ఒంటరి అయిన పాకిస్తాన్

కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేద్దామన్న పాకిస్తాన్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. పాకిస్తాన్ మిత్రదేశాలైన చైనా, సౌదీ అరేబియాలు కూడా కశ్మీర్ అంశంపై ఇతర దేశాలను ఒక తాటిపై తేవాలని ఇస్లామాబాద్ చేసిన ప్రయత్నాలకు స్పందించలేదు. రియాద్, బీజింగ్ రెండూ తాము ఈ విషయంలో చేయగలిగేదేమీ లేదని ఇస్లామాబాద్‌కు స్పష్టంగా వెల్లడించాయి. రెండు దేశాలూ శాంతి స్థాపనకు ప్రయత్నించాలంటూ పాకిస్తాన్‌ను కోరాయి. పాక్ నియంత్రణను పాటించాలని సూచించాయి. 

భారత్ రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ రద్దు తర్వాత పాకిస్తాన్ పౌర, సైనిక అధికారులు చాలా ఎక్కువగా స్పందించారు. పాత జమ్ము-కశ్మీర్‌ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా రాజ్యాంగబద్ధంగా భారత్ విడగొట్టింది. లదాఖ్‌ను కూడా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. భారత పార్లమెంటులోని రెండు సభలు దీన్ని అత్యధిక మెజారిటీతో ఆమోదించాయి. దీంతో జమ్ము,కశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకునే ముందు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదం కారణంగా జమ్ము, కశ్మీర్‌లు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొన్న సమస్యలను కూడా భారత్ పరిగణనలోకి తీసుకుంది. ఈ మూడు దశాబ్దాల కాలంలో పాక్ ప్రోత్సాహంతో కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంలో మనదేశానికి చెందిన 42 వేల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 

ఆర్టికల్ 370ని రద్దుచేస్తున్నట్టు భారత్ ప్రకటన చేయడంతోపాటు జమ్ము,కశ్మీర్‌లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొడుతున్నట్టు ప్రకటించింది. ఇది పాకిస్తాన్‌లో సంచలనం సృష్టించింది. ఇది పూర్తిగా భారత అంతర్గత విషయం అని ఇస్లామాబాద్‌కు స్పష్టంగా తెలుసు. ఇతర దేశాలు ఇందులో కలుగజేసుకోవడానికి ఏవిధంగానూ హక్కు లేదు. దీంతో పాక్ బాధితురాలి పాత్రను పోషించడానికి చూసింది. 

భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాంతీయ డైనమిక్స్‌ లో అనూహ్య మార్పులను తీసుకువచ్చింది. ఇలాంటి చర్యకు భారత్ పూనుకుంటుందని పాకిస్తాన్ ఎన్నడూ ఊహించలేదు. కశ్మీర్ సమస్యను సుదీర్ఘకాలం అగ్నిగుండంగా కొనసాగించవచ్చని పాక్ భావించింది. అలా కశ్మీర్ సమస్యను తమ రాజకీయ అవసరాలకు ఉఫయోగించుకోవచ్చని భావించింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కొత్త మార్గాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. 

చారిత్రకంగా చూసినా కూడా కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ తరచూ ఓటమికి గురవుతూనే వస్తోంది. జమ్ము, కశ్మీర్‌లు భారత్‌లో అంతర్భాగం అయిపోయిందన్న సత్యాన్ని పాకిస్తాన్ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. కశ్మీర్‌లోని 13 వేల చదరపు కిలోమీటర్ల భారత ప్రాంతాన్ని పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ఈ ప్రాంతాన్ని ఇస్లామాబాద్ వదిలివెళ్లడం సర్వోత్తమం. 

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలు 370వ ప్రకరణను భారత్ రద్దు చేయడం విషయంపై పాకిస్తాన్‌కు ఎలాంటి సహాయాన్ని అందివ్వడానికి ముందుకురాలేదు. భారత్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దును రష్యా సమర్థించింది. దీనిపై మాస్కో స్పందిస్తూ ‘‘ ఈ నిర్ణయాన్ని భారత రాజ్యాంగాన్ని అనుసరించి తీసుకోవడం జరిగింది’ అని వ్యాఖ్యానించింది. అలాగే భారత, పాకిస్తాన్ల మధ్య నానుతున్న పలు సమస్యలను 1972లో చేసుకున్న సిమ్లా ఒప్పందానికి, అలాగే 1999లో చేసుకున్న లాహోర్ ప్రకటనకు అనుగుణంగా పరిష్కరించుకోవాలని రష్యా కోరింది. 

భారత రాజ్యాంగంలోని 370వ ప్రకరణ రద్దు విషయంలో అమెరికా దూరంగా ఉంది. జమ్ము, కశ్మీర్‌లను రెండు కేంద్రపాలితప్రాంతాలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకోవడంపై కూడా స్పందించలేదు. జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి విషయానికి సంబంధించి రద్దు నిర్ణయం తీసుకునే ముందు భారత్ అమెరికాను సంప్రదించలేదని, తెలియపరచలేదని కూడా ఈ సందర్భంగా వాషింగ్టన్ స్పష్టంచేసింది. అమెరికా ప్రభుత్వ విభాగం దీనికి సమాధానం ఇస్తూ 370వ ఆర్టికల్ రద్దు నిర్ణయం ఆ దేశ అంతర్గత విషయమని పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలని పిలుపునిచ్చింది. 

పాకిస్తాన్ ఎదుర్కొన్న మరో పెద్ద దెబ్బ ఏమిటంటే, భారత్ విషయంలో కలుగ జేసుకోవడంపై, భారత్‌పై ఒత్తిడి తీసుకు రావాలన్నదానిపై ఐక్యరాజ్య సమితి పూర్తిగా వ్యతిరేకించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గటెర్రెస్ ఈ విషయంపై మధ్యవర్తిత్వం వహించడానికి అంగీకరించలేదు. భారత, పాకిస్తాన్లు తమ మధ్య ఉన్న విభేదాలను 1972 సిమ్లా ఒప్పందానికి అనుగుణంగా స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని గటెర్రస్ కోరారు. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ భారత కీలకమైన ఈ నిర్ణయంపై భద్రతామండలికి సంక్షిప్తంగా వివరించే ఉద్దేశం కూడా ఏమీ లేదు. ఏదైనా విపరీత పరిణామం చోటుచేసుకున్నప్పుడు భద్రతామండలి సభ్యులకు విషయాన్ని సంక్షిప్తంగా తెలపడం ఎప్పుడూ జరిగే పని. 

అలా అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఓడిపోయి నిలబడింది. బాధితురాలిగా వ్యవహరిద్దామని పాకిస్తాన్ ప్రయత్నించింది. తద్వారా అంతర్జాతీయ మద్దతును సమీకరిద్దామని భావించింది. కానీ ప్రపంచం మరో రకంగా ఆలోచించింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, జనరల్ కమార్ బజ్వాలు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు (ఎఫ్ఎటిఎఫ్) సమావేశానికి ముందు తన ఇంటిని చక్కబెట్టుకుంటే మంచిదన్న ఉద్దేశం కూడా ఉంది. ఎందుకంటే ఈ సమావేశంలో ఉగ్ర నిధులను నియంత్రించడంలో పాక్ వైఫల్యానికి పాక్ బ్లాక్ లిస్టులోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పొరుగుదేశాల విషయాలపై దృష్టి పెట్టే బదులు తన దేశ ప్రజల యోగక్షేమాల మీద, తమ దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యల మీద పాకిస్తాన్ దృష్టిపెట్టాలి. 

రచన: కౌశిక్ రాయ్, ఎఐఆర్: వార్తా విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం