసాగించడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఒఐసికి చెందిన కొన్ని ‘స్టాల్‌వార్ట్స్’ చర్యలు, మరీ ముఖ్యంగా గల్ఫ్ ఆరబ్బులు కూడా కశ్మీర్ స్వతంత్రప్రతిపత్తిని ఢిల్లీ కొట్టివేయడంపై నిశ్శబ్దంగా ఉండడాన్ని సైతం ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

కశ్మీరులో మానవహక్కుల ఉల్లంఘన గూర్చి పాకిస్తాన్ ఎత్తే హక్కు లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అంత్యంత అనాగరిక రీతిలో తమ దేశంలోని బెలూచిస్తాన్, కైబర్-ఫక్తూన్‌ఖ్వా ప్రాంతాలలో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. అంతేకాదు పాక్ ఆక్రమిత కశ్మీరులో (పివొకె) కూడా మానవహక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్ స్థానిక వాస్తవ పరిస్థితులను గుర్తించాలి. అందుకు తగిన విధంగా తన చర్యలను సరిదిద్దుకోవాలి. అంతేతప్ప భారత వ్యతిరేక గొడవలను రేకెత్తించడంపై తన శక్తిసామర్థ్యాలను వృథా చేసుకోరాదు. పొరుగుదేశాలైన ఈ రెండూ స్నేహసంబంధాలను పాటించడం ద్వారా మాత్రమే వాటి మధ్య ఉన్న పలు ముఖ్యమైన అంశాలపై పరిష్కారాలు సాధించగలుగుతాయి.


రచన: అశోక్ హాండూ, రాజకీయ వ్యాఖ్యాత

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం