ఉద్రిక్తలను తిరిగి పెంచిన ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు

కొరియా ద్వీపకల్పంలో శాంతిస్థాపనకు ఆటంకంగా మరో ఆందోళన కరమైన పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర కొరియా గత వారం రెండు బెలాస్టిక్ క్షిపణుల పరీక్షలు నిర్వహించింది. ఉత్తరకొరియా ఛైర్మన్ కిమ్ జాంగున్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు కొరియాల మధ్యన ఉన్న సైనికరహిత మండలం (డీమిలిటరైజ్డ్ జోన్, డిఎంజడ్)లో సమావేశమై చర్చలు జరిపిన నెలలోపే ఈ క్షిపణి ప్రయోగాలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రధాన అంశాలపై సమగ్ర పరిష్కారాలు చేపట్టే దిశగా పనిచేయాలని ఈ రెండు దేశాలూ ప్రతినబూనాయి కూడా.

ఉత్తరకొరియా తూర్పు తీరంలోని వాన్సాన్ నుంచి రెండు క్షిపణుల పరీక్షలు చేశారు. ఉత్తర, దక్షిణ కొరియాలు రెండూ ఈ క్షిపణులు భిన్నమైన స్వభావంతో కూడినవని ధృవీకరించాయి కూడా. ఇవి చేతితో తీసుకెళ్లేలా ఉంటాయి, ఇతరులకు తెలియకుండా సులభంగా దాచవచ్చు కూడా. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే వీటిని ట్రాక్ చేయడం చాలా క్లిష్టం. భద్రతాపరమైన అంశాలు కొరియా ద్వీపకల్పానికే తప్ప అమెరికాకు కాదన్నది కూడా ఇందులో స్పష్టంగా తెలుస్తుంది.

క్షిపణులను ప్రారంభించిన తర్వాత కిమ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి భద్రతా పరమైన ప్రమాదం ఉత్తరకొరియాకు ఎదురుకాకూడదనేది క్షిపణుల ప్రయోగ ప్రధాన ఉద్దేశం అని అందులో ఆయన పేర్కొన్నారు. దక్షిణ కొరియా రెచ్చగొట్టే చర్యలే ఇందుకు కారణమని కిమ్ అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో దక్షిణ కొరియా అమెరికాతో కలిసి వార్షిక సమిష్టి సైనిక విన్యాసాలను చేపట్టనుంది. దక్షిణకొరియా, అమెరికా రెండూ సమిష్టిగా సైనిక విన్యాసాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. ఇరు దేశాల ఈ తరహా సైనిక విన్యాసాలు ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కిమ్ కూడా ఎక్కడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును ప్రస్తావించకపోవడం. దీన్ని బట్టి అర్థమవుతున్నదేమిటంటే ఉత్తరకొరియా ఎలాంటి పరిస్థితుల్లోనూ అమెరికాతో విభేదాలను తెచ్చుకోవాలని అనుకోవడం లేదు. అదే సమయంలో తన అణు క్షిపణి కార్యక్రమాన్ని కూడా వదలడానికి అది సిద్ధంగా లేదు.

తన అణు సామర్థ్యాన్ని పెంచుకోవాలనేది ఉత్తరకొరియాకు సుదీర్ఘకాలం నుంచి ఉన్న లక్ష్యం. తన ప్రాంత పరిరక్షణ కోసం దీన్ని ఎంచుకుంది. అలాగే ఇటీవల జరిపిన క్షిపణి పరీక్షలు కూడా రానున్న యుఎస్-దక్షిణ కొరియా సమిష్టి సైనిక విన్యాసాల కారణంగానే ఉత్తరకొరియా చేబట్టింది. అంతేకాదు దక్షిణ కొరియా 40ఎఫ్-35 జెట్స్ సేకరణ కూడా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేపట్టడానికి మరో ముఖ్య కారణం. ఈ చర్య ఉత్తరకొరియాను రెచ్చగొట్టింది.

దక్షిణ కొరియా ప్రెసిడెంట్ మూన్ జా-ఇన్ ఉత్తరకొరియా చేసిన క్షిపణి ప్రయోగాలను నిందించారు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలను ఉత్తర కొరియా అతిక్రమించిదన్నారు. యుఎన్ నిబంధనల ప్రకారం ప్యోంగ్యాంగ్ ఎలాంటి బలాస్టిక్ క్షిపణి సాంకేతిక పరిజ్ఘానం అభివృద్ధి గాని, పరీక్షలు గాని చేయరాదని నిషేధించింది. ప్యాంగ్యాంగ్ చర్యను విమర్శిస్తూ ఉత్తర కొరియా చేపట్టిన క్షిపణి ప్రయోగాలు దక్షిణ కొరియా భద్రతపై ఎలాంటి ప్రభావం చూపదని మరోవైపు సియోల్ ప్రకటించింది.

క్షిపణి పరీక్షలకు సంబంధించి అమెరికా స్పందన గమనిస్తే, యుఎస్‌లో పెద్దగా కదలిక లేదనే చెప్పాలి. అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనలను దగ్గరగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. పరిమిత దూరంతో కూడిన షార్ట్ మిజైల్ పరీక్షల ప్రభావం తక్కువగానే ఉంటుంది. కానీ సుదీర్ఘ దూరంతో కూడిన క్షిపణి ప్రయోగాలు ఉత్తర కొరియా చేసినపుడు మాత్రం అమెరికా దానిపై తీవ్రంగా విరుచుకుపడింది. దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏమిటంటే తన దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందని అమెరికా భావించినప్పుడు మాత్రమే ఉత్తరకొరియా చర్యల పట్ల యుఎస్ తీవ్రంగా స్పందిస్తుందని.

మే నెలలో నిర్వహించిన పరీక్షలను కూడా అమెరికా, దక్షిణ కొరియాలు చాలా తేలిగ్గా తీసుకున్నాయి. వాటి పట్ల ఎంతో తేలిగ్గా ప్రతిస్పందించాయి. క్షిపణి ప్రయోగం అనేది ఉత్తరకొరియా చర్చల టాక్టిగ్గా అమెరికా ఆలోచిస్తుంటే, ఇలాంటి చర్యలు నిరాటంకంగా కొనసాగిన పక్షంలో, కొరియా ద్వీపకల్ప ప్రాంత భద్రత, శాంతి, సుస్థిరతలకు ప్రమాదం ఏర్పడటం ఖాయం.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా ఛైర్మన్ కిమ్‌ల మధ్య 2019 ఫిబ్రవరిలో హనోయ్‌లో జరిగిన చర్చలు వైఫల్యం చెందాయి. ఈ ఇద్దరు నాయకులు మళ్లా జూన్‌లో సమావేశమయ్యారు. కానీ వీరి చర్చల్లో ఎలాంటి నూతన పరిణామాలు చోటుచేసుకోలేదు. ఇరు దేశాల మధ్య అధికారుల స్థాయి సంభాషణలు హనోయ్ శిఖరాగ్ర సమావేశానంతరం నుంచీ ఆగిపోయాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘‘ స్టైల్-ఓవర్-సబ్‌స్టెన్స్’’ విధానం ఉత్తర కొరియా విషయంలో వైఫల్యం చెందింది. దీంతో ఎలాంటి ఫలితాలు అమెరికా సాధించలేకపోయింది. మరోవైపు ఉత్తర కొరియా ఇప్పటికీ తన సైనిక సామర్థ్యాలను ఎంతో ఉత్సాహంగా పెంపొందించుకుంటూ వస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే చైనాతో ఎంతో సన్నిహితంగా ఉత్తరకొరియా మెలగడం.
శాంతి స్థాపన ప్రక్రియలో బీజింగ్ గైరుహాజరు ఎలాంటి ప్రభావాన్ని చూపదు. ఈ సమస్యకు అందరికీ అంగీకారయోగ్యమైన పరిష్కారం కోసం, సిక్స్ పార్టీ సంభాషణలను పునరుద్ధరించ వచ్చు. ప్రస్తుతం మాత్రం చైనా-అమెరికాల మధ్య ఉన్న అభిప్రాయవిభేదాల వల్ల ఉత్తరకొరియా అణు సామర్థ్య నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చేసే ఎంతటి సమగ్ర ప్రయత్నానికైనా అడ్డంకి ఎదురుకాక తప్పదు. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా తిరిగి అణు పరీక్షలు చేపట్టకుండా అమెరికా దానితో చర్చలు జరుపుతూ అది కొత్త పరీక్షలు చేయకుండా పక్కకు మళ్లించేలా కృషిచేయాలి.

సుస్థిరమైన, ఒత్తిడులు లేని, శాంతికి నెలవైన కొరియా ద్వీపకల్పాన్ని భారత్ కోరుకుంటోంది. ఇందులో భాగస్వాములైన వారందరూ దీన్ని సాధించడానికి తమ వంతు కృషి తప్పనిసరిగా చేయాలి.


రచన: డా. రాహుల్ మిశ్రా, తూర్పు, ఆగ్నేయాసియా వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన