యుఎన్ఎస్‌సిలో ఏకాకి అయిన పాక్
కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ చేయాలన్న పాక్ ప్రయత్నాలు మరోసారి బెడిసికొట్టాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్ చేసిన ప్రయత్నాలపై ఇసుమంత స్పందన సైతం కరువైంది. తన మిత్రదేశమైన పాకిస్తాన్ కోసం మండలిలోని 15 సభ్యదేశాలతో అత్యవసర సమావేశాన్ని చైనా కోరింది. ఆ సమావేశంలో కేవలం భారత్ జమ్ము-కశ్మీర్‌పై తీసుకున్న అంశంపైనే చైనా చూపు నిలపడం కనిపించింది. మిగతా పెద్ద దేశాలన్నీ కూడా భారత్‌తో ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని కోరాయి. జమ్ము, కశ్మీర్‌కు సంబంధించిన భారత్ రాజ్యాంగంలోని 370వ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత నుంచి పాక్‌కి నిద్రకరువైంది. భారత్ చేపట్టిన ఈ చర్య పాకిస్తాన్ జమ్ము-కశ్మీర్‌పై ఇన్నాళ్లు కొనసాగిస్తూ వచ్చిన పంథాకు అడ్డుకట్టపడింది. జమ్ము, కశ్మీర్‌లకు సంబంధించి తీసుకున్న చర్యలు భారత దేశ అంతర్గత అంశమంటూ కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. దీనిని అమెరికా ప్రభుత్వ యంత్రాంగం కూడా గుర్తించింది. భారత్ తీసుకున్న ఈ చర్య భారత రాజ్యాంగానికి లోబడి ఉందని రష్యా అభిప్రాయపడింది. అంతేకాదు ఈ సమస్యను భారత్, పాక్‌లు ద్వైపాక్షికంగా, రాజకీయంగా, దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని కోరింది. ఈ సమావేశ అనధికార వివరాలను చైనా విడుదల చేయడాన్ని సైతం భద్రతామండలి అడ్డుకుంది. అలా కశ్మీర్‌పై భద్రతామండలి సమావేశం కశ్మీర్ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అక్కడితో ఆపేసింది.
పాకిస్తాన్ అంశాన్ని లేవనెత్తాలంటూ చైనా రాయబారి కోరడాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వినింది కానీ దానిపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. లేక్కచేయలేదు. సమావేశ వివరాలను విడుదల చేయాలంటూ చైనా రాయబారి చేస్తున్న డిమాండును పట్టించుకోలేదు. ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ కశ్మీర్‌పై ఆయన అభిప్రాయాన్ని భద్రతామండలిలోని 15 సభ్యదేశాల అభిప్రాయంగా చెప్పడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రశ్నించారు. భద్రతామండలి దీనిపై ప్రకటనను విడుదల చేస్తుందని పాక్ భావించింది. జమ్ము, కశ్మీర్ సమస్యపై ఆందోళన వ్యక్తంచేస్తారని భావించింది. అంతేకాదు అలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరిస్తూ భారత్ పట్ల కఠిన చర్యలు చేపడుతుందని పాక్ భావించింది. కానీ పాకిస్తాన్ ఈ విషయంలో పూర్తిగా ఒంటరి అయింది. 1971 తర్వాత మళ్లీ కశ్మీర్ అంశం ఐక్యరాజ్యసమితి చర్చల్లో తొలిసారి చర్చకు వచ్చింది. సన్నిహిత సభ్యులతో దీనిపై భద్రతామండలి చర్చించింది. సభ్యుల ఫార్మల్ అభిప్రాయాలు, వివరాలను కూడా అది తీసుకోలేదు. వీటన్నింటిని బట్టి ఇది ఐక్యరాజ్యసమితికి చెందిన అంశం కాదనే అభప్రాయాన్ని స్పష్టంగా వెల్లడిస్తోంది. చైనా ఒత్తిడితో జమ్ము, కశ్మీర్ అంశం భద్రతామండలిలో చేపట్టడం జరిగింది. చైనా గతంలో పాకిస్తాన్ స్థావరంగా ఉంటున్న జైష్-ఇ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశంపై కూడా మోకాలు అడ్డుపెట్టిన విషయం తెలిసిందే. చైనా, పాకిస్తాన్ దేశాలు రెండూ కూడా ఈ విషయంలో పూర్తిగా ఒంటరి అయ్యాయి.
కశ్మీర్ అంశంపై భద్రతా మండలి సమావేశానికి ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయాన్ని మార్చుకునేలా చేయడానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శతవిధాలా ప్రయత్నించారు కానీ పూర్తిగా వైఫల్యం చెందారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమ్రాన్ ప్రయత్నాలకు స్పందిస్తూ పాక్ ఈ విషయాన్ని భారత్‌తో ద్వైపాక్షికంగా పరిష్కరించు కోవాలని విస్పష్టంచేశారు. 1972లో సిమ్లా ఒప్పందం, ఆ తర్వాత 1999 లాహోర్ ప్రకటన భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటుచేసుకోవడంతో సమితి తీర్మానాలు అర్థరహితమని కూడా భద్రతా మండలి సభ్యులు గుర్తించారు. ఈ రెండు ఒప్పందాల అనంతరం కశ్మీర్ అంశంపై మూడవ వ్యక్తి చొరబడే అవకాశమే లేదని భారత్ పలుమార్లు చెబుతూ వచ్చింది కూడా. పాకిస్తాన్‌తో ఏ అంశంపైన అయినా ద్వైపాక్షికంగా చర్చించడానికి భారత్ సిద్ధమని కూడా స్పష్టంచేసింది. కానీ దీనికి ముందు పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతునిచ్చే, దాన్ని భారత్‌కు వ్యతిరేకంగా ప్రయోగించే చర్యలకు స్వస్తిపలకాలని కూడా భారత్ స్పష్టంచేసింది. ఉగ్రవాదం-చర్చలు రెండూ పొసిగేవి కావని కూడా స్పష్టం చేసింది. అంతేకాదు అన్యాయపూరిత డిమాండ్లకు భారత్‌ను వంచాలని పాక్ ఉగ్రవాదం ద్వారా ప్రయత్నాలు చేస్తే తగ్గమని, ఆ ప్రయత్రాలు మొదట ఆపాలని భారత్ విస్పష్టంచేసింది. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్-చైనా ఏకం కావడం చూసి అంతర్జాతీయంగా అన్ని దేశాలు కశ్మీరీ వివాదాన్ని భారత్‌తో దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, అలాగే ఉగ్రవాదానికి పాక్ స్వస్తి చెప్పాలని ప్రపంచ దేశాలన్నీ అభిప్రాయపడుతున్నాయి.
జమ్ము, కశ్మీర్ అంశంపై భారత్ ఏకపక్ష చర్యలను మార్చుకోవాలని చైనా రాయబారి డిమాండ్ చేయడంతో ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారత ఆంతరంగిక వ్యవహారమని , బయట శక్తుల జోక్యం ఉండదని ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధి అక్బరుద్దీన్ స్పష్టంచేశారు. అంతేకాదు ఐక్యరాజ్యసమితి పరిధిలోకి రాని విషయాలను ఈ వేదికపై లేవనెత్తే ప్రయత్నాలను ఆపమని స్పష్టంచేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి స్పందిస్తూ కశ్మీర్‌పై పాకిస్తాన్ చర్యలను,ప్రయత్నాలను స్వీకరించడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరని సమితి భద్రతామండలిలో పాక్ చేసిన ప్రయత్నాలు మరోసారి నిరూపణ అయ్యాయి.
రచన: రంజిత్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్
Comments
Post a Comment