ఇరకాటంలో పాకిస్తాన్

భారత జమ్ము , కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఇరకాటంలో పడింది. భారత్ రాజ్యాంగంలోని 370వ అదికరణం కొట్టివేసిన నాటి నుంచి పాకిస్తాన్ పరిస్థితి గందరగోళంలో ఉంది. భారత రాజ్యాంగంలోని 370వ అదికరణం జమ్ము,కశ్మీరుకు స్పెషల్ స్టాటస్‌ను ఇచ్చే అధికరణం. ఈ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని పాకిస్తాన్ చేయని ప్రయత్నం లేదు. అంతేకాదు ఇరుదేశాల మద్య యుద్ధపరిస్థితులను ఇస్లామాబాద్ కోరుకుంటోంది. కానీ పాకిస్తాన్ ప్రయత్నాలు ఫలించలేదు. అంతర్జాతీయ కమ్యూనిటీ పాకిస్తాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రతిస్పందంచలేదు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ప్రగాఢ మిత్రులుగా భావించే ఎంతో శక్తివంతమైన మధ్య ప్రాచ్యం, పశ్చిమ ఆసియా దేశాలలో కూడా ఇండియా జమ్ము, కశ్మీర్ విషయంపై భారత్ తీసుకున్న నిర్ణయం పరంగా ఎలాంటి స్పందన రాలేదు. కశ్మీర్ విషయంలో తొలిసారి ఇస్లామిక్ ‘ఉమ్మా’ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా మౌనంగా ఉండడం ఇదే తొలిసారి. కొన్ని కీలక దేశాలు, అంతర్జాతీయంగా ప్రముఖంగా వ్యవహరిస్తున్న దేశాలు కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం న్యూఢిల్లీ ఆంతరంగిక వ్యవహారమని వ్యాఖ్యానించాయి.

టర్కీ, మలేసియాలు మాత్రమే పాకిస్తాన్ వేదనను ఆలకించాయి. పరారీలో ఉన్న భారత దేశానికి చెందిన జాకిర్ నాయక్ కౌలాలంపూర్ సమాజంపై చేసిన వ్యాఖ్యలపై అక్కడ తీవ్ర వ్యతిరేకత తలెత్తింది. ఫలితంగా జాకిర్ నాయక్‌పై బహిష్కరణ వేటు వేయడమే కాకుండా, అక్కడి డా. మహాథిర్ మొహమ్మద్ ప్రభుత్వం జమ్ము, కశ్మీర్ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఇష్టపడలేదు.

ఇదే కాకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ మరో పరాభవం ఎదుర్కోవలసి వచ్చింది. అందులో జమ్ము, కశ్మీర్ విషయంలో చైనా, పాకిస్తాన్ ఎత్తులను ఐక్యరాజ్యసమితి అంగీకరించలేదు. దీంతో ప్రస్తుతం ఇస్లామాబాద్ ప్రభుత్వం తన ఈ అంశంపై రాద్ధాంతం సృష్టిస్తూ దేశ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రజలు కశ్మీరుకు అండగా ఉంటారంటూ వ్యాఖ్యానించారు. కానీ.. ఏ కశ్మీర్ అనే విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ స్పష్టంగా చెప్పలేకపోయారు. పాకిస్తాన్ ప్రధాని పవిత్రయుద్ధానికి (జీహాద్) కూడా పిలుపునిచ్చారు. ఇమ్రాన్ మంత్రివర్గంలోని సభ్యుడు, పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ మాట్లాడుతూ ఇండియా, పాకిస్తాన్ల మధ్య అక్టోబరులో యుద్ధం జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో మరో మాట కూడా పాకిస్తాన్ రైల్వే మంత్రి వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్య ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ సైనిక అధికారి జనరల్ బజ్వా అధికారంలో ఉండగా పరిష్కారం అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ మాటలన్నీ కూడా పాకిస్తాన్ ఎంత పగటి కలల్లో బతుకుతోందో స్పష్టంచేస్తున్నాయి.

ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా పాకిస్తాన్ నాయకత్వం యొక్క మానసిక పరిస్థితిని, ఆలోచనలను తేటతెల్లంచేస్తున్నాయి. జమ్ము, కశ్మీర్ 1947లో భారత్‌లో కలిసిన నాటి నుంచి అది భారత్ నుంచి విడదీయలేని, అంతర్గతమైన అంశం అయింది. చట్టరహితంగా 13 వేల చదరపుకిలోమీటర్ల భారత భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. అందులో కొంత ప్రదేశం చట్టవిరుద్ధంగా చైనా ఆక్రమణలోకి వెళ్లింది. పాకిస్తాన్ దురాక్రమణ చేసిన ప్రాంతాన్ని భారతదేశానికి తిరిగి పాక్ అప్పగించాల్సి ఉంది. అంతేకాదు ఒక్క పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పివొకె) మీద తప్ప కశ్మీర్‌పై ఎలాంటి చర్చలకు తావులేదు.

ఈ విషయాన్ని పాకిస్తాన్‌కు భారత్ స్పష్టంచేసింది. భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత్ ఏ విషయంపైనా పాకిస్తాన్‌తో చర్చించడానికి సిద్ధంగా లేదన్నారు. ఒకవేళ ఏవైనా చర్చలు చోటుచేసుకున్నా కూడా దానికి ముందు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించాలన్న తన విదేశీ విధానాన్ని పాకిస్తాన్ వదలాలని కూడా రాజ్ నాథ్ స్పష్టం చేశారు.

పాకిస్తాన్ చేస్తున్న వ్యాఖ్యల్లో పరిణితి లేదని భారత్ అభిప్రాయపడింది. పాకిస్తాన్ వ్యవహార తీరు శత్రుత్వంతో, రెచ్చగొట్టే విధంగా, బాధ్యతారాహిత్యంగా ఉందని భారత్ అభిప్రాయపడింది. పాకిస్తాన్ ప్రదర్శిస్తున్న ఈ ధోరణి భారత అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనని పదునుగా వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ అత్యున్నత అధికారి చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అంతేకాదు అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో తన సంబంధాలను పాకిస్తాన్ తెంచుకోవాలని భారత్ స్పష్టంచేసింది. ఉగ్రవాదకార్యకలాపాలకు పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకోవాలని అభిప్రాయపడింది.

పాకిస్తాన్ ప్రస్తుతం ఎలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఉందో యావత్ ప్రపంచానికీ తెలుసు. ముఖ్యంగా ఆర్థికంగా ఆ దేశంలో పరిస్థితులు ఏమాత్రం బాగా లేవని వార్తలు సూచిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం పెండింగ్ ఎలక్ట్రిసిటీ బిల్లుల సమస్యను ఎదుర్కొంటోంది. బిల్లులు కట్టని పక్షంలో ప్రధానమంత్రి సెక్రటేరియట్‌కు కరెంట్ కోత తప్పదని సాక్షాత్తు ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ హెచ్చరించింది. ఇలాంటి సంఘటన, పరిస్థితి పాకిస్తాన్‌లోనే తలెత్తే అవకాశం ఉంది.

ప్రతి సేవలకి చెల్లించాల్సిన దానికన్నా కూడా అదికంగా సామాన్య ప్రజలనుంచి లాగాలని పాకిస్తాన్ ప్రజలపై ఒత్తిడి తెస్తోంది. ఐఎంఎఫ్ బైల్‌-అవుట్ పాకిస్తాన్ మీద కఠిన పరిమితులను విధించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ప్రస్తుతం ఉగ్రవాదులకు నిధులను పాకిస్తాన్ ఎవరికి అందిస్తోందో డేగకళ్లతో పరిశీలిస్తున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు (ఎఫ్ఎటిఎఫ్), అలాగే ఎఫ్ఎటిఎఫ్‌కు చెందిన ఆసియా ఫసిఫిక్ గ్రూప్ నివేదికల్లో 40 అంశాలలో 32 అంశాల పరంగా పాకిస్తాన్ వైఫల్యం చెందిందని పేర్కొంది. దానిని ఆధారం చేసుకుని పాకిస్తాన్ మీద ఆ సంస్థ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎఫ్ఎటిఫ్ ‘గ్రే లిస్టు’లో ఇప్పటికే ఇస్లామాబాద్ ఉంది. వచ్చే రెండు నెలల్లో ఈ స్టాటస్ నుంచి ‘బ్లాక్-లిస్టు’ జాబితాలోకి కూడా పాకిస్తాన్ పేరు చోటుచేసుకోవచ్చు. అదే కనుక సంభవిస్తే, పాకిస్తాన్‌కు రుణాలు పుట్టడం చాలా కష్టం. అసలే కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత పెద్ద దెబ్బ అవుతుంది. ఇబ్బందులను సృష్టిస్తుంది.

పాకిస్తాన్ ప్రభుత్వం ఆచితూచి తెలివిగా అడుగులు వేయాలి. తన శక్తియుక్తులను ఉపయోగించి ప్రధానంగా తన దేశ ప్రజలకు అభివృద్ధి చెందిన జీవన శైలిని, నాణ్యమైన జీవన ప్రమాణాలను మొదట అందించాలి. పొరుగుదేశాల ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకునే పనికి స్వస్తి చెప్పాలి.

రచన: జె ఎల్ కౌల్ జలాలీ, రాజకీయ వ్యాఖ్యాత

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన