నూతన భారతాన్ని ఆవిష్కరించిన ప్రధాని స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగం

రెండవ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ప్రధాని నరేంద్రమోదీ చేశారు. ఈ ప్రసంగం ఆసాంతం ప్రధాని రాజకీయంగా, సామాజికంగా ఎంతో శక్తివంతమైన సందేశాన్ని 1.3 బిలియన్ మంది దేశ ప్రజలకు అందించారు. నిజం చెప్పాలంటే, మొట్టమొదటిసారి భారత రాజకీయ చరిత్రలో ప్రధాని తొలిసారి స్వాతంత్ర్య దినోత్సవం రోజు జనాభా పెరుగుదలపై ఆందోళన వ్యక్తంచేశారు. దేశ అభివృద్ధిపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆయన అన్నారు.

ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, 2027 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో భారత్ చైనాను అధిగమిస్తుందని చెప్తోంది. జనాభా పెరుగుదలను పట్టించుకోని పక్షంలో మిలియన్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేయడం చాలా కష్టం. అంతేకాదు వారి సంక్షేమ ప్రయోజనాలకు వెచ్చించేది కూడా పెట్టలేని పరిస్థితి వస్తుంది. ప్రతి ఇంటికి స్వచ్ఛఇంధనాన్ని అందించాలన్న లక్ష్యాన్ని భారత ప్రభుత్వం పెట్టుకుంది. అలాగే మరుగుదొడ్లు, విద్యుత్, గృహాలు, తాగునీరు, ఆరోగ్యం వంటి ఎన్నో లక్ష్యాలను ప్రభుత్వం పెట్టుకుంది. పేద ప్రజలకు అందించే ఈ ప్రయోజనాలన్నీ కూడా జనాభా అపరిమితంగా పెరగడం వల్ల సాధ్యంకాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది జనాభా పెరుగుదలను నియంత్రించాల్సిన సమయం. అదే సమయంలో మర్చిపోకుండా గుర్తంచుకోవాల్సిన మరో విషయం కూడా ఉంది. అదే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. చిన్న కుటుంబం కుటుంబసభ్యులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదృష్టాన్ని ఇస్తుంది. ఇదే విషయాన్ని ప్రధాని 73వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో నొక్కి చెప్పారు.

వంద నిమిషాలకు పైగా ప్రధాని ప్రసంగించారు. నీటి పరిరక్షణకు ఉద్యమం చేపట్టాలన్నారు. అలాగే వర్షపునీటిని భద్రం చేసే సంస్కృతిని అలవరుచుకోవాలన్నారు. కంపోసిట్ వాటర్ మేనేజ్‌మెంట్ సూచిక నివేదికననుసరించి ఢిల్లీ, బెంగళూరు, చైనా, హైదరాబాదు, ఇతర నగరాలు 2020 సంవత్సరానికి జీరో భూగర్భజలాల స్థాయికి దిగుతాయని నీతి ఆయోగ్ 2018లో పేర్కొన్నారు. దీనివల్ల మొత్తం వంద మిలియన్ ప్రజలు ఇబ్బందులపాలవుతారు. జలశక్తి మంత్రిత్వ శాఖను ఏర్పరచిన విషయం తెలిసిందే. నీటి ఎద్దడిని అధిగమించేందుకు జల జీవన్ మిషన్ కింద 3.35 లక్షల కోట్ల రూపాయల కేటాయింపు చేశారు. కానీ గుర్తుంకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే పెద్ద సంఖ్యలో ప్రజల తోడ్పుటు ఉంటే తప్ప ఏ కార్యక్రమం విజయవంతం కాదు. ఈ నేపథ్యంలో భారత పౌరులకు ప్రధాని నరేంద్రమోదీ నీటి సంరక్షణ ఉద్యమానికి ఇచ్చిన పిలుపు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

పర్యావరణం దెబ్బతినకుండా ఉండేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని అడ్డుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. అంతేకాదు భారత రైతులు రసాయనాలను, ఎరువులను వాడకుండా పర్యావరణహితమైన పద్ధతులను అనుసరించడం ద్వారా మట్టి మన్నికను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ మాటలు రోజు రోజుకీ క్షీణిస్తున్న భూ పర్యావరణం పట్ల ప్రధాని ఆందోళను వెల్లడిచేస్తోంది. అదే సమయంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద 90 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. తద్వారా ప్రత్యక్ష్యంగా రైతులకు సహాయపడొచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆరు వేల రూపాయలను 14.5 కోట్లమంది రైతులకు ప్రతి ఏడూ వారి బ్యాంకు అకౌంట్లలో నేరుగా జమ అవుతాయి.

ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మరో ముఖ్య అంశం ఉంది. చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టును ఆరోజున ప్రకటించారు. కార్గిల్ యుద్ధం నుంచి గత రెండు దశాబ్దాలుగా దీనిపై నిర్ణయం పెండింగ్‌లో ఉంటూ వచ్చింది. రక్షణ రంగంలో సంస్కరణలు పెంపొందించాలన్నది కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొన్న భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కొనేలా సంసిద్ధం కావాలన్న ప్రధాని పిలుపు ఎంతో కీలకం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం ప్రకటన భారత రక్షణ నిర్మాణంలోని మూడు సర్వీసుల మధ్య సహకార పెంపుదలకు బాటలు వేస్తుంది. రక్షణపరంగా అన్నివిధాలుగా సర్వసన్నద్ధంగా ఉండడానికి తోడ్పడుతుంది. సుదీర్ఘకాలానికి సంబంధించిన ఫలితాలను అందిస్తుంది.

ప్రధాని నరేంద్రమోదీ తొలి పదవీ కాలం 2014 నుంచి 2019 వరకూ ఉంది. అప్పుడంతా ఆయన ప్రజల అవసరాలపై దృష్టిపెట్టారు. రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టుకున్న లక్ష్యాలను సాధించాలన్న లక్ష్యంగా ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వాలు 70 సంవత్సరాలుగా సాధించలేనిది తమ ప్రభుత్వం కేవలం 70 రోజుల్లో సాధించగలిగిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370 రాజ్యాంగ ప్రకరణాన్ని రద్దు చేయడం, ముస్లిం మహిళలు మంచి జీవితాన్ని కొనసాగించేందుకు త్రిపుల్ తలాక్ మీద కొత్త చట్టం తీసుకురావడం వంటివి ఈ సందర్భంగా మనం గుర్తించవచ్చు. ‘ఒక జాతి, ఒక ఎన్నిక’ అనే అంశాన్ని కూడా తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. మొత్తం మీద ప్రధాని స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగం ఆయన ప్రత్యేక ‘విజన్’ని ప్రతిఫలిస్తోంది. నూతన భారత ఆవిష్కరణకు మోదీ ప్రభుత్వం పెట్టుకున్న ప్రణాళికలు, లక్ష్యాలను స్పష్టంచేస్తోంది. ఇవి ప్రధానంగా భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికరంగాన్ని సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి.

రచన: శంకర్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన