భారత ప్రధాని యుఎఇ, బహ్రైన్ పర్యటనలతో మరింత శక్తివంతమైన ద్వైపాక్షిక సంబంధాలు

వారాంతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ యుఎఇ, బహ్రైన్‌లలో పర్యటించారు. గత నాలుగు సంవత్సరాల కాలంలో యుఎఇకి భారత ప్రధాని నాల్గవ పర్యాయం పర్యటించారు. అలాగే బహ్రైన్‌లో తొలిసారి పర్యటించిన భారత ప్రధాని కూడా మోదీనే. అరబ్ గల్ఫ్ దేశాలతో భారత్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలు బాగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ పర్యటనలు చోటుచేసుకున్నాయి. యుఎఇలో క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబు ధాబి మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్-నహ్యాన్‌ను ప్రధాని మోది కలిశారు. ఆయనతో రెండు దేశాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మోదీ చర్చలు జరిపారు. ప్రధాని మోదీకి యుఎఇ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పౌర అవార్డు ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ను ఒక సమావేశంలో ప్రదానం చేసింది. మోదికి ఈ అవార్డును 2019 ఏప్రిల్‌లో ప్రదానం చేశారు. భారత్, యుఎఇల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడానికి మోది చేసిన కృషికి, ఆయన అత్యున్నత నాయకత్వ పరిణతికి ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు.

భారత ప్రధాని యుఎఇలో రుపె కార్డును ప్రారంభించారు. పశ్చిమాశియాలో చెల్లింపుల కోసం దేశీయ ఇండియన్ కార్డును ప్రారంభించిన తొలి దేశం యుఎఇ. సింగపూర్, భూటాన్ దేశాల తర్వాత దీన్ని తన దేశంలో ప్రారంభించిన మూడవ దేశం. రుపె కార్డు పరంగా పరస్పర అవగాహనా ఒప్పందం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ), మెర్క్యురీ పేమెంట్స్ సర్వీసెస్ ఆఫ్ యుఎఇల మధ్య కుదిరింది. ఇరుదేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. పేమెంట్ ప్లాట్‌ఫామ్స్‌ పరంగా టెక్నాలజీ వినియోగాన్ని ఏర్పరచేందుకు ఈ ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం భారత ప్రధాని మోదీ సమక్షంలో జరిగింది. అప్పుడు స్పెషల్ పర్చేస్ ఆఫరింగ్ కింద ఈ కార్డును బహ్రైన్‌లోని శ్రీనాథ్‌జీ దేవాలయంలో ప్రధాని ప్రారంభించారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీకి బహ్రైన్ ప్రభుత్వం సాదర ఆహ్వానాన్ని పలికింది. అంతేకాదు ఆ దేశ ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ రినైజాన్స్’ అత్యున్నత పౌర అవార్డును ప్రదానం చేసింది. అవార్డును అందుకున్న సందర్భంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ అవార్డు ఇరుదేశాల మధ్య వేల ఏళ్ల నుంచి కొనసాగుతున్న సన్నిహిత స్నేహ సంబంధాలకు గుర్తుగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ గౌరవార్థం బ్రహైన్ కింగ్ హమద్ బిన్ ఇసా ఆల్-ఖలిఫా విందును ఏర్పాటుచేశారు. బహ్రైన్ ప్రధాని ఖలిఫా బిన్ సల్మాన్ ఆల్-ఖలీఫాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు పరస్పర ప్రయోజనాలతో కూడిన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను కూడా విస్తృతస్థాయిలో చర్చించారు

ప్రధాని మోదీ డిప్యూటీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ బ్రహ్రైన్ సల్మాన్ బిన్ హమద్ ఇసా ఆల్-ఖలీఫాలను కలిశారు. ద్వైపాక్షిక సంబంధాల వృద్ధికి సంబంధించి వారితో చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు నాయకులు నిర్ణయించుకున్నారు. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ బహ్రైన్ నేషనల్ స్టేడియంలో 15 వేల మంది భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. బహ్రైన్ ఆర్థికాభివృద్ధిలో భారతీయులు పోషిస్తున్న పాత్రపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు భారత, బహ్రైన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పెరుగుదలలో వారు నిర్వహిస్తున్న కీలకపాత్రను ప్రశంసించారు. బహ్రైన్‌లో 350,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. బహ్రైన్‌లో నివసిస్తున్న ప్రవాసుల్లో మన భారతీయుల సంఖ్యే ఎక్కువగా ఉంది. భారతీయులు బాగా కష్టపడతారనే అభిప్రాయం అక్కడ బాగా ఉంది. అందుకే వారిని ఎంతో గౌరవంగా చూస్తారు. బహ్రైన్ ఆర్థికరంగంలో వారు నిర్వహిస్తున్న కీలకపాత్ర కూడా ఎంతో విస్తృతమైంది.


బహ్రైన్ రాజధాని మనామాను కూడా ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. అక్కడ 200 సంవత్సరాల క్రితం నాటి శ్రీనాథ్ జీ (శ్రీ కృష్ణ) దేవాలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. ఇది గల్ఫ్‌ లోని అత్యంత ప్రాచీన దేవాలయం. ఆ దేవాలయ పునరుద్ధరణా ప్రాజెక్టును అక్కడ ప్రారంభించారు. దీని ఖర్చు మొత్తం 4.2 మిలియన్ అమెరికన్ డాలర్లు అవుతుంది. ఇది ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ దేవాలయం బహ్రైన్‌లోని బహుళ సంస్కృతులకు చిహ్నం. ప్రధాని ఈ దేవాలయ గొప్పతనానికి ఎంతో ముగ్ధులయ్యారు. దేవాలయాన్ని చూసి ఆనందించారు.

భారత ప్రధాని గల్ఫ్ లో మూడు రోజులు పర్యటించారు. ఆయన పర్యటన ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రాంతీయ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకుంటున్న తరుణంలో సహజంగానే ప్రధాని మోదీ పర్యటన ఎంతో ముఖ్యమైందిగా చెప్పాలి. అలాగే ఆ ప్రాంతంలో ఉద్రిక్తంగా ఉన్న భౌగోళిక-రాజకీయ పరిస్థితుల వల్ల కూడా ప్రధాని మోదీ పర్యటన ప్రాముఖ్యం సంతరించుకుంది. అన్ని ప్రాంతీయ వివాదాలను సంభాషణల ద్వారా పరిష్కరించుకోవాలన్నది భారత ప్రధాన ఉద్దేశం. గల్ఫ్ లో తలెత్తుతున్న తాజా పరిణామాలను భారత్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే వస్తోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, గల్ఫ్ వాటర్స్‌ లో షిప్పింగ్‌కు సంబంధించి కొనసాగుతున్న కొన్ని వివాదాలను అక్కడ చూస్తున్నాం. గల్ఫ్‌ లో ఏదైనా పెద్ద ప్రతిష్ఠంభన తలెత్తితే అది నేరుగా భారత ఎనర్జీ సెక్యూరిటీపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఆ ప్రాంతంలో ఉంటున్న 8.5 మిలియన్ల ప్రవాస భారతీయులపై ఆ ప్రభావం పడుతుంది. అందుకే అన్ని వర్గాల వైపు నుంచీ నియంత్రణ అత్యావశ్యకమని భారత తరచూ ఉద్ఘాటిస్తూ వస్తోంది.

దక్షిణ ఆషియాలో ఇటీవల తలెత్తిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గల్ఫ్ పర్యటన ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జమ్ము అండ్ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కొట్టివేస్తూ న్యూఢిల్లీ తీసుకున్న నిర్ణయం, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ము,కశ్మీర్‌లతోపాటు లదాక్ కేంద్రపాలితప్రాంతం యంత్రాంగం పరంగా చోటుచేసుకున్న మార్పులపై, ఇది పూర్తిగా భారత అంతర్గత విషయం అయినప్పటికీ, ఇస్లామాబాద్ ఆగకుండా విమర్శలు గుప్పిస్తోంది. కానీ భారత్‌కు యుఎఇ, బహ్రైన్, సౌదీ అరేబియాలతో పాటు గల్ఫ్ ఆరబ్ భాగస్వామ్యపక్షాల నుంచి గట్టి మద్దతు లభించింది.

ప్రధాని గల్ఫ్ పర్యటన వల్ల భారత్, గల్ఫ్ దేశాల మధ్య మరీ ముఖ్యంగా యుఇల లమధ్య రాజకీయ, ఆర్థిక, భద్రతా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. గత ఐదు సంవత్సరాలుగా యుఎఇ పశ్చిమ ఆసియాలో భారత ప్రధాన భాగస్వామిగా ఉంది.

రచన: డా. మొహమ్మద్ ముధ్దాస్సిర్ ఖామర్, పశ్చిమాశియా వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన