ఉగ్రవాదంపై పోరుకు సంబంధించి పాకిస్తాన్ పైపై చర్యలు
పాకిస్తాన్ 1997 ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని పైకి తీసింది. లష్కర్-ఇ-తోయిబా (ఎల్ఇటి), దాని ముఖ్య సంస్థ జమాత్-ఉద్-దవా (జెయుడి), దాని చీఫ్ హఫీజ్ సయూద్లపై పాకిస్తాన్ 23 ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. ఉగ్రసంస్థలకు నిధులు అందిస్తున్నాయన్న ఆరోపణల మీద వాటి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. సయూద్ తర్వాత స్థానంలో ఉన్న అబ్దుల్ రెహ్మాన్ మక్కిని కూడా ఈ ఆరోఫణల కింద కేసును నమోదుచేసింది. ఛారిటబుల్ ట్రస్టుల పేరుతో జెయుడి, ఫలాహ్-ఇ-ఇన్సానియాత్ ఫౌండేషన్, ఎఫ్ఐఎఫ్ ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నాయి. పంజాబ్ ప్రభుత్వ ఉగ్రవాద వ్యతిరేక శాఖ పూర్తి స్థాయిలో ఈ సంస్థతలపై దర్యాప్తు చేసిన తర్వాత కేసులను నమోదుచేసింది. ఈ ఉగ్ర సంస్థలు మరో ఐదు ట్రస్టుల నుంచి కూడా నిధులను సేకరిస్తున్నట్టు పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక శాఖ గుర్తించింది. అంతేకాదు ఉగ్రకార్యకలాపాలకు డబ్బును చేరవేస్తున్నాయని కూడా తేలింది. ఛారిటీ పేరు చెప్పి ఈ సంస్థలు పెద్ద మొత్తంలో సంపదను మూటగట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది.
2008 సంవత్సరంలో ముంబయిలో జరిగిన ఉగ్రదాడుల వెనుక మాస్టర్ మైండ్ హఫీజ్ సయూద్. ఈ దాడుల్లో 164 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో జరిగిన పలు ఉగ్రదాడుల వెనుక సైతం సయూద్ హస్తం ఉంది.
పాకిస్తాన్ చేపట్టిన ఈ చర్య ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ ఈ సందర్భంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హఫీజ్ సయూద్, అతనివిగా చెప్పబడుతున్న ఛారిటబుల్ ఫ్రంట్స్ ఈ కార్యకలాపాలను మూడు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా దాని గురించి అంగీకరించడం వల్ల పొందే లాభం ఏమిటి? ఎన్నో సంవత్సరాల తర్వాత స్పందించిన పాకిస్తాన్ దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం నిజంగా ఉందా? ఎంతో వేగంగా తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తీరిగ్గా సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకోవడంపై ఆంతర్యం ఏమిటి?
దీనికి జవాబులు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇతర దేశాలపై దాడులకు ఉగ్రవాదులను, ఉగ్రవాద సంస్థలను వ్యూహాత్మక ఆస్తులుగా పాక్ ఉపయోగించుకుంటూ వస్తోంది. నిజానికి పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ ఒక సందర్భంలో ‘పాకిస్తానే ఈ ఉగ్రవాదులను సృష్టించింద’ని అన్నారు. అంతేకాదు వారిని దేశానికి సంబంధించిన ముఖ్యమైన ఆస్తిగా పాక్ ప్రభుత్వం చూసిందని ఆయన తెలిపారు. కశ్మీర్‌పై, దేశంలోని ఇతర ప్రాంతాలపై, అంతేకాదు ఇతర దేశాలపై సైతం దాడులు చేసేందుకు ఈ ఉగ్రవాద సంస్థలను పాకిస్తాన్ వాడుకుంటోంది. ఈ విషయంలో ఇస్లామాబాద్ అమాయకత్వాన్ని ప్రదర్శిస్తే మాత్రం అది తన దుశ్చర్యలను బయట ప్రపంచానికి కనిపించకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టే. ఇన్నేళ్లుగా పాకిస్తాన్ తమ దేశాన్ని నెలవుగా చేసుకుని ఉగ్రవాదకార్యకలాపాలకు పాల్పడుతున్న పైన పేర్కొన్న సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు మిన్నకుందో ఇపుడు అర్థమవుతుంది. వాటిపై కేసులు పెట్టకుండా వ్యూహాత్మకంగా పాక్ ఎలా వ్యవహరించిందో కూడా స్పష్టమవుతోంది.
నిజం ఏమిటంటే, పాకిస్తాన్ అంతర్గతంగా, బహిరంగంగా కూడా సంక్లిష్టమైన పరిస్థితుల మధ్య చిక్కుకుంది. ఇది తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అంతర్గతంగా ఆర్థికంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే రోజువారీ ఖర్చులను భరించడం సైతం దానికి తలకు మించిన భారం అవుతోంది. ఫలితంగా నిత్యావసరవస్తువుల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. పాకిస్తాన్‌లోని ఈ పరిస్థితులపై మరోవైపు దేశ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇకపోతే, ఉగ్రవాదుల పట్ల తీవ్ర చర్యలు తీసుకుని వారి దాడులకు అడ్డుకట్టవేయడం, ఉగ్రవాదాన్ని కఠినంగా నిరోధించడం వంటి చర్యలను పాకిస్తాన్ కచ్చితంగా అమలుపరిస్తే తప్పించి తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ దాన్ని సమర్థించమని అంతర్జాతీయంగా పలు దేశాలు స్పష్టం చేశాయి. ఇటీవల జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జి20 సదస్సులో కూడా ఈ విషయాన్ని పలుదేశాలు స్పష్టంచేశాయి.
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) ఉగ్రవాద సంస్థలకు నిధులు అందించడంపై నిఘా వేసే అంతర్జాతీయ సంస్థ. అందుకే ఎఫ్ఎటిఎఫ్ పాకిస్తాన్‌ను ఇంకా ‘గే లిస్ట్’ కిందే ఉంచింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు నిధులను అందించే పనిని ఆపకపోతే, తన వైఖరిని మార్చుకోని పక్షంలో గ్రే లిస్టు నుంచి కూడా దాన్ని తొలగించి మరింత కిందస్థానంలో ఉంచుతామంటూ ఎఫ్ఎటిఎఫ్ హెచ్చరించింది. జూన్ 21న అమెరికాలోని ఆర్లాండ్లో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎఫ్ఎటిఎఫ్ పాకిస్తాన్‌కు తీవ్రంగా హెచ్చరించింది.
పాకిస్తాన్ ప్రస్తుతం చేపట్టిన చర్యలు కూడా అనమానాస్పదమే. ఎందుకంటే ఈ తరహా శైలిలో పాకిస్తాన్ ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నట్టు పాకిస్తాన్ పలుమార్లు ప్రపంచదేశాలను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ఆ విషయాలపై పాకిస్తాన్ నిబద్ధతగా ఏనాడూ స్పందించలేదు. తాను చెప్పినట్టు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టలేదు. ప్రపంచ దేశాలను పక్కదారి పట్టించడానికి పాకిస్తాన్ ప్రయోగించే కన్నీటి తుడుపు చర్య మాత్రమే ఇది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ చేపట్టిన చర్యలోని ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ ప్రజా ప్రభుత్వం, సైన్యం కలిసి సమిష్టిగా తీసుకోవడం. దీనివల్ల ఉగ్రవాదులపై నిజాయితీగా చర్య తీసుకునే విషయంలో ఆర్మీ జోక్యానికి అవకాశం ఉండదు. కానీ, అది జరుగుతుందో లేదో ముందు ముందు వెల్లడవుతుంది ఈ విషయంలో పాకిస్తాన్ నిజాయితీగా స్పందించి చర్యలు చేపట్టాలని పౌరుల ఆశ. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పాక్ స్పందించడం ఆ దేశ ప్రయోజనాలకే కాదు మొత్తం అంతర్జాతీయ శాంతి స్థాపనా ప్రయోజనాలకు కూడా తోడ్పడుతుంది.
పాకిస్తాన్ హపీజ్ సయూద్పై ప్రకటించిన చర్యలను ‘కాస్మొటిక్ చర్యలు’గా భారత్ అభివర్ణించింది. మన:స్ఫూర్తిగా నిబద్ధతతో పాక్ దీనిని చేపట్టలేదని వ్యాఖ్యానించింది. ఇది కేవలం అంతర్జాతీయ సమాజం ముందు పెద్ద స్టంట్ అని అభిప్రాయపడింది. భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ ‘పాకిస్తాన్ భూభాగంపై పనిచేస్తున్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఎంతవరకూ అమలుచేసింది, అవి నమ్మదగినవా, పాకిస్తాన్ ఆ చర్యలను వెనక్కి తీసుకోకుండా పనిచేస్తుందా అన్న అంశాలను బట్టి ఇది నిర్థారణ అవుతుంది’ అని భారత్ అభిప్రాయపడింది.
Comments
Post a Comment