భారత ప్రధాని భూటాన్ పర్యటన: ద్వైపాక్షిక సంబంధాల విస్తరణకు ఎజెండా

ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజులు థింపులో పర్యటించారు. భూటాన్ ప్రధాని డా లొతాయ్ షెరింగ్ ఆహ్వానంపై ప్రధాని మోదీ భూటాన్ సందర్శించారు. ఆయనతోపాటు అత్యున్నతస్థాయి ప్రతినిధివర్గం కూడా థింపు వెళ్లింది. రెండవ పర్యాయం ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలి భూటాన్ పర్యటన ఇది. గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రధాని చేపట్టిన రెండవ భూటాన్ పర్యటన ఇది. రెండవ పర్యాయం అధికారపగ్గాలను చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులు, శ్రీలంకలో పర్యటించారు. పొరుగున ఉన్న రెండు మూడు దేశాలకు ప్రధాని పర్యటన ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ పాలసీకి భారత్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని స్పష్టంచేస్తోంది. 

జమ్ము, కశ్మీర్ (జె అండ్ కె) అంశాన్ని పాకిస్తాన్ అంతర్జాతీయ చేయాలని ప్రయత్నిస్తున్న తరుణంలో దాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో భూటాన్ పర్యటనకు ప్రధాని హాజరవుతున్నారు. జె అండ్ కె ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని ముందే భూటాన్ ఆహ్వానించింది. ఇది ఎంతో సాహసోపేతమైన, ధైర్యవంతమైన, మంచి భవిష్యత్తు దిశగా తీసుకున్న నిర్ణయంగా భూటాన్ అభివర్ణించింది. అంతేకాదు జె అండ్ కె పూర్తిగా భారత్ అంతర్గత అంశమని భూటాన్ గుర్తించింది. 

భారత్‌తో ఉన్న ప్రత్యేక సంబంధం నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు ఆ దేశం ఎంతో అత్యున్నత ప్రాధాన్యాన్ని ఇచ్చింది. మోదీకి భూటాన్ ప్రధాని డా. షేరింగ్ విమానాశ్రయంలో గొప్ప స్వాగతాన్ని ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ రాజు, రాణిలను గౌరవపురస్కరంగా కలిశారు. భారత ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ పాలసీలో భూటాన్ కీలకమైందంటూ ఈ సందర్భంగా ప్రధాని అభివర్ణించారు. 

భూటాన్ ప్రధానితో ప్రతినిధుల స్థాయి సమావేశాన్ని కూడా భారత ప్రధాని నిర్వహించారు. భారత-భూటాన్ భాగస్వామ్యాన్ని వివిధ రంగాలకు విస్తరించడానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఇందులో చర్చించారు. భూటాన్ సీనియర్ రాజకీయ నాయకులతో కూడా ప్రధాని మోదీ సంభాషణలు జరిపారు. వారిలో ప్రతిపక్ష నాయకుడు డా. పేమా గ్యామత్‌షో కూడా ఉన్నారు. భూటాన్ రాయల్ యూనివర్సిటీ విద్యార్థుల నుద్దేశించి కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. 

ఇరుదేశాల మధ్య అత్యున్నతస్థాయి చర్చలను ఈ పర్యటన మరింత వేగవంతం చేసింది. దీనికి ముందు భూటాన్ ప్రధాని షేరింగ్ గత ఏడాది డిశెంబరులో భారతదేశంలో పర్యటించారు. మే, 2019లో నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం, భారత విదేశాంగ వ్యవహారాల శాఖా మంత్రి డా. ఎస్ జైశంకర్ భూటాన్‌కు అధికారిక పర్యటన చేశారు. 

భూటాన్, భారత్‌ల మధ్య 1968 నుంచీ ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి. దక్షిణ ఆసియాలో ఎంతో విజయవంతమైన పొరుగుదేశంగా భూటాన్ నిలిచింది. పరస్పర విశ్వాసం, అవగాహన పరిణితులతో ఈ రెండు దేశాలు సాగుతున్నాయి. ‘ఇండియా-భూటాన్ ఫ్రెండ్‌షిప్ అండ్ కో-ఆపరేషన్ సంధిపై 1949లో రెండు దేశాలు సంతకాలు చేశాయి. అది రెండు దేశాల సంబంధాలలో బలమైన స్తంభంగా నిలిచింది. దీనితో ప్రత్యేక కార్యక్రమాలు సాధ్యపడుతున్నాయి. అంటే సరిహద్దులను తెరవడం, భద్రతా సహకారం, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాల పెంపుదల వంటివి మరింత విస్తృతంగా కొనసాగే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య ఎన్నో రకాల అసమానతలు ఉన్నప్పటికీ, రెండు దేశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఆర్థిక ప్రగతి, సంఘటిత ప్రజాస్వామ్యం, ప్రాంతీయ శాంతి సాధనల్లో సమవర్తులుగా పనిచేస్తూ ముందుకుసాగుతున్నాయి. 

రెండు దేశాల మధ్య వివిధ విభాగాలు అంటే నీటి వనరులు, వాణిజ్యం, రవాణా, ఆర్థిక సహకారం, భద్రత, సరిహద్దు నిర్వహణ వంటి వాటిల్లో పలు ద్వైపాక్షిక వ్యవస్థాగత ఏర్పాటు కొనసాగుతున్నాయి. భూటాన్‌లో భారత్ అతి పెద్ద వాణిజ్య భాగస్వామి, పెట్టుబడిదారు కూడా (భూటాన్ దిగుమతుల్లో 82 శాతంపైన భారత్‌వే). రెండు వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే నాలుగు హైడ్రోఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులు కూడా అభివృద్ధి చేసింది. 

ఈసారి పర్యటనలో మొత్తం పది ఎంవొయులపై సంతకాలు చేశాయి. వాటిల్లో అంతరిక్ష అధ్యయనం, విద్యుత్ కొనుగోలు ఒప్పందం, సాంకేతిక విద్యపరంగా సహకారం వంటి పలు రంగాలు ఉన్నాయి. వీటితోపాటు రెండు దేశాల నాయకులు కలిసి మాంగదెచ్చు హైడల్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది దక్షిణ ఆసియా శాటిలైట్ ఎర్త్ స్టేషన్. అంతేకాదు భూటాన్‌లో రూపే కార్డును ప్రవేశపెట్టారు. 

భారతదేశం నుంచి పంపిణీ చేసే ఎల్‌పిజి నెలకు 700 మెట్రిక్ టన్నుల నుంచి 1000 మెట్రిక్‌టన్నులను పెంచుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సార్క్ కరెన్సీ స్వాప్ ఫ్రేమ్‌వర్కు కింద అదనంగా వంద మిలియన్ల డాలర్లు భూటాన్‌కు అందుబాటులో ఉంది. భూటాన్‌లో మల్టీ-డిసిప్లినరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డా. షేరింగ్ కల. దానికి కావాలసిన నిధులను మోదీ అందజేస్తానని మాట ఇచ్చారు. 

దౌత్య సంబంధాల విస్తరణకు ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత సంఘటితం చేయాలనుకుంటున్నారు. ఇరుదేశాల ప్రధానులు విస్తృత అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు వెళ్లేందుకు కొత్త యంత్రాంగ పద్ధతులపై కూడా రెండు దేశాల నాయకులు చర్చించారు. వన్-ఆన్-వన్ సమావేశంలో కూడా రెండు నాయకులు వాతావరణ మార్పల పరంగా సహకారం, మౌలికసదుపాయాలు, భద్రత, వ్యూహాత్మక అంశాలు, భూటాన్‌ ఐదు సంవత్సరాల ప్రణాళికకు భారత సాంకేతిక, ఆర్థిక సహాయం, ఇతర ప్రాంతీయ అంశాలను ఇరుదేశాల నాయకులు చర్చించారు.

రచన: డా. నీహార్ ఆర్ నాయక్, భూటాన్ విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన