మొజాంబిక్‌తో బలపడుతున్న భారత్ సంబంధాలు

మొజాంబిక్‌తో వ్యూహాత్మక సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు బలపడడానికి భారత్ పూనుకుంది. మొజాంబిక్‌లో భారత్ భారీస్థాయిలో ఆర్థిక పెట్టుబడులను కూడా పెట్టింది. రెండు దేశాలూ రెండు ముఖ్యమైన పరస్పర ప్రయోజనకర ఒప్పందాలపై సంతకాలు కూడా చేశాయి. అవే ‘వైట్ షిప్పింగ్’ ఒప్పందాలు. వైట్ షిప్పింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలాగే సముద్రం తదితర జలవనరుల ప్రాంతాలకు సంబంధించిన రంగంలో (హైడ్రోగ్రఫీ)సహాకారాన్ని ఇచ్చిపుచుకోవాలని ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన మూడు రోజుల మొజాంబిక్‌ పర్యటనలో ఆ ఆఫ్రికా దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

మొజాంబిక్ రక్షణ మంత్రి అతనసియోమ్తుముకెతో ద్వైపాక్షిక సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా మంత్రి సింగ్ మాట్లాడుతూ ఆఫ్రికాలోని భారత అత్యంత మిత్రదేశాల్లో, భాగస్వాముల్లో మొజాంబిక్ కూడా ఒకటని వ్యాఖ్యానించారు. గణాంకాలు సూచిస్తున్న దాని భారత పెట్టుబడులు ఏడు బిలియన్ అమెరికన్ డాలర్ల వరకూ ఉన్నాయి. ప్రధానంగా భారత పెట్టుబడులు విద్యుత్, బొగ్గు రంగాలలో 25 శాతం మేర ఉన్నాయి. 2017 లో మొజాంబిక్ ఎగుమతులకు భారత్ అతిపెద్ద నిలయంగా ఉంది. ఆ దేశం మొత్తం ఎగుమతుల రెవెన్యూలో 35 శాతం ఇక్కడ నుంచే వస్తోంది.

కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారి చేపట్టిన విదేశీ పర్యటన ఇది. అంతేకాదు ఇది మొజాంబిక్‌కు భారత రక్షణ మంత్రిగా ఆయన చేపట్టిన మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటన కూడా.ఈ పర్యటన మూలంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత అభివృద్ధిచెందుతాయని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. అంతేకాదు ఇండో-మొజాంబిక్ రక్షణ సహకార పరంగా, అలాగే హిందూమహాసముద్ర ప్రాంతంలో భద్రత పెంపుదల విషయంలో శక్తివంతమైన తోడ్పాటును అందిపుచ్చు కోవడంలో కూడా రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు ఎంతగానో ఉపయోగపడ తాయని అన్నారు.

సమాచార పరికరాల పరంగా సహాయం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. అలాగే స్మగ్లింగ్, ఉగ్రవాదం, పైరసీ, ఆక్రమణలు, సముద్రయానపరంగా తలెత్తే సంప్రదా యేతర హెచ్చరికలను కలిసి అడ్డుకోవడానికి సమిష్టిగా పనిచేయాలనుకుంటున్నాయి రెండు దేశాలు. రెండు భారత తయారీ ఇంటర్‌సెప్టర్ బోట్స్ (ఎఫ్ఐబి), 44 ఎస్‌యువిలను మాపుటోలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత్ మొజాంబిక్‌కు అందజేసింది. నలుగురు సభ్యులతో కూడిఉన్న భారత తీరప్రాంత గస్తీ దళం శిక్షణ, ఓడల నిర్వహణ, పనితీరు తదితర విషయాలలో శిక్షణనివ్వడానికి సైతం సహాయపడనుంది.

అంతర్గత రక్షణ విషయాలను మొజాంబిక్ రక్షణమంత్రి మనదేశ రక్షణ మంత్రి సింగ్‌కు సంక్షిప్తంగా వివరించారు. దాంతోపాటు అణునిరాయుధీకరణ, సమీకరణలకు పాల్పడకుండా ఉండడం, పున: ఏకీకృతం కావడం (డిడిఆర్) విధానంపై జరుగుతున్న కసరత్తుకు సంబంధించి కూడా భారత రక్షణ మంత్రి సింగ్‌కు మొజాంబిక్ మంత్రి వివరించారు. మొజాంబిక్ నాయకులతో జరిగిన సమావేశాలలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్రంగా చర్చించారు. భారత ప్రభుత్వానికి, మొజాంబిక్ ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాలను గుర్తించారు. అంతేకాదు ఇరుదేశాల మధ్య బలమైన వాణిజ్య సంబంధాలతో పాటు, ఎంతో మెరుపులు విరజిమ్మేలాంటి అభివృద్ధి భాగస్వామ్యం, రెండు దేశాల ప్రజల మధ్య సుదీర్ఘకాలంగా ప్రత్యక్షంగా సుదీర్ఘ సంబంధాలు ఉండడం వంటి విషయాలను ఆయన గుర్తించారు. ఒక స్నేహపూరిత వాతావరణం రెండు దేశాల పట్ల ఉండడంపై ఆనందం వ్యక్తంచేశారు.

మొజాంబిక్ ప్రధాని కార్లోస్ అగొస్తిన్హో దొ రొసారియోని మాపుటోలో మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత సహకారాలకు సంబంధించిన మార్గాలను చర్చించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం అధికంగా పెరుగుతున్న వాతావరణంలో ఆఫ్రికా దేశమైన మొజాంబిక్ భారత్ నుంచి వీటి నిర్మూలనపరంగా సహకారాన్ని కోరింది. రెండు దేశాలు కూడా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతను పెంపొందించేందుకు మార్గాలను వెదికాయి. వాటిపరంగా కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నాయి.

పెట్టుబడులు మాత్రమే కాదు ద్వైపాక్షిక వాణిజ్యం కూడా రెండు దేశాల మధ్య ఇటీవల సంవత్సరాలలో బాగా పెరిగింది. రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య విలువ 2010-2015 నాటికి ఐదింతలు పెరిగింది. 2014-15లో అయితే ఇది 2.4 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. భారత దేశం నుంచి ఎగుమతి చేసుకుంటున్న సరుకుల్లో ముఖ్యంగా రిఫైన్డ్ పెట్రోలియం, ఫార్మాస్యుటికల్స్ ఉంటే, మొజాంబిక్ నుంచి భారత్ అధికంగా తెప్పించుకుంటున్న సరుకులు బొగ్గు, జీడిపప్పులు. దాదాపు 20 వేల మంది మొజాంబిక్ జాతీయుల్లో భారతీయ వారసత్వం కనిపిస్తుంది.

భారత రక్షణ మంత్రి అన్నట్టు మొజాంబిక్‌తో భారత్ ఎంతో స్నేహ, సన్నిహిత సంబంధాలను పంచుకుంటోంది. ఇది పరస్పర అభివృద్ధి భాగస్వామ్యంతో మరింత బలపడుతోంది. అంతేకాదు భారత సంతతి ఉనికి ఇందులో కనిపించడం మరో విశేషం. రక్షణ మంత్రి చేసిన ఈ పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి చేయూతనిస్తుందనడంలో సందేహం లేదు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2016, జూలైలో ఆఫ్రికన్ దేశం మొజాంబిక్‌లో పర్యటించడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు అత్యున్నతస్థాయికి చేరాయి. కేవలం మొజాంబిక్ దేశమనే కాదు భారత్ భారత ప్రధానిగా 2014లో మోదీ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆఫ్రికా దేశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వస్తున్నారు. సంపద్వంతమైన వనరుల కేంద్రం అయిన ఆఫ్రికాతో అత్యున్నతస్థాయి సమావేశాలు భారత్ అధికంగా నిర్వహిస్తోంది. మరీ ముఖ్యంగా 2015లో జరిగిన మూడవ ఇండియా-ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశం నుంచి ఆఫ్రికాతో అత్యున్నతస్థాయి సమావేశాల సంఖ్య పెరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆఫ్రికాకు 29 పర్యటనలను భారత్ చేసింది. ఈ అత్యున్నతస్థాయి పర్యటనల్లో భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానులతో పాటు వివిధ సీనియర్ స్థాయి మంత్రులు కూడా ఆఫ్రికాలో పర్యటించి సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు కూడా భారత రాష్ట్రపతి రామ్ నాథ్‌కోవింద్ మూడు పశ్చిమా ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్నారు. 

రచన: వినీత్ వాహి, జర్నలిస్ట్

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన