పార్లమెంటులో ఈ వారం..

చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో)ను రాష్ట్రపతి రామ్ నాథ్‌కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీలు ప్రశంసించారు. చారిత్రకమైన ఈ ఘట్టం భారతీయులందరికీ ఎంతో గర్వించదగ్గ క్షణాలుగా కోవింద్ వ్యాఖ్యానించారు. ఈ ప్రయోగం కొత్త అంశాలను కనుగొనడానికి దారులు వేస్తుందని అన్నారు. అంతేకాదు భారత అంతరిక్ష విజ్ఘాన వ్యవస్థను మరింత సంపద్వంతం చేస్తుందన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విజయవంతమైన చంద్రయాన్-2 లాండింగ్ ఈ రంగంలో ముందున్న దేశాల్లో నాల్గవ దేశంగా భారతదేశాన్ని నిలబెడుతుందన్నారు. తన సందేశంలో భారత ప్రధాని నరేంద్ర మమోదీ భారత శాస్త్రవేత్తల ప్రతిభా సామర్థ్యాలను ఎంతగానో పొగిడారు. అంతేకాదు వారి ఆత్మవిశ్వాసానికి ఇది ఒక మచ్చచుతునకగా పేర్కొన్నారు.

కేంద్ర విదేశ వ్యవహారాల శాఖా మంత్రి డా. ఎస్. జైశంకర్ మాట్లాడుతూ ముఖ్యమైన అంశాలను పాకిస్తాన్‌తో ద్వైపాక్షికంగానే చర్చించి పరిష్కరించుకోవాలన్నది భారత విస్పష్టమైన పంథా అని స్పష్టంచేశారు. జమ్ము-కశ్మీర్ సమస్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన గురించి రాజ్యసభలో ప్రస్తావిస్తూ కశ్మీర్ సమస్య విషయంలో ఎలాంటి మధ్యవర్తిత్వాలకు తావులేదని విస్పష్టంచేశారు. ప్రధాని నరేంద్రమోదీ కశ్మీర్ విషయంలో ట్రంప్ మధ్యవర్తిత్వం కోరినట్టు వచ్చిన వార్త తెలిసినదే. అలాంటిదేమీ లేదని ఈ సందర్భంగా డా. ఎస్ జైశంకర్ స్పష్టంచేశారు. ముఖ్యమైన అంశాలపై ఇస్లామాబాద్ తో ద్వైపాక్షికంగా చర్చలు జరిపి పరిష్కరించుకోవడమే భారత స్థిరమైన విధానం. అందులో మార్పులేదని జైశంకర్ పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌తో కలిసి ఏ పని చేపట్టడానికైనా మొదట ఆ దేశం సరిహద్దు ఉగ్రవాదానికి స్వస్తి పలకాలన్నారు. అంతేకాదు ఇరుదేశాల మధ్య ఉన్న వివాదాలను సిమ్లా ఒప్పందం, లాహోర్ ప్రకటనలకు అనుగుణంగా ద్వైపాక్షికంగా పరిష్కకరించుకోవాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా విదేశాంగమంత్రి స్పష్టంచేశారు. కొంతమంది ప్రతపక్ష సభ్యులు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ రాజ్య సభలో ఒక ప్రకటన చేయాలంటూ ఒత్తిడిచేశారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లోక్ సభలో కూడా లేవనెత్తారు. 


రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ కశ్మీర్ సమస్య పరిష్కారంలో మూడవ పార్టీ జోక్యం ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇది షిమ్లా ఒప్పందానికి పూర్తిగా విరుద్ధమైందన్నారు. లోక్ సభలో ప్రకటన చేస్తూ రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర విదేశాంగమంత్రి ప్రభుత్వ పంథాను సభలో స్పష్టంగా వివరించారని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జపాన్‌లోని ఒసాకాలో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని అన్నారన్న వార్తల్లో నిజం లేదని విదేశాంగ మంత్రి ఇప్పటికే సభలో స్పష్టంచేశారని రామ్‌నాథ్ అన్నారు. డొనాల్డ్ ట్రంప్, నరేంద్రమోదీ సమావేశంలో విదేశాంగమంత్రి జైశంకర్ కూడా ఉన్నారని రామ్‌నాథ్ గుర్తుచేశారు. పాకిస్తాన్‌తో ఎప్పుడు చర్చలు జరిగినా అది కేవలం కశ్మీర్ సమస్యపైన మాత్రమే కాదని పాక్ ఆక్రమిత కశ్మీర్ మీద కూడా చర్చలు జరుగుతాయని ఈ సందర్భంగా ఆయన సభలో అన్నారు. 


ఒకవైపు కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షం సభను బహిష్కరిస్తున్నప్పుడు లోక్ సభలో ‘అన్‌లాపుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) అమెండ్‌మెంట్ బిల్లు, 2019ని ప్రవేశపెట్టారు. ఈ అంశంపై చర్చకు స్పందిస్తూ హోం మంత్రి అమిత్ షా ఉగ్రవాదచర్యలు లేదా ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టినా, దాన్ని ప్రోత్సహించినా లేదా ఉగ్రవాదంలో పాలుపంచుకున్నా ఆ వ్యక్తులపై చర్య తీసుకునే అధికారం ఈ చట్టం కింద ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ బిల్లు ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) కేసును పరిశోధిస్తున్న సమయంలో ఆస్తులు ఇతరత్రా స్వాధీనపరుచుకోవడం వంటి వాటికి అవకాశం ఉంటుంది.

‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2019ని రాజ్య సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు ఇలాంటి చర్యలను చిన్నారులపై పాల్పడిన వారిపై శిక్షను పెంచుతుంది. అంతేకాదు పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడ్డ వారిపై మరణశిక్ష విధించే ప్రొవిజన్ కూడా ఈ బిల్లులో ఉంది. ఈ బిల్లుపై జరుగుతున్న చర్చకు మహిళా, శిశు అభివృద్ధి మంత్రి స్మృతీజుబిన్ ఇరానీ స్పందిస్తూ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకుగాను 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అనుమతిం చిందని తెలిపారు. 

ముస్లిం విమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్)బిల్లు, 2019ని కూడా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును సర్వసాధఆరణంగా త్రిపుల్ తలాక్ బిల్లు అని పేర్కొంటారు. వాయిస్ వోటు ద్వారా ఈ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లుపై జరుగుతున్న చర్చకు స్పందిస్తూ న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ త్రిపుల్ తలాక్ చెప్పే విధానాన్ని నిషేధించడం ఈ బిల్లులోని ముఖ్య అంశమన్నారు. త్రిపుల్ తలాక్‌పై 2017లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినా కూడా ఆ విధానం ఇంకా కొనసాగుతోందన్నారు. త్రిపుల్ తలాక్ విధానం దేశంలో పలుచోట్ల ఇంకా కొనసాగుతూనే ఉందని ఆయన తెలిపారు. అలాంటి వందలకొద్దీ కేసులు రిపోర్టు అవుతున్నాయన్నారు. ఈ బిల్లు ఏ మతానికో, కమ్యూనిటీ వారికో వ్యతిరేకం కాదని కూడా ఆయన స్పష్టంచేశారు. ఈ బిల్లు ముస్లిం మహిళలకు సమానత్వాన్ని, గౌరవాన్ని చేకూర్చడం లక్ష్యంగా చేపట్టిందని స్పష్టంచేశారు. ఈ బిల్లును పలు దేశాల్లో నిషేధించడాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 


రచన: మోహన్ రావు, జర్నలిస్ట్

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన