రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తున్న పాకిస్తాన్
ప్రస్తుతం పాకిస్తాన్ గందరగోళ స్థితిలో ఉంది. జమ్ము,కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం దాన్ని తీవ్ర సందిగ్ధ పరిస్థితిల్లోకి నెట్టింది. ప్రతి గ్లోబల్ దేశమూ పాకిస్తాన్ వైఖరి పట్ల అసంతృప్తిగానే ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా జమ్ము,కశ్మీర్‌కు చెందిన భారత రాజ్యాంగంలోని 370 అధికరణ రద్దు భారత అంతర్గత విషయంగా అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఈ అంశంపై మద్దతు కోసం ప్రపంచదేశాలన్నింటినీ కలిసి ప్రయత్నిస్తోంది. కానీ ఈ విషయంలో పాక్ చేస్తున్న ప్రయత్నాలనీ అంతుచిక్కకుండా ఉన్నాయి.
ఒక ప్రైవైటు టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ పాకిస్తాన్ భారత్‌పై సంప్రదాయ యుద్ధం నెగ్గే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు భారత్ నుంచి అణు ప్రమాదం పొంచి ఉందంటూ ఇమ్రాన్ ఖాన్ పునరుద్ఘాటించారు. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయంగా అన్ని దేశాలూ దృష్టి పెట్టాలన్నారు. భారత అణుకార్యకలాపాలపై ప్రపంచం దృష్టి సారించకపోతే తర్వాత తలెత్తే అనూహ్య విపత్తులకు ప్రపంచదేశాలు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. అంతేకాదు పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని ప్రపంచానికి స్పష్టేంశానని అన్నారు. అదే సమయంలో తమ దేశ భద్రత, రక్షణ, సమగ్రతలకు ముప్పు వాటిల్లుతుందని భావించిన పక్షంలో ఊరికునే ప్రసక్తి లేదని ఈ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ స్పష్టంచేశారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిధులు అందజేస్తుందన్న కేసులో పాకిస్తాన్‌ని బ్లాక్‌లిస్టులో ఉంచే అంశాన్ని ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) చేపట్టిన పక్షంలో రానున్న నెల నుంచి ఇస్లామాబాద్ కష్టాలు చెప్పనలవి కాదన్నది నిజమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ అంగీకరించారు. ప్రపంచం మొత్తం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయాలని కుట్రపన్నుతోందంటూ ఇమ్రాన్ ఆరోపించారు. భారత్‌తో సంభాషణలకు తాను చేస్తున్న కృషి, ప్రయత్నాలను కూడా ఇమ్రాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇవన్నీ సత్యదూరాలు. 2016 జనవరిలో పఠాన్‌కోటు సైనిక స్థావరంపై వైమానిక దాడి జరిగినప్పటి నుంచి భారత్ ఉగ్రవాదం, చర్చలు ఒకే సమయంలో కొనసాగే విషయం కాదని స్పష్టం చేస్తూ వస్తోంది. నిజానికి న్యూఢిల్లీ ఎన్నోమార్లు పాకిస్తాన్ పట్ల సుముఖంగా స్పందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ భారత్ స్నేహ హస్తం అందించాలని ప్రయత్నించినపుడల్లా పాకిస్తాన్ నుంచి ఏదో రకమైన ఇబ్బంది ఎదురైంది. ఇపుడు ఇస్లామాబాద్ గొంతుచించుకున్నా వినే నాధుడే కరవయ్యాడు. పాక్ మాటలు ఏ దేశమూ ఆలకించడానికి సంసిద్ధంగా లేదు.
కశ్మీర్ అంశంపై పాక్ ఏకాకి అయింది. కారణం అది అనుసరించిన మోసపూరిత విధానాలు. పాక్ ఉగ్రవాద బృందాలకు నిధులు అందివ్వడంతో పాటు శిక్షణ కూడా దాదాపు మూడు దశాబ్దాలుగా ఇస్తోంది. అలా జమ్ము-కశ్మీర్ పరంగా పాకిస్తాన్ పరోక్ష యుద్ధం భారత్‌తో చేస్తోంది. పాకిస్తాన్ పాల్పడుతున్న సరిహద్దు ఉగ్రవాద దాడుల్లో ఎంతోమంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు పాకిస్తాన్ తన ప్రయత్నాలు వైఫల్యం చెందడంపై తోడేలు ఏడ్పులు ఏడ్చినా ప్రయోజనం లేదు.
పాకిస్తాన్‌లో తన టెలివిజన్ ఇంటర్వ్యూ పూర్తయిన వెంటనే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాకు చెందిన గ్జిజియాంగ్ ప్రాంతంలోని యుఘర్ ముస్లిం కమ్యూనిటీ నుంచి పలు ప్రశ్నలను ఎదుర్కొన్నారు. వరల్డ్ యుఘర్ కాంగ్రెస్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ మీద విమర్శల దాడి కురిపించింది. ఇమ్రాన్ ఖాన్ రెండు నాల్కుల ధోరణిపై తీవ్రంగా వారు ధ్వజమెత్తారు. అంతేకాదు చైనాలోని యుఘర్ ముస్లిం కష్టాల పట్ల శీతకన్ను వేయడాన్ని ప్రశ్నించారు. అంతేకాదు ఈ విషయంపై పాకిస్తాన్ మౌనంగా ఉండడమే కాదు అక్కడి ముస్లిం కమ్యూనిటీపై బీజింగ్ విధానాన్ని పాక్ మధ్దతునివ్వడాన్ని తీవ్ర అవమానంగా యుఘర్ ముస్లిం కమ్యూనిటీ ఇమ్రాన్‌ని తీవ్రంగా దుయ్యబట్టింది.
రెండు నెలల క్రితం జరిగిన ఒక సమావేశంలో అంతర్జాతీయ జర్నలిస్టులు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడుతూ యుఘర్ అంశంపై ప్రశ్నించారు. దానికి ఇమ్రాన్ స్పందిస్తూ ఈ విషయం తనకు తెలియదన్నారు. దాని గురించిన అవగాహన లేదన్నారు. యుఘర్ ముస్లింలకు చైనా ప్రభుత్వం చేస్తున్న అన్యాయం అంతా కూడా పాక్ ప్రధానికి తెలుసు. కానీ యుఘర్ కమ్యూనిటీ బాధల గురించి చైనాతో ప్రధాని ఇమ్రాన్ మాట్లాడదలచుకోలేదు అని యుఘర్ కమ్యూనిటీ అధ్యక్షుడు దోలక్కమ్ ఇసా జనీవాలో వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్‌లో మానవహక్కుల అతిక్రమణ సమస్య చాలా పెద్ద సమస్య. అంతర్జాతీయంగా అసలు సత్యం బయటపడకుండా చైనా దాస్తోందని కూడా యుగర్ కమ్యూనిటీ అధ్యక్షుడు ఇసా వ్యాఖ్యానించారు.
మరోవైపు చైనా యుఘర్ నిర్భంధ క్యాంపులను వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లుగా పేర్కొంటోంది. యుఘర్ యాక్టివిస్టు ఒకరు మాట్లాడుతూ ‘ఇది పూర్తిగా అబద్ధం. చైనా అసలు విషయం బయటకు రాకుండా దాస్తోంద’న్నారు. ఇసా మాట్లాడుతూ అవకాశం దొరికితే చాలు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ సమస్యను లేవనెత్తుతుంటారని అన్నారు. యుఘర్ ముస్లిం కమ్యూనిటీ విషయం వచ్చేసరికి ఆయన కళ్లు మూసుకుని గుడ్డిగా చైనా విధానాన్ని సమర్థిస్తారన్నారు. ఇది పాకిస్తాన్ రెండు నాల్కుల ధోరణిని ప్రతిఫలిస్తోంది. ఈ ప్రవర్తన ఎంతో అవమానకరం.
కశ్మీరీ ప్రజలకు తను స్నేహితుడనని ఇమ్రాన్ నిరాశాచేతనతో చెప్పుకుంటున్నారు. ఇమ్రాన్ వైఖరి పట్ల బెలూచ్ ప్రజలు కూడా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కేవలం గత వారమే, జనీవాలో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బెలూచిస్తాన్ నాయకులు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా బెలూచిస్తాన్‌లో పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టారు. అయినప్పటికీ పాకిస్తాన్ కశ్మీర్ ప్రజల మానవ హక్కుల రక్షణ గురించి అంతర్జాతీయ కమ్యూనిటీని ఆశ్రయించడం విచిత్రం అని బెలూచ్ యాక్టివిస్టు మెహ్రాన్ మర్రి విమర్శించారు.
పరిస్థితులను గమనిస్తుంటే పాకిస్తాన్ బాధలు ఇంకా కొనసాగేలానే ఉన్నాయి. ఎందుకంటే రెండు నాల్కుల ధోరణితో, స్వంత లక్ష్యాలతో పాక్ వ్యవహరించడమే ఇందుకు కారణం.
రచన: కౌశిక్ రాయ్, ఎఐఆర్: వార్తా విశ్లేషకులు
Comments
Post a Comment