భారత విదేశాంగమంత్రి తొలి బంగ్లాదేశ్ పర్యటన

భారత విదేశాంగమంత్రి డా. ఎస్. జైశంకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి బంగ్లాదేశ్ పర్యటన చేశారు. ఇది పూర్తిగా గౌరవపురస్కరమైన పర్యటన మాత్రమే. బంగ్లాదేశ్ షేక్ హసీనా అక్టోబర్ మొదటి వారంలో భారత్‌లో పర్యటన చేస్తున్నారు. భారత్‌లో పర్యటించవలసిందిగా భారత ప్రధాని మోదీ ఆమెను కోరారు. రెండు పొరుగుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపరిచే ముఖ్యమైన చర్య ఇది. 

భారత విదేశాంగమంత్రి బంగ్లాదేశ్ ప్రధానితో జరిపిన సమావేశం ఫలవంతమైంది. అక్టోబర్‌లో రెండు దేశాలకు చెందిన నాయకుల సమావేశానికి అనుకూల వాతావరణం ఏర్పరిచే దిశగా దీన్ని భావించాలి. 

భారత ప్రధాని నరేంద్రమోదీ నుంచి ఆహ్వానపత్రికను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు గనోబాభన్‌లో జరిగిన సమావేశంలో భారత విదేశాంగమంత్రి డా.జైశంకర్ అందజేశారు. గనోభాభన్ హసీనా అధికారిక నివాసం. మోదీ ఆహ్వానం పట్ల షేక్ హసీనా తన కృతజ్ఘతను వెల్లడించారు. 

అక్టోబర్‌లో షేక్ హసీనా భారత పర్యటన పట్ల న్యూఢిల్లీ ఎంతో ఆశావహ దృష్టితో ఉన్నట్టు భారత విదేశాంగమంత్రి తెలిపారు. జైశంకర్, షేక్ హసీనా ఇరువురూ సుహృద్భావ వాతావరణంలో ఫలవంతమైన చర్చలు జరిపారు. వారి చర్చల్లో రెండు దేశాల పరస్పర ప్రయోజనాల గురించి కూడా చర్చించినట్టు భారత విదేశాంగమంత్రి వెల్లడించారు. 

మాజీ దౌత్యవేత్త కూడా అయిన డా. జైశంకర్ గతంలో భారత విదేశాంగ కార్యదర్శి హోదాలో బంగ్లాదేశ్‌లో పర్యటించారు. భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి ఇపుడు తొలిసారి బంగ్లాదేశ్‌లో పర్యటించారు. తన పర్యటనలో బంగ్లాదేశ్ విదేశాంగమంత్రి ఎకె అబ్దుల్ మొమెన్‌తో కూడా ఆయన సమావేశమయ్యారు. 

ఇరుదేశాల విదేశాంగమంత్రుల సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. రెండు దేశాలూ ద్వైపాక్షిక, భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న స్నేహసంబంధాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని రెండు దేశాలూ అభిప్రాయపడుతున్నాయి. అంతేకాదు ఇరుదేశాల అధినాయకుల మధ్య పరస్పర విశ్వాసం పెంపొందేలా కృషిని కొనసాగించాలని భావించాయి. ఇరుదేశాల ప్రాధాన్య అంశాలపై ఆలోచనలు చేయడం, పరస్పరం పంచుకోవడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. 

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం కన్నా కూడా ఉన్నతమైనవి. డాక్టర్ జైశంకర్ మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో విదేశాంగ కార్యదర్శిగా, రెండు దేశాల స్నేహసంబంధాల పరంగా పనిచేయడాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇపుడు భారత విదేశాంగ మంత్రిగా భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాల పెంపుదలకు కృషిచేస్తుండడం పట్ల సంతృప్తిని వ్యక్తంచేశారు. 

‘‘భద్రత విషయానికి వస్తే నేరాలు, ఉగ్రవాదం, తీవ్రవాదం, ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా ఇరుదేశాల భాగస్వామ్యం ఆయా దేశాల ప్రజలకు నేరుగా ప్రయోజనాలను చేకూరుస్తుందని మేము నమ్ముతున్నాం’’ అని జైశంకర్ అన్నారు. ఇంకా మాట్లాడుతూ ఎంతో సంక్లిష్టమైన రొహింగ్యా సంక్షోభం విషయంలో కూడా రెండు దేశాలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని జైశంకర్ అన్నారు. 

బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఎకె అబ్దుల్ మొమెన్ మాట్లాడుతూ ఇతర అంశాలతో పాటు భారత్‌తో రొహింగ్యా సంక్షోభాన్ని వీలైనంత తొందరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని భావించారు. ఎందుకంటే ఇది ముదిరితే ప్రాంతీయ సుస్థిరత దెబ్బతింటుందని మొమెన్ అభిప్రాయపడ్డారు. 

మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ జైశంకర్ బంగ్లాదేశ్ విదేశాంగమంత్రి మొమెన్‌తో ఫలవంతమైన చర్చలు జరిపినట్టు వెల్లడించారు. రొహింగ్యా అంశంపై మాట్లడుతూ ఇండియా, బంగ్లాదేశ్‌లు రెండూ సురక్షితంగా, వేగంగా, సుస్థిరమైన విధానంలో వారిని మయన్మార్‌కు తిరిగి పంపాలన్న దానిపై పరస్పరం అంగీకరించాయి. 

మయన్మార్ సైన్యం రొహింగ్యలపై దాడులకు పూనుకోవడంతో మొత్తం 700,000 మంది రొహింగ్యాలు ఆ దేశం విడిచి పారిపోయారు. వీరిలో చాలామంది బంగ్లాదేశ్‌కు వలసలు వెళ్లి అక్కడ నివసిస్తున్నారు. ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్‌లు రెండూ కూడా రొహింగ్యాలను వీలైనంత వేగంగా మయన్మార్ పంపేదిశగా కృషి చేస్తున్నాయి. 

భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న స్నేహపూరిత సంబంధాలు ఇతర దక్షిణ ఆసియా దేశాలకు ఒక మోడల్ అని డా.జైశంకర్ అభివర్ణించారు. ఈ సంబంధాలు మరింత పటిష్టపడేందుకు పలు కార్యక్రమాలను 2014లో దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత నరేంద్రమోదీ పలు కార్యక్రమాలను చేపట్టారు. మోదీ ఢాకాలో 2015, జూన్‌లో పర్యటించినపుడు రెండు దేశాలు ల్యాండ్ బౌండరీ ఒప్పందాన్ని అమలు చేయాలని అంగీకారానికి వచ్చాయి. ఇది చారిత్రాత్మక పరిణామం అని చెప్పాలి. ఈ సమస్య 41 సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య నలుగుతూ వస్తోంది. 

2017, ఏప్రిల్‌లో ప్రధాని హసీనా న్యూఢిల్లీలో పర్యటించారు. ఆ సమయంలో మొత్తం 22 ఒప్పందాలపై రెండు దేశాల నాయకులు సంతకాలు చేశాయి. వాటిల్లో రక్షణ, అణుశక్తి, సైబర్ సెక్యూరిటీ, , మీడియా వంటివి ఉన్నాయి. భారత్ టు లైన్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఒసిఎస్) కింద మూడు బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన సొమ్మును 2015లో అందించింది. 2017లో 4.5 బిలియన్ అమెరికన్ డాలర్ల సొమ్మును మొత్తం 17 అభివృద్ధి ప్రాజెక్టులకు ఇచ్చింది. అంతేకాదు బంగ్లాదేశ్‌లోని ఓడరేవుల అభివృద్ధికి కూడా నిధులను అందజేసింది. 


ఈ ఏడాది షేక్ హసీనా న్యూఢిల్లీలో పర్యటించే సమయానికి ఒక ప్రత్యేక సందర్భం ఉంది. అప్పడు బంగ్లాదేశ్ జాతిపితగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహ్మాన్ నూరవ శత జయంతి. దీన్ని 2020 సంవత్సరంలో పాటించనున్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరంలో భారత దేశ సైనిక దళాలు వహించిన పాత్ర ఎంతో ప్రముఖమైంది. రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం మంచి స్థితిలో కొనసాగుతున్నాయి. పటిష్టమైన, సుసంపన్నమైన బంగ్లాదేశ్‌ని భారత్ కోరుకుంటోంది. దీనివల్ల దక్షిణ ఆసియా ప్రాంతంలో దీర్ఘకాలిక శాంతి సుస్థిరతల ఏర్పాటును భారత్ ఆశిస్తోంది.
రచన: దీపాంకర్ చక్రవర్తి, స్పెషల్ రిప్రజెంటేటివ్, ది స్టేట్స్ మన్

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన