యుఎన్‌హెచ్‌సిఆర్ 42వ సమావేశాన్ని బలంగా ఖండించిన భారత్

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ 42వ సమావేశంలో కశ్మీర్‌పై తీర్మానాన్ని చేపట్టడానికి పాకిస్తాన్ విదేశాంగమంత్రి షా మెహ్‌మూద్ ఖురేషి తీవ్రంగా ప్రయత్నించారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని చూశారు. కానీ ఆయన ప్రయత్నాలు వైఫల్యం చెందాయి. ఈ అంశంపై మొత్తం బృందంలోని 47 సభ్య దేశాలలో 27 దేశాల మధ్దతు పాకిస్తాన్‌కు అవసరం. ఇందుకోసం పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నాలు చేసింది కూడా. కనీసం ఈ అంశంపై యుఎన్‌హెచ్ఆర్‌సిలో అత్యవసర చర్చ అభ్యర్థనకు కూడా పాకిస్తాన్‌ మద్దతు కూడగట్టడంలో వైఫల్యం చెందింది. సమావేశంలో ఎప్పుడైనా కూడా చర్చను కోరవచ్చు. కశ్మీర్ అంశంపై చర్చా అభ్యర్థన దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబరు 19. జెనీవాకు మంత్రిని భారత్ పంపించదలచుకోలేదు. ఈ చర్య జనీవా చర్చకు భారత్ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విషయాన్ని సూచిస్తోంది. కానీ పాకిస్తాన్ ప్రతిపాదనా ప్రయత్నాలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవన్నీ ‘తప్పుడు ఆరోపణలు’గా, ‘కుట్రపూరిత ఆరోపణలుగా’ అభివర్ణించింది.


పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ మరో పర్యాయం కశ్మీర్ అంశాన్ని ఎత్తడానికి ప్రయత్నించారు. అక్కడ తీవ్ర మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. వాటిపై ఐక్యరాజ్యసమితి జాయింట్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించాలని ఖురేషి డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ప్రయత్నాలను భారత్ శక్తివంతంగా తిప్పిగొట్టింది. కశ్మీర్ భారత అంతర్గత విషయమని పునరుద్ఘాటించింది. కశ్మీరీ ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుకని ఆంక్షలను అక్కడ విధించినట్టు వివరించింది. పాకిస్తాన్‌పై భారత ప్రతినిధులు విమర్శల దాడి చేశారు. ఉగ్రవాదం వల్ల ఎంతటి తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందో తెలుసా అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా కౌన్సిల్ సభ్యులు మాట్లాడాలని భారత్ కోరింది.

భారత దౌత్యప్రతినిధి విజయ్ థాకూర్ సింగ్ సారథ్యంలో పాకిస్తాన్ మాజీ రాయబారి అజయ్ బిసారియా, పాకిస్తాన్ భారత రాయబారి రాజీవ్ ఛాందర్, జనీవాలోని ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత ప్రతినిధి పాకిస్తాన్‌పై ఘాటైన విమర్శలు సంధించారు. ‘‘ ఇక్కడి ఒక దేశ ప్రతినిధి బృందం తప్పుడు వాదనలతో, కుట్రపూరిత ఆరోపణలను నా దేశంపై చేస్తోంది. ఈ కల్పిత ఆరోపణల కథలకు గ్లోబల్ తీవ్రవాదం మూలం అనే విషయం ప్రపంచానికి స్పష్టంగా తెలుసు. ఉగ్రవాదానికి కారకులైన పెద్ద నాయకులు ఎక్కడ ఆశ్రయం పొందుతున్నారో కూడా ప్రపంచానికి తెలుసు. ఈ దేశం దౌత్యవిధానానికి బదులు ఎన్నో ఏళ్లుగా సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోంది’’ అని విమర్శించారు. మొత్తం మీద భారత ప్రతినిధులు పాకిస్తాన్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలను విజయవంతంగా లేవనెత్తి పాక్‌పై బలమైన విమర్శలను చేసింది. అంతేకాదు సరిహద్దు తీవ్రవాదం పాకిస్తాన్ నుంచే చెలరేగుతోందని కూడా భారత ప్రతినిధి బృందం తీవ్రంగా విమర్శలు గుప్పించింది.

భారత్ విషయంలో రెండు సంఘటనలు ఉన్నాయి. మొదటిది పాకిస్తాన్ నుంచి మాజీ న్యాయవేత్త బల్దేవ్ సింగ్ (పాకిస్తాన్ తహ్రిక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ) భారత దేశంలో రాజకీయ ఆశ్రయాన్ని కోరారు. ఒక మీడియా ప్రకటనలో, పాకిస్తాన్‌లో మైనారిటీల స్థితిగతులను సింగ్ వివరించారు. హిందువులు ఒక్కరే కాదు సిక్కులు కూడా పాకిస్తాన్‌లో తీవ్ర హింసకు గురవుతున్నారన్నారు. చివరకు ముస్లింలు కూడా ఆ దేశంలో సురక్షితంగా లేరన్నారు. రెండవ ఘటన ఏమిటంటే వరల్డ్ సింధి కాంగ్రెస్ జెనీవాలో యుఎన్‌హెచ్ఆర్‌సి ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించింది. అలా అంతర్జాతీయ దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సింధ్‌, బెలూచిస్తాన్, ఖైబర్-ఫఖ్తున్‌ఖవాలలో మానవ హక్కుల ఉల్లంఘన ఎంత తీవ్రంగా జరుగుతోందో తమ ప్రదర్శన ద్వారా ప్రపంచానికి చాటిచెప్పడానికి ప్రయత్నించింది.

యుఎన్‌హెచ్‌సిఆర్ సమావేశం ముందరే జెఇఎం ఉగ్రవాద నాయకుడు మసూద్ అజ్హర్‌ను పాకిస్తాన్ విడుదల చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదులను ప్రేరేపించేలా, భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్‌లో యుద్ధానికి సంసిద్ధం చేయాలని చూస్తోంది. పాకిస్తాన్ రెండంచెల వ్యూహాన్ని అనుసరించాలని భావిస్తోంది. ఒకటి రాజస్తాన్-సియాల్‌కోట్ సెక్టర్ పొడుగుతా సైన్యాన్ని పెంచడం, రెండవది జమ్ము, కశ్మీర్‌లలో ఉగ్రవాదుల చొరబాటుకు ప్రయత్నించడం. ఇదంతా యుఎన్‌హెచ్‌సిఆర్ సమావేశానికి ముందే ప్రారంభించింది. ప్రపంచ దృష్టి కశ్మీర్‌పై పడేలా చేయాలని పాక్ అన్నిరకాలుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకూ అంతర్జాతీయ సమాజం భారత వెన్నంటే ఉంది. భారత్‌కే మద్దతు ఇస్తోంది. పాకిస్తాన్ లేవనెత్తుతున్న అంశాలను ప్రశ్నిస్తోంది.

యుఎన్‌హెచ్‌సిఆర్ సమావేశంలో పాకిస్తాన్ వైఫల్యం చెందింది. పాక్ నిరాటంకంగా ఉగ్రవాదానికి మద్దతు నివ్వడం వల్ల దాని పరిస్థితి మరింత బలహీనపడుతోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సెప్టెంబరు 27న ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్నారు. అన్ని అంతర్జాతీయ వేదికల మీద కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ అస్థిరతకు పాక్ పూనుకుంటోంది. మరోవైపు భారత్ మాత్రం నిశ్శబ్దంగా తన వైపు నుంచి అంతర్జాతీయ మద్దతును వ్యూహాత్మకంగా వర్కవుట్ చేసుకుంటోంది. పాకిస్తాన్ వైఫల్యాలు చవిచూసినా కశ్మీర్‌పై తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. తిరిగి మిలిటెన్సీని ప్రోత్సహిస్తోంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సెప్టెంబరు 13న (శుక్రవారం) ముజాఫరాబాద్ (పివొకె)లో పెద్ద బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అందులో దిగ్భంధానికి లోనైన జమ్ము, కశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ ప్రసంగిస్తారు. అక్టోబరులో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్కు ఫోర్సు (ఎఫ్ ఎ టి ఎఫ్సమావేశం జరగడానికి ముందుగా పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులోకి వెళ్లేలా భారత్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రచన: డా. జైనాబ్ అఖ్తర్, పాకిస్తాన్ వ్యవహారాల విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం