రష్యా-ఇండియా-చైనా త్రైపాక్షిక సమావేశం

రచన: డా. రాజ్‌దీప్ పాకనాటి, చైనా వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు

జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జి20 శిఖరాగ్ర సదస్సు జరిగిన సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌లతో కలిసి త్రైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. రష్యా, భారత్, చైనా (ఆర్ఐసి) త్రైపాక్షిక సమావేశం భారత ప్రాధాన్యాన్ని వెల్లడిస్తోంది. రష్యా, చైనాలు కూడా అమెరికా నుంచి ఆంక్షల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ కారణాల వల్లే మూడు దేశాలు అత్యవసరంగా సమావేశం అయ్యాయి. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ వ్యవస్థను ఉన్నత స్థితికి తీసుకురావడంలో మూడు దేశాల సుదీర్ఘకాల ప్రయోజనాలు దాగున్నాయి. ఆ లాభాలే ఈ మూడు దేశాలను ఒక దగ్గరకు చేర్చాయి.

రష్యా, ఇండియా, చైనా దేశాల విదేశాంగమంత్రుల సమావేశాలు 2003 సంవత్సరం నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఈ దేశాల అధిపతుల తొలి సమావేశం 2006లో జరిగింది. అప్పట్లో నాటి చైనా ప్రెసిడెంట్ హు జిన్‌తా, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని డా. మన్మోహన్ సింగ్‌లు జి8 సమావేశానంతరం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో సమావేశమయ్యారు.

ప్రధాని నరేంద్రమోదీ, ప్రెసిడెంట్ గ్జి, ప్రెసిడెంట్ పుతిన్ల మధ్య గతంలో సంభాషణలు జరిగాయి. గత ఏడాది నవంబరులో వీరు కలిశారు. ప్రస్తుతం వీరి మధ్య జరిగిన సంభాషణలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే యోచనలో ముగ్గురు నాయకులు ఉన్నారు. ఈ మూడు దేశాల అధినాయకులు ఈ ఏడాది సెప్టెంబరులో రష్యాలోని వలదివొస్టోక్‌లో ‘ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరం’ సదస్సు సమయంలో తిరిగి సమావేశం కానున్నారు. రక్షణవాదం, ఏకపక్షవాదం పెరిగిపోతుండడంతో గ్లోబల్‌గా శాంతి సుస్థిరతలకు ప్రమాదం వాటిల్లనుంది. అంతేకాదు ప్రపంచ ఆర్థికాభివృద్ధి తీవ్రంగా పడిపోయింది. వీటి ఫలితంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో విస్తరిస్తున్న మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పెరిగింది. దీంతో సమావేశాల ప్రాధాన్యాన్ని ఈ దేశాల నాయకులు గుర్తించారు.

ఈ సమావేశాల వెనుక ఇంకొక ముఖ్య అంశం కూడా దాగుంది. ఈ సమావేశాలు మూడు దేశాలకు చెందిన బలమైన నాయకుల మధ్య చక్కటి అనుబంధం ఏర్పరచడంతో పాటు ఒకరినొకరు అవగాహన చేసుకునే వీలు కలుగుతుంది. అంతేకాదు అత్యున్నతస్థాయి నాయకత్వంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. వ్యూహాత్మక సమాచారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇలాంటి సమావేశాలు మంచి అవకాశాలుగా ఉపయోగపడతాయి. ఏదో ఒక్క విషయానికే కాదు పరస్పర ప్రయోజనకరమైన అన్ని రకాల సమాచారంపై సంప్రదింపులు జరపొచ్చు.

ఒసాకా త్రైపాక్షిక సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. వాటిల్లో అంతర్జాతీయ ఉగ్రవాదం, మూడు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకోవడం, ఇంటర్నేషనల్ హాట్ స్పాట్స్, వాతావరణ మార్పులు వంటి సవాళ్లపై సమావేశంలో లేవనెత్తారు.

ప్రస్తుత సమావేశ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు సంబంధించి చైనా అధ్యక్షుడు గ్జి, రష్యా అధ్యక్షుడు పుతిన్ల నుంచి సహాయం కోరారు. ఉగ్రవాదం కార్యకలాపాల దుష్ఫ్రభావంపై ఎన్నో అంతర్జాతీయ బహుపాక్షిక ఒప్పందాలు చర్చించాయి. కానీ ఉగ్రవాదానికి సిసలైన అర్థం చెప్పే ఒక్క గ్లోబల్ సమావేశం జరగలేదు. ఉగ్రవాదం వల్ల తలెత్తే సవాళ్లను షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రధానంగా చర్చిచింది. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో వివిధ దశలను ఇది ప్రస్తావించింది. ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకునేలా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) తగిన రీతిలో స్పందిస్తుందని భారత్ ఆశిస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద బృందాలకు నిధులు అందుతున్న వైనం గురించి ఇటీవల ఎఫ్ఎటిఎఫ్ లేవనెత్తిన విషయం తెలిసిందే.

చైనా దృక్కోణంలోంచి చూస్తే, ఈ సమావేశం యురేసియా ప్రాధాన్యాన్ని పెంచుతుంది. అదే సమయంలో త్రైపాక్షిక చర్చలు కూడా అనుకూల ప్రభావాన్ని ద్వైపాక్షిక సంబంధాలపై చూపుతుంది. చైనా సహాయక విదేశాంగ వ్యవహారాల మంత్రి ఝాంగ్ జున్ మాట్లాడుతూ ‘ఇండియా, రష్యాలతో చైనా సంబంధాలు పెరగడం చూస్తాం. అంతేకాదు మూడు దేశాల నాయకులు సన్నిహితంగా పరస్పర చర్చలు జరుపుతున్నారు కూడా. ప్రధాన గ్లోబల్ అంశాల పరంగా మూడు దేశాల మధ్య బలమైన సహకారం ఎంతో ముఖ్యం’ అన్నారు. ఇవి సంయుక్తంగా బహుపక్షవాదానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. అంతేకాదు రక్షణ వాదాన్ని వ్యతిరేకిస్తునాయి. బహుపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై సహకారం పెంపొందించుకోవాలని పెంపొందించుకోవడం ద్వారా అంతర్జాతీయ శాంతికి ముఖ్య సేవలను అందించాలనేది మూడు దేశాలకు చాలా ముఖ్య అంశం.

రష్యా దృక్కోణంలోంచి చూస్తే, అన్ని రంగాలలో రష్యా కన్నా చైనా పరుగు పెడుతోంది. ప్రపంచ రాజకీయాల్లో రష్యా ప్రభావాన్ని పెంచడంలో ఆర్ఐసి సహాయ పడుతుంది. అలాగే ఇండియా కూడా శక్తివంతమైన దేశంగా నిలుస్తుంది. అంతర్జాతీయ క్రమాన్ని సమతుల్యం చేస్తుంది. భారత్ అంతర్జాతీయ భూభౌగోళిక, భూఆర్థిక అంశాలలో అమెరికాతో స్వతంత్రంగా పనిచేయాలని రష్యా, చైనాలు భావిస్తున్నాయి.

చివరిగా, గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఆర్ఐసి సమావేశమే కాదు జపాన్, అమెరికా, ఇండియా (జెఎఐ)త్రైపాక్షిక సమావేశం కూడా ఒసాకాలో జరిగింది. ఇలాంటి త్రైపాక్షిక సమావేశాలు భారత బహుళ అమరిక వ్యూహంలో భాగమనే అంశాన్ని విస్పష్టంగా చూపడమే కాదు తద్వారా ప్రపంచ రాజకీయాల్లోని అల్లకల్లోల పరిస్థితులను సరైన దారిలో నడపొచ్చు కూడా.

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం